దేశ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగో స్థానంలో నిలిచి యావత్ దేశ దృష్టిని ఆకర్షించారు. అయితే అత్యంత చిన్న వయసులో ముఖ్యమంత్రి పదవిని సాధించి, బాధ్యతలు చేపట్టిన ఆ క్షణం నుంచి మ్యానిఫెస్టో అమలుకు జగన్ శ్రీకారం చుట్టి ప్రజల్లో పలుకుబడి పెంచుకున్నారు. మరోవైపు ప్రధాని మోదీ పనితీరుపై దేశ వ్యాప్తంగా 65.69 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు.
దేశ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మొదటి స్థానంలో నిల వగా, ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ భగేల్ రెండో స్థానంలోనూ, కేరళ సీఎం పినరయ్ విజయన్ మూడో స్థానంలో నిలిచారు. సీ ఓటర్-ఐఏఎస్ఎస్ సంయుక్తంగా దేశ వ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో 3 వేల మందితో గత నెల చివరి వారంలో నిర్వహించిన సర్వేలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాలను టైమ్స్ ఆఫ్ ఇండియా డాట్కామ్ మంగళవారం ప్రముఖంగా ప్రచురించడం విశేషం.
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనపై మొత్తం 78.01 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానంగా జగన్ విశేష ప్రజాదరణ పొందడానికి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, ఎల్లో మీడియా కీలక పాత్ర పోషించాయని చెప్పొచ్చు. ఎందుకంటేఊ అత్యంత ప్రజాదరణతో అధికార పగ్గాలు చేపట్టిన జగన్పై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, ఎల్లో మీడియా చూపుతున్న వివక్ష జనాల్లో వాటిపై వ్యతిరేకతను. అదే సమయంలో సీఎంపై సానుభూతిని పెంచుతోంది. ఉదాహరణకు ఈ సర్వే ఫలితాలనే తీసుకుందాం.
సీ ఓటర్-ఐఏఎస్ఎస్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఏపీ సీఎం జగన్ నాలుగో స్థానంలో నిలిచేదా ప్రజల ఆదరణ పొందడం తెలుగు వారిగా అందరూ గర్వించాల్సిన విషయం. కానీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, వాటి అనుబంధ చానళ్లు ఏబీఎన్, టీడీపీ 5(టీవీ5), ఈటీవీ తదితర చిన్నాచితకా మీడియా సంస్థలకు అసలు ఇష్టం లేదు. టైమ్స్ ఆఫ్ ఇండియా డాట్కామ్ సంస్థ మంగళవారం ప్రధాన కథనంగా ప్రచురించడంతో వైరల్ అయింది. అయితే ఈ సమాచారాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ఎలా క్యారీ చేస్తాయో తెలుసుకోవాలనే ఆసక్తి సహజంగానే అందరిలోనూ ఉండింది.
ఈనాడులో కనీసం ఒక్క అక్షరం కూడా రాయకుండా జగన్పై తన అక్కసును మరోసారి వెళ్లగక్కింది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే మోదీ పనితీరు బాగుంది అనే శీర్షికతో లోపలి పేజీలో ఓ చిన్న సింగిల్ కాలమ్ వార్తను క్యారీ చేశారు. అది కూడా కేవలం ప్రధాని మోదీకి సంబంధించి వివరాలు అందించారు. ఇక ముఖ్యమంత్రుల్లో ఒడిశా సీఎం నవీన్పట్నాయ్ ఉత్తమ సీఎంగా అభిప్రాయపడ్డారంటూ ఏక వాక్యంతో కొట్టి పారేశారు.
జగన్ ప్రజాదరణ పొందారంటే వీళ్లకు కడుపు మంట ఎందుకో అర్థం కాదు. ఇదే ఆర్ఎస్ఎస్ పత్రికలో ముక్కూ మొహం తెలియని జర్నలిస్ట్ జగన్ను జగ్లక్ అని రాస్తే మాత్రం కళ్లకద్దుకుని ప్రచురించడాన్ని చూశాం. జగన్ చేసే మంచి గురించి రాయకూడదు, మంచి గురించి చెప్పకూడదు, మంచి గురించి చూడకూడదనే టీడీపీ, ఎల్లో మీడియా విపరీత ధోరణులే జగన్ ఇమేజ్ను పెంచుతున్నాయి.
బహుశా దేశంలో ఏ నాయకుడు వ్యక్తిగత దూషణకు గురి కానంతగా జగన్ ప్రధాన ప్రత్యర్థి టీడీపీ, ఎల్లో మీడియా నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. జగన్ తప్ప మరో నాయకుడు ప్రత్యర్థి రాజకీయ పార్టీ, మీడియా చేసే వ్యక్తిదాడిని ఎదుర్కోలేడన్నంత దుష్ప్రచారం చేశారు. పద్మవ్యూహంలో అభిమన్యుడు ప్రాణాలు కోల్పోయాడు. కానీ టీడీపీ, ఎల్లో మీడియా పన్నిన పద్మవ్యూహంలో జగన్ పోరాడి విజేతగా నిలిచాడు. అందుకే ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీ, కాంగ్రెస్ కలిసి జగన్పై కేసులు వేయడం, జైలుకు పంపడం అందిరికీ తెలిసిందే. మరోవైపు అవినీతిపరుడిగా ముద్రవేసి పదేపదే ఎత్తిపొడుస్తూ మానసికంగా కుంగదీసేందుకు ఘాటైన విమర్శలు, రాతలతో శత విధాలా ప్రయత్నించినా జగన్ ఎక్కడా అదరలేదు, బెదరలేదు. ధైర్యపరుడినే జనం ఆదరిస్తారనేందుకు నిలువెత్తు నిదర్శనం జగన్.
అడుగడుగునా రాజకీయ, మీడియా వివక్షను జగన్ ఎదుర్కొన్నాడు. ఇప్పటికీ సీఎం స్థాయిలోనూ జగన్ మతపరంగా వివక్షను ఎదుర్కోవాల్సిన దుస్థితి. జగన్ క్రిస్టియన్ కావడాన్ని సాకుగా తీసుకుని ప్రతి సందర్భంలోనూ హిందువుల మనోభావాలంటూ నోటా పార్టీలు తెరపైకి కొత్త వాదన తీసుకురావడాన్ని చూస్తున్నాం. జగన్పై సహజంగా ఉన్న ప్రజాదరణకు తోడు ప్రధాన ప్రత్యర్థి టీడీపీ, ఎల్లో మీడియా వివక్ష కూడా ఆయనపై మరింత సానుభూతి పెరగడానికి దోహదం చేస్తోంది. జగన్ అంటే జనం- జనం అంటే జగన్ అనే నినాదానికి నిలువెత్తు నిదర్శనం సీ ఓటర్-ఐఏఎస్ఎస్ సర్వే అని చెప్పక తప్పదు. జనం ఆశలకు, ఆకాంక్షలకు జగన్ ప్రతిరూపం. పోరాటానికి పర్యాయ పదం. జనం గుండె చప్పుడును సీ ఓటర్-ఐఏఎస్ఎస్ సర్వే ప్రతిబింబించిందని చెప్పక తప్పదు.