దేశంలో వయోజనులందరికీ కరోనా వ్యాక్సినేషన్ పూర్తయ్యే అంశం చర్చనీయాంశంగా కొనసాగుతూనే ఉంది. ఆగస్టు ఒకటి నుంచి రోజుకు కోటి డోసుల వ్యాక్సినేషన్ జరుగుతుందంటూ గతంలో కేంద్ర ప్రభుత్వం చాలా సార్లు ప్రకటించుకుంది. అయితే ఆగస్టు నెల సగం అయిపోయిన తర్వాత పరిస్థితిని గమనించినా.. అంత సీన్ లేదనే విషయం స్పష్టం అవుతోంది.
వ్యాక్సిన్ విషయంలో తాము అనుసరిస్తున్న పద్ధతిపై ఎన్ని విమర్శలు వచ్చినా కేంద్ర ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు. ప్రైవేట్ కు వ్యాక్సిన్లను కేటాయించడం, అక్కడ ప్రజలెవరూ డబ్బులిచ్చి వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఆసక్తి చూపకపోవడం జరుగుతున్నా.. అక్కడ కోట్ల డోసుల వ్యాక్సిన్లు ఫ్రిడ్జ్ లలో పెట్టేస్తున్నా.. వాటిని రాష్ట్ర ప్రభుత్వాల వైపుకు మళ్లించడానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలేమిటో ఇప్పటికీ ప్రకటన లేదు!
ఒకవైపు 45 యేళ్ల వయసు లోపు పౌరులు వ్యాక్సిన్ వేయించుకుంటామంటూ ముందుకు వస్తున్నా.. వారికి తగు రీతిలో డోసులు అందుబాటులో లేవు. అయితే ప్రైవేట్ ఆసుపత్రుల వద్ద మాత్రం కోట్ల డోసులు స్టాకు ఉన్నాయని స్వయంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటిస్తుంది! ఇక గతంలో ఆగస్టు ఒకటి నాటికి రోజుకు కోటి డోసులు అని ప్రకటించినా, ఇప్పటికీ అలాంటి దృశ్యాలేవీ కనిపించడం లేదు. ప్రస్తుత గణాంకాలను బట్టి చూస్తే.. రోజుకు 50 లక్షల స్థాయిలో వ్యాక్సిన్ జరుగుతోంది. అది కూడా ఒక్కో రోజే.
మిగతా రోజు 20 లక్షల నుంచి ముప్పై లక్షల స్థాయి అనే నంబర్ కూడా వినిపిస్తోంది. ఇదే రీతిన జరిగితే పూర్తి స్థాయి వ్యాక్సినేషన్ ఎప్పటికి? అంటే.. బహుశా వచ్చే ఏడాది మార్చి అనే మాట ఇప్పుడు వినిపిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ ఆఖరుకు దేశంలోని 18 యేళ్ల వయసు దాటిన అందరికీ వ్యాక్సిన్ అంటూ కేంద్రం గతంలో ప్రకటించినా, అది జరిగే పని కాదని ప్రస్తుత నంబర్లు స్పష్టం చేస్తున్నాయి.
ప్రస్తుతం సాగుతున్నట్టుగా సాగినా.. పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ జరిగే సమయానికి వచ్చే ఏడాది మార్చి రావొచ్చనే అంచనాలు ఏర్పడుతున్నాయిప్పుడు. కనీసం వచ్చే ఏడాది మార్చికైనా అందరికీ డోసేజ్ లు అందితే మంచిదే కానీ, ఆ లోపు కరోనా ఎలాంటి పరిణామాలను సృష్టిస్తుందనేదే ఆందోళనకరమైన అంశం.