పదవుల కోసమే రాజకీయాల్లోకి రావాలనుకుంటే పార్టీ పెట్టాల్సిన అవసరం లేదని, జాతీయస్థాయి నాయకులతో ఉన్న పరిచయాలు, స్టార్ డమ్ ఉపయోగించుకుంటే చాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం ఊపిరి ఉన్నంత వరకు పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. డబ్బు, పేరు కోసం ఏనాడూ పాకులాడలేదని, మానవత్వం చచ్చిపోకూడదని మాత్రమే నా వంతు ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు.
జనసేన పార్టీ డబ్బు బలంతో పుట్టిన పార్టీ కాదని, అభిమానం, ఆశయ బలంతో స్థాపించినది అన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సర్వసాధారణమని, ఓటమి నుంచి జనసేన పార్టీ శిల్పాకృతి తీసుకుంటుందన్నారు. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని నాయకులు, జనసైనికులతో పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. గెలుపులో ఎవరు మనవాళ్లో, ఎవరు పరాయివాళ్లో తెలియదు కానీ, ఓటమిలో మాత్రం మనవాళ్లు ఎవరో కచ్చితంగా తెలుస్తుంది.
ఎన్నికల్లో గెలిచిన పార్టీ మీటింగ్ పెట్టినా ఇంతమంది రారేమో. పార్టీ గెలుపులో కాదు, ఓటమిలో కలుసుకున్నాం… మీరంతా నా ఆత్మబంధువులు. నా కుటుంబానికి అన్యాయం జరిగితే రాజకీయాల్లోకి రాలేదు. అన్యాయానికి గురవుతున్న విద్యార్ధులు, ఆడపడుచుల ఆవేదన, ప్రభుత్వాల తప్పుడు విధానాలు చూసి మార్పుకోసం రాజకీయాల్లోకి వచ్చాను.