పాద‌యాత్ర‌లు, మోకాళ్ల యాత్ర‌లు!

కేంద్ర ప్ర‌భుత్వంపై తెలంగాణ అధికార పార్టీ నాయ‌కులు ఒంటికాలిపై లేస్తున్నారు. ఏ చిన్న అవ‌కాశం దొరికినా మోదీ స‌ర్కార్‌ను చాకి రేవు పెడుతున్నారు. తాజాగా కేంద్ర ప్ర‌భుత్వంపై మంత్రి హ‌రీశ్‌రావు విరుచుకుప‌డ్డారు. హైద‌రాబాద్‌లో మిష‌న్…

కేంద్ర ప్ర‌భుత్వంపై తెలంగాణ అధికార పార్టీ నాయ‌కులు ఒంటికాలిపై లేస్తున్నారు. ఏ చిన్న అవ‌కాశం దొరికినా మోదీ స‌ర్కార్‌ను చాకి రేవు పెడుతున్నారు. తాజాగా కేంద్ర ప్ర‌భుత్వంపై మంత్రి హ‌రీశ్‌రావు విరుచుకుప‌డ్డారు. హైద‌రాబాద్‌లో మిష‌న్ భ‌గీర‌థ కార్యాల‌యంలో రాష్ట్ర వైద్యారోగ్య‌, ఆర్థిక శాఖ మంత్రి హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.

త‌మ ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను కేంద్ర‌మంత్రులు ఢిల్లీలో ప్ర‌శంసిస్తూ, గ‌ల్లీలో మాత్రం విమ‌ర్శ‌లు చేయ‌డం స‌బ‌బు కాద‌న్నారు. ఒక‌వైపు అవార్డులు ఇస్తూనే, మ‌రోవైపు అవినీతి జ‌రిగింద‌ని కేంద్ర మంత్రులు విమ‌ర్శించ‌డం విడ్డూరంగా ఉంద‌ని మండిప‌డ్డారు. ఇలాంటి రాజ‌కీయాలు చేయ‌డం మానుకోవాల‌ని ఆయ‌న హిత‌వు ప‌లికారు. కేంద్రానికి ద‌మ్ముంటే తెలంగాణ ప‌థ‌కాల‌కు నిధులిచ్చి వాటా గురించి మాట్లాడాల‌ని కోరారు.

మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కానికి జాతీయ అవార్డు రావ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాల‌న‌లో నీళ్లు, క‌రెంట్ స‌మ‌స్య‌లు లేవ‌న్నారు. పాద‌యాత్ర‌లు, సైకిల్ యాత్ర‌లు, మోకాళ్ల యాత్ర‌లు చేస్తున్న నాయ‌కులకు తెలంగాణ ప్ర‌జ‌లు బుద్ధి చెబుతార‌ని మంత్రి హ‌రీశ్‌రావు ఘాటు హెచ్చ‌రిక చేశారు. క్వాలిటీ, క్వాంటిటీ, రెగ్యులారిటీ తెలంగాణ ప్ర‌త్యేక‌త అన్నారు. దేశంలో ఇప్ప‌టికీ 50 శాతం మంది ప్ర‌జ‌ల‌కు తాగునీరు అంద‌డం లేద‌న్నారు.

వందకు వందశాతం తాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్ర‌మే అని మంత్రి స్ప‌ష్టం చేశారు. తెలంగాణ ప‌థ‌కాల‌ను కేంద్రం కాపీ కొట్టి అమ‌లు చేస్తోంద‌న్నారు. ఇది త‌మ‌కు సంతోషాన్ని ఇస్తోంద‌న్నారు. మిష‌న్ భ‌గీరథ‌కు రూ.19 వేల కోట్లు ఇవ్వాల‌ని నీతి ఆయోగ్ చెప్పింద‌న్నారు. అయిన‌ప్ప‌టికీ 19 పైస‌లు కూడా ఇవ్వ‌లేద‌ని మంత్రి మండిప‌డ్డారు.