పృధ్వికి నానినేటెడ్ పదవి దక్కిన వేళ.. అలీకి కూడా ఏదో ఒక పదవి వస్తుందంటూ ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో.. నటుడు పోసానికి కూడా ఓ మంచి నామినేటెడ్ పదవి దక్కే అవకాశం ఉందంటూ ప్రచారం సాగుతోంది. దీనిపై పోసాని స్పందించారు.
“2011లో జగన్ కోసం ఇండస్ట్రీ నుంచి నేను, రోజా మాత్రమే ఉన్నాం. అప్పట్నుంచి జగన్ ను అభిమానిస్తూ, ఫాలో అవుతూ ఉన్నాను. మొన్న ఎన్నికల్లో కూడా జగన్ కోసం నేను ఎంత చేయగలిగానో ఉడతాభక్తిగా అంతా చేశాను. జగన్ కు సంబంధించిన మనుషులు ఎన్నికలకు ముందే నా ఇంటికొచ్చారు. అన్నా మీకు రాజ్యసభ ఎంపీ కావాలా ఇంకేదైనా కావాలా చెప్పండని అడిగారు. జగన్ సీఎం అయిన తర్వాత చూద్దామని నేనే పంపించాను.”
పదవుల కోసం గుంటకాడ నక్కలాగ వెయిట్ చేయనంటున్నారు పోసాని. జగన్ స్వయంగా పిలిచి ఏదైనా పదవి ఇస్తే స్వీకరిస్తానని స్పష్టంచేశారు. తను మాత్రం ఇగో చంపుకొని పదవులు అడగనని స్పష్టంచేశారు. పదవి కోసం వేరొకరితో పైరవీలు చేయనని, తనకు తానుగా వెళ్లి అడగనని స్పష్టంచేశారు.
“నాకేం కావాలో చెప్పమని ఎన్నికలకు ముందే అడిగారు. ఏం వద్దని అప్పుడు చెప్పి పంపించాను. జగన్ ను సీఎంగా చూడాలనుకున్నాను. చూశాను. ఇప్పుడు జగన్ నన్ను పిలిచి ఏదైనా పదవి లేదా పని ఇచ్చి ఇది చేయమని ఆదేశిస్తే చేస్తా. జగన్ స్వయంగా పిలిచి ఆదేశిస్తే చేయకుండా ఎలా ఉంటాను. అందులో నాకు ఎలాంటి ఇగోలు లేవు. నాకుగా నేను మాత్రం ఎవ్వర్నీ ఏమీ అడగను. ఈ పని చేస్తే బాగుంటుందని జగన్ నన్ను అడిగితే మాత్రం చేస్తాను. పదవుల కోసం గుంటకాడ నక్కలాగ నేను చూడట్లేదు.”
వైఎస్ఆర్ ను మినహాయిస్తే.. 1980 నుంచి పనిచేసిన ముఖ్యమంత్రులు అందరికంటే జగన్ చాలా బెస్ట్ అంటున్నారు పోసాని. మేనిఫెస్టోలో చెప్పిన విషయాల్ని అమలుచేసేందుకు ఇప్పట్నుంచే కార్యాచరణలోకి దిగడం తనకు నచ్చిందంటున్నారు. తను ఆరోగ్య పరిస్థితిపై వివరణ ఇచ్చేందుకు ప్రెస్ మీట్ పెట్టిన పోసాని, నామినేటెడ్ పదవులపై ఇలా స్పందించారు.