తన ప్రవచనాలతో జనసైనికుల్ని సతాయిస్తున్న పవన్ కల్యాణ్, అడపాదడపా వాళ్లకు క్లాసులు కూడా పీకుతుంటారు. తాజాగా అలాంటిదే మరో కార్యక్రమం నడిచింది. జనసైనికులతో జరిగిన మీటింగ్ లో ఓ రేంజ్ లో వారిపై మండిపడ్డారు. గల్లీకో నాయకుడ్ని తయారుచేస్తానంటూ ప్రగల్భాలు పలికిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు కార్యకర్తల్లో నాయకత్వ లక్షణాలు లేవంటూ ఎగిరి పడుతున్నారు.
మీలో ఓపికలేదు, మీకు సహనం లేదు అంటూ క్లాస్ పీకారు పవన్. ఎప్పుడూ నావెంట తిరిగే నాయకులు, నేను లేకపోతే కనపడరని, నన్ను క్షేత్రస్థాయికి వెళ్లమని సలహా చెప్పేవాళ్లు, వారే జనాల్లోకి వెళ్లి తిరగొచ్చు కదా అని అన్నారు పవన్. తూర్పుగోదావరి జిల్లాలో లోకల్ పాలిటిక్స్ ఎక్కువయ్యాయని, ఎవరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం వారు పాకులాడారు కానీ, పార్టీ కోసం పనిచేయలేదని కాస్త గట్టిగానే తన ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికలకు ముందే ఈ విషయాలన్నీ తనకు తెలుసని కూడా అన్నారు పవన్ కల్యాణ్. “నన్ను అసెంబ్లీకి పంపండి, నేను కేంద్రంతో ఫైట్ చేస్తా.. అంతేగాని నన్ను మీ మధ్యలోనే ఉంచుకుంటే నేనెలా పోరాడగలను, నేను ఒక్కడినే కదా.” అంటూ తెగ ఇదైపోయారు జనసేనాని. ఓడిపోయాననే బాధ, అసెంబ్లీలో అడుగుపెట్టలేకపోయాననే అసహనం పవన్ స్పీచ్ లో స్పష్టంగా కనిపించింది. ఆ కోపాన్ని ఇలా కార్యకర్తలపై ప్రదర్శించారు.
మొత్తమ్మీద తమని అనునయించే పవన్ కల్యాణ్ ని కాకుండా.. తమపై ఎగిరిపడే నాయకుడిని చాన్నాళ్ల తర్వాత చూశారు జనసైనికులు. పవన్ నుంచి ప్రవచనాలు ఎంత కామనో, ఇలా అధినేతతో క్లాస్ పీకించుకోవడం కూడా కార్యకర్తలకు అంతే కామన్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. నాయకులు దొరకరు, వారిని మనమే తయారు చేసుకోవాలి, గల్లీకో నాయకుడిని తయారు చేస్తా, నాతో చేతులు కలపండి అంటూ ఎన్నికలకు ముందు నమ్మకంగా చెప్పిన పవన్ కల్యాణ్ ఎన్నికల తర్వాత మాత్రం ఇలా ప్లేటు ఫిరాయించారు.
కార్యకర్తల వైఫల్యాలపై పడి ఏడుస్తున్న పవన్, తన వైఫల్యాలను ఎప్పుడు తెలుసుకుంటారో అర్థం కావడం లేదు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కార్యకర్తలపై ఇలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకరకంగా పార్టీలో పెరుగుతున్న అసమ్మతి స్వరాలకు ఆయన ఈ విధంగా చెక్ పెడుతున్నారేమో అనుకోవాలి. నాగబాబు కూడా తమ్ముడు మాటే ఫైనల్, ఆయనకో విజన్ ఉంది అంటూ జనసైనికులంతా ఆయనకి ఎదురు చెప్పకూడదన్నట్టు మాట్లాడారు.