మోడీజీ.. రాష్ట్రాల విభ‌జ‌న గాయాల‌నూ ప‌ట్టించుకోండి!

ప్ర‌తియేటా ఇక ఆగ‌స్టు 14వ తేదీని దేశం విభ‌జ‌న గాయాల స్మ‌తి దినోత్స‌వంగా జ‌రుపుకోవాల‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ పిలుపును ఇచ్చారు. దాదాపు 74 సంవ‌త్స‌రాల త‌ర్వాత పాత గాయాల గురించి ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. దేశ…

ప్ర‌తియేటా ఇక ఆగ‌స్టు 14వ తేదీని దేశం విభ‌జ‌న గాయాల స్మ‌తి దినోత్స‌వంగా జ‌రుపుకోవాల‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ పిలుపును ఇచ్చారు. దాదాపు 74 సంవ‌త్స‌రాల త‌ర్వాత పాత గాయాల గురించి ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. దేశ విభ‌జ‌న ప‌రిస్థితుల్లో త‌లెత్తిన గాయాల గురించి మోడీ ప్ర‌స్తావించారు. మంచిదే.. చ‌రిత్ర‌లోని చీక‌టిని దాచాల్సిన అవ‌స‌రం లేదు. 

చ‌రిత్ర‌ను గుర్తుంచుకుంటేనే భ‌విష్య‌త్తు గురించి ఆలోచించ‌గ‌లం. మ‌రి దేశ విభ‌జ‌న గురించి బాధ‌ప‌డ‌టం.. ఇన్నేళ్ల త‌ర్వాత ఓకే కానీ, విభ‌జ‌న అనేది రాష్ట్రానికి అయినా, దేశానికి అయినా .. కుటుంబానికి అయినా ఏమంత మంచిదైతే కాదు. ఉమ్మ‌డిగా ఉండ‌ట‌మే భార‌తీయ వాదం. అయితే భార‌తీయ జ‌న‌తా పార్టీ మాత్రం రాష్ట్రాల విభ‌జ‌న‌కు తాము ఎప్పుడూ సానుకూల‌మే అంటూ ఉంటుంది.

ఒక ఓటు.. రెండు రాష్ట్రాలు అంటూ బంప‌ర్ ఆఫ‌ర్ ఇస్తూ ఉంటుంది. బీజేపీ రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఇప్పుడు ప‌లు రాష్ట్రాల విభ‌జ‌న గురించి ఊహాగానాలు రేగుతుండ‌టం గ‌మ‌నార్హం. ప‌శ్చిమ‌బెంగాల్, యూపీ.. విష‌యంలో విభ‌జ‌న ఊహాగానాలున్నాయి. ఇక త‌మిళ‌నాడు విభ‌జ‌న గురించి కూడా భ‌క్తులు స‌మ‌ర్థిస్తూ వాదిస్తున్నారు. 

త‌మిళ‌నాడులో కూడా సార‌వంత‌మైన- ఆర్థికంగా ప‌రిపుష్టిని క‌లిగిన ప్రాంతాన్ని ప్ర‌త్యేక రాష్ట్రం చేస్తార‌నే టాక్ వినిపిస్తోంది. ఈ విష‌యాన్ని నోటితో ఖండిస్తూ, నొస‌టితో స‌మ‌ర్థిస్తున్నారు బీజేపీ నేత‌లు. మ‌రి ఆర్థిక వ‌న‌రులున్న ప్రాంతాల‌న్నీ.. ఇలా ప్ర‌త్యేక రాష్ట్రాలు అయిపోతే, మిగ‌తా ప్రాంతాల ప‌రిస్థితి ఏమిటి? ఆ ప్రాంతాల‌కు ఉత్తుత్తి హామీలు ఇవ్వ‌డ‌మే కేంద్ర ప్ర‌భుత్వాల విధానం కావొచ్చు!

విభ‌జ‌న‌గాయాలు అంటూ మోడీ మాట్లాడ‌టంతో.. తెలుగు వారికి ముందుగా గుర్తుకు వ‌చ్చేది ఉమ్మ‌డి ఏపీ విభ‌జ‌న గాయ‌మే. నీతి క‌థ‌ల్లో.. పొదుగు వైపు ఒక‌రికి, కొమ్ముల వైపు మ‌రొక‌రికి అని ఆవును పంచుకునే క‌థ ఒక‌టి ఉంటుంది. స‌రిగ్గా ఏపీ విభ‌జ‌న కూడా అలాగే చేశారు. ఈ పాపంలో కాంగ్రెస్-బీజేపీలు స‌మ‌పాళ్ల‌ను పంచుకున్నాయి. 

క‌నీసం కాంగ్రెస్ వాళ్లు హామీలైనా ఇచ్చారు. పార్ల‌మెంట్ సాక్షిగా ఇచ్చిన హామీల‌ను, మాట‌ల‌ను బీజేపీ తుంగ‌లో తొక్కింది. ఇది ఏపీ పౌరులెవ్వ‌రూ మ‌రిచిపోయే విష‌యం కాదు. ఎందుకంటే.. మోడీ చెప్పిన విభ‌జ‌న గాయాలు అనే మాట‌కు కేంద్ర ప్ర‌భుత్వాలు ఏపీకి చేసిన గాయ‌మే గుర్తుకు వ‌స్తుంది మ‌రి.

ఒక‌వైపు పార్ల‌మెంట్ కు ఉన్న విలువ గురించి బీజేపీ వాళ్లు మాట్లాడ‌తారు. మరోవైపు విభ‌జ‌న‌- గాయం అంటారు. అయితే.. పార్ల‌మెంట్ లో ఇచ్చిన హామీల‌ను ప‌ట్టించుకోరు, విభ‌జ‌న‌తో అయిన గాయాల‌నూ మాన్చే ప్ర‌య‌త్న‌మూ చేయ‌రు.  మాట‌ల‌తో బూరెలు వండే టైపు!