చంద్రబాబులా జగన్‌ ‘స్టంట్లు’ చేయాలా.?

పోలవరం ప్రాజెక్టు విషయమై అసెంబ్లీలో చర్చ జరిగితే, అధికార పక్షం పారిపోయిందంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు మీడియా ముందు నానా యాగీ చేస్తున్న విషయం విదితమే. నిజానికి, అసెంబ్లీ నుంచి పారిపోయింది తెలుగుదేశం…

పోలవరం ప్రాజెక్టు విషయమై అసెంబ్లీలో చర్చ జరిగితే, అధికార పక్షం పారిపోయిందంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు మీడియా ముందు నానా యాగీ చేస్తున్న విషయం విదితమే. నిజానికి, అసెంబ్లీ నుంచి పారిపోయింది తెలుగుదేశం పార్టీనే. తొలి బడ్జెట్‌ సమావేశాల్లోనే తెలుగుదేశం పార్టీ తన నైజాన్ని ప్రదర్శించేసింది. అడ్డగోలు వాదనలతో సభలో అభాసుపాలయ్యింది. చివరికి, సస్పెన్షన్లదాకా పరిస్థితిని తెచ్చుకుంది.. వాకౌట్లూ జరిగిపోయాయి.

ఇక, బడ్జెట్‌ సమావేశాలు పూర్తయ్యాక మాజీమంత్రి, టీడీపీ సీనియర్‌ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా ముందుకొచ్చారు. గతంలో పోలవరం ప్రాజెక్టు విషయమై మంత్రిగా దేవినేని ఉమ చేసిన హంగామా చూశాం. అదే స్థాయిలో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కూడా హంగామా చేయాలన్నది దేవినేని ఉమ ఉవాచ. పోలవరం ప్రాజెక్టు పనులు ఆగిపోయాయనీ, ప్రాజెక్టుల పట్ల వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనమని సెలవిచ్చారు దేవినేని ఉమ. తమ హయాంలో 70శాతం పనులు పూర్తయితే, వైఎస్‌ జగన్‌ రీ-టెండరింగ్‌ పేరుతో ప్రాజెక్టుని అటకెక్కించాలని చూస్తున్నారని ఆరోపించేశారాయన.

నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుంది దేవినేని ఉమ వాదన. 2018 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామనీ, గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇచ్చేస్తామని చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ఒకటికి వందసార్లు చెప్పుకొచ్చారు.. జనాల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. చంద్రబాబు భజనలో మునిగితేలిన దేవినేని ఉమ, కేంద్రానికి మంత్రిగా ఇవ్వాల్సిన స్థాయిలో సరైన నివేదికలు ఇవ్వక.. పోలవరం ప్రాజెక్టు పేరుతో కేవలం పబ్లిసిటీ స్టంట్లకే పరిమితమయ్యారు.

చంద్రబాబు సర్కార్‌ చేసినట్లే, వారంలో ఓ రోజుని పోలవరం ప్రాజెక్టు పేరు చెప్పి పబ్లిసిటీ స్టంట్‌ వైఎస్‌ జగన్‌ కూడా చేయాలని తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు భావిస్తే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. గ్యాలరీ వాక్‌ అని ఓసారి.. గేటు నిర్మాణం అని ఇంకోసారి.. ఇలా చంద్రబాబు చేసిన పబ్లిసిటీ స్టంట్లు తప్ప, అక్కడ పోలవరం ప్రాజెక్టు వద్ద నిజానికి ఆ స్థాయిలో పనులు వేగంగా జరిగిన దాఖలాల్లేవు టీడీపీ హయాంలో.

టెండర్ల పేరుతో జరిగిన అడ్డగోలు అవినీతిని వెలికి తీసి, కేంద్రం నుంచి రాబట్టాల్సిన నిధుల్ని రాబట్టి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయాలన్నది వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ఆలోచన. ప్రాజెక్టు అథారిటీతో సమావేశమై, ఇంజనీర్లతో చర్చించి, వారు ఇచ్చిన నివేదికలకు, వారు చెప్పిన డెడ్‌లైన్లకు అనుగుణంగా.. ఇంకాస్త సమయం ఇచ్చి, 2021 నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తవుతుందని వైఎస్‌ జగన్‌ ప్రకటించిన విషయం విదితమే.

ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ 60 రోజుల పాలనకే తెలుగుదేశం పార్టీ ఇంతలా వెర్రి తలలు వేసేయడం హాస్యాస్పదం కాక మరేమిటి.? ఏకంగా ఐదేళ్ళు పోలవరం ప్రాజెక్ట్‌ పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేసింది టీడీపీ. కొత్త సర్కార్‌కి, ఇంత పెద్ద ప్రాజెక్టు విషయమై కనీసం ఆరు నెలలైనా సమయం ఇవ్వాలన్న ఇంగితం టీడీపీకి లేకపోవడాన్ని ఏమనుకోవాలి.?  

రాజకీయ నటన కంటే సినిమాల్లో నటన మంచిది