ఆచార్య సినిమా ఎప్పుడు వస్తుంది? ఇది దర్శకుడు కొరటాల శివకు మాత్రమే జవాబు తెలిసిన ప్రశ్న. ఆయన మదిలో ఆచార్యను సంక్రాంతికి వేయాలని వుంది. కానీ ఆయన కన్నా ఓ అడుగు ముందుకు వేసి పవర్ స్టార్ సినిమా భీమ్లానాయక్ డేట్ ఇచ్చేసారు.
అక్కడితో ఆగకుండా దాని అప్ డేట్స్ కూడా ఇవ్వడం మొదలుపెట్టేసారు. అయినా కూడా మెగాస్టార్ ను ఎలాగోలా ఒప్పించి సంక్రాంతికే డేట్ వేయాలని కొరటాల శివకు వుంది అని బోగట్టా.
అసలు అక్టోబర్ బరి ఖాళీగానే వుంది. ఆర్ఆర్ఆర్ అనుకున్న డేట్ కు రావడం లేదనే బలంగా వినిపిస్తోంది. మరి ఆ డేట్ ను కొరటాల శివ ఎందుకు తీసుకోవడం లేదో తెలియదు. అఖండ సినిమాతో పోటీ పడుతుంది అని అనుకుంటున్నారేమో? ఇదిలా వుంటే ఓ టాప్ హీరో చేతిలో వున్న భారీ సినిమా పూర్తి చేయకుండా మరో సినిమాను మొదలుపెట్టేయడం చిత్రం.
ఆచార్య సినిమాలో మెగాస్టార్ వర్క్ ఇంకా పూర్తి కాలేదు. రామ్ చరణ్ కాంబినేషన్ లో పాట, కొన్ని సీన్లు వున్నాయి. అవన్నీ సెప్టెంబర్ లో తండ్రీ కొడుకులు ఇచ్చే డేట్ లను బట్టి పూర్తి చేసుకోవాల్సి వుంటుంది. మరి లూసిఫర్ రీమేక్ మీదకు వెళ్లిపోయిన మెగాస్టార్ మళ్లీ డేట్ లు ఎప్పుడు సర్దుబాటు చేస్తారో చూడాల్సి వుంది.
ఏ క్షణంలో అయితే ఆచార్య సినిమాను అన్ని విధాలా నిర్మాత నిరంజన్ రెడ్డి నుంచి దర్శకుడు కొరటాల శివ టేకోవర్ చేసారని వార్తలు వచ్చాయో, అప్పటి నుంచి ఆ సినిమా అలా అడుగు..అడుగు మెల్లగా వేస్తూనే వుంది. ఇప్పటి వరకు ఓ పాట మినహా మరో అప్ డేట్ కూడా లేదు.