ఆమె పాతికేళ్ళ వయసులోనే ఎంపీ అయిపోయారు. అది కూడా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల పై చిలుకు మెజారిటీ. ఆమె అల్లూరి జిల్లా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి. ఈ పదవికి ముందు ఆమె ఒక మామూలు యువతిగానే జీవితాన్ని సాగించేవారు. ఆమె తండ్రి ఎమ్మెల్యే అయినా ఆమె మాత్రం రాజకీయాలు వద్దు అనుకున్నారు.
కానీ జగన్ ఆమెను ఎంపిక చేసి ఏపీలో అతి పెద్ద నియోజకవర్గం అయిన అరకు నుంచి 2019 ఎన్నికల్లో బరిలోకి దింపారు. ఆమె ఘన విజయం సాధించి ఈ రోజున లోక్ సభలో వివిధ కమిటీలలో కూడా మెంబర్ గా ఉంటూ తన సత్తా చాటుతున్నారు.
జగన్ నినాదం అయినా గడప గడపకు మన ప్రభుత్వం కోసం ఎంపీ రంగంలోకి దిగి ఎక్కడా తగ్గేది లేదు అన్నట్లుగా దూసుకుపోతున్నారు. అరకు ఏజెన్సీలో గ్రామాలు అన్నీ కొండల మీదనే ఉంటాయి. దాంతో కారు ద్వారా ప్రయాణం చేయడం కష్టం. దీంతో ఎంపీ మాధవి స్కూటీతోనే చాలా చోట్ల కలియతిరుగుతున్నారు. అది కూడా వెళ్లదు అనుకుంటే కాలి నడకన కొండలెక్కి గుట్టలెక్కి ప్రతీ గడపను టచ్ చేసి వస్తున్నారు.
ఆమె పడుతున్న శ్రమను చూసిన వారు శభాష్ అంటున్నారు. ఎమ్మెల్యేల పనితీరులో గ్రేడింగ్స్ ఇస్తున్న జగన్ ఎంపీల విషయం తీసుకుంటే ఈ మహిళా ఎంపీకి మంచి ర్యాంక్ ఇవ్వడం ఖాయం అని అంటున్నారు. గిరిజనలకు ప్రభుత్వ పధకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని చూడడమే కాకుండా ఎక్కడ లోటు పాట్లు ఉన్నా కూడా వాటిని సవరించేలా అధికారులకు డైరెక్షన్ ఇస్తూ మాధవి అరకులో కలియతిరిగేస్తున్నారు.