ఏపీ, తెలంగాణ ఉప ఎన్నికకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తోంది. తెలంగాణతో పోల్చితే ఏపీలో ఉప ఎన్నికకు సంబంధించి ఎలాంటి హడావుడి కనిపించడం లేదు. తెలంగాణలో ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్‌కు, ఏపీలో డాక్టర్ వెంకటసుబ్బయ్య ఆకస్మిక మృతితో బద్వేలు అసెంబ్లీ నియోజక వర్గాలకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. అయితే హుజూరాబాద్‌తో పోల్చితే …బద్వేలులో అసలు ఎన్నిక వాతావరణమే లేదు.
తెలంగాణలో అభ్యర్థి ఎంపిక, ప్రచారం, దళిత బంధు పథకం అమలు…ఇలా ప్రతిదీ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ సర్కార్ చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ బద్వేలులో అలాంటివేవీ జరగడం లేదు.
ఇంకా ఉప ఎన్నికపై ఒక స్పష్టత రాకుండానే తెలంగాణలో రాజకీయ వేడి మొదలైంది. కానీ బద్వేలులో ఇటు పాలక పార్టీ, అటు ప్రతిపక్ష పార్టీలు అసలు ఆ ఊసే ఎత్తడం లేదు. కానీ బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించి వైసీపీ ఇప్పటికే తమ అభ్యర్థిని ఖరారు చేసింది. దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య భార్య డాక్టర్ సుధారాణిని వైసీపీ అభ్యర్థిగా జగన్ చాలా ముందుగానే నిర్ణయించారు.
తాజాగా శనివారం నుంచి నియోజకవర్గ ప్రజలకు ఆమె పరిచయం, ప్రచార కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్సీ, ఆ నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్ డీసీ గోవిందరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ నియోజకవర్గంలోని మండల కేంద్రమైన కలసపాడులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధారాణి పరిచయ కార్యక్రమాన్ని గోవిందరెడ్డి ప్రారంభించారు.
ఇక నుంచి బద్వేలు నియోజకవర్గమంతా డాక్టర్ సుధారాణి పర్యటిస్తూ ప్రజలకు చేరువ కానున్నారు. రానున్న ఎన్నికల్లో ఘన విజయం సాధించేందుకు వైసీపీ పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. అయితే ఎక్కడా ఆర్భాటాలకు చోటు ఇవ్వకపోవడం విశేషం.