కరోనా వైరస్ ప్రమాదకారి అని స్పష్టం అవుతోంది. అయితే ఆ వైరస్ గురించి ఎలాంటి స్పష్టత లేని మీడియా, కొందరు మేధావులు ఇష్టానుసారం చెబుతూ ఉన్నారు. ఆ అంచనాలు ప్రజలకు అవగాహనను ఇచ్చి, వారికి ధైర్యాన్ని ఇచ్చేవిలా ఉంటే అదో లెక్క. అయితే ఆ వైరస్ పుట్టుపూర్వోత్తరాల గురించి ఇప్పటికీ పెద్దగా తెలిసింది ఏమీ లేదు. అయినా రానున్న రోజుల్లో ఇండియాలో ఏకంగా 50 కోట్ల మందికి కరోనా సోకుతుందంటూ కూడా కొంతమంది బెదరగొడుతూ ఉన్నారు. ఎవడికి ఇష్టం వచ్చింది వాడు ప్రచారం చేస్తూ.. భయపెడుతున్నారు అని స్పష్టం అవుతోంది. అలాగే కరోనా వస్తే 60 యేళ్ల పై వయసు వారి పరిస్థితి అంతేనన్నట్టుగా పేరున్న మీడియా వర్గాలు కూడా తమ విశ్లేషణలు చేస్తూ ఉన్నాయి.
ఇప్పటి వరకూ ప్రభుత్వం విడుదల చేసిన నంబర్లను పట్టుకుని కరోనా మీద మీడియా వర్గాలు ఎవరికి తోచింది వారు జనం మీద రుద్దుతూ ఉన్నాయి. ఇండియాలోనే కరోనా పరిస్థితిని గమనిస్తే… ఈ నంబర్లను ఒకటి ఆశావహ ధోరణిలోనూ చూడవచ్చు, నిరాశావహ ధోరణిలోనూ చూడవచ్చు. తొలి కేసు రిజిస్టర్ అయిన నెలల తర్వాత కూడా ఇండియా వంటి భారీ జనాభా ఉన్న దేశంలో రెండు లక్షల కేసులు అనేది చాలా చిన్న నంబర్ అనే అభిప్రాయాన్నీ వ్యక్తం చేయవచ్చు! వామ్మో రెండు లక్షలకు చేరిపోయిందా అంటూ భయపడనూ వచ్చు. ఇది ఎవరికి వారు డిసైడ్ చేసుకోవాల్సిన అంశం. అభిప్రాయం ఏదైనా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మాత్రం అందరి మీదా ఉంది.
ఇలాంటి క్రమంలో.. టైమ్సాఫ్ ఇండియా వెబ్ సైట్లో ఒక నెటిజన్ ఆసక్తిదాయకమైన కామెంట్ పెట్టాడు. కరోనా వైరస్ ఇండియాలో వృద్ధులపై ప్రతాపం చూపుతుందంటూ రాసిన వార్త గురించి ఆ యూజర్ చేసిన విశ్లేషణ ఆసక్తిదాయకంగా ఉంది.
'ప్రతి సంవత్సరం ఇండియాలో ప్రతి వెయ్యి జనాభా కూ ఏడు మంది అనేక కారణాల చేత మరణిస్తూ ఉన్నారు. 130 కోట్ల జనాభాలో ప్రతియేటా కోటి మంది మరణిస్తున్నట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. అంటే ప్రతి నెలా సగటును 8.9 లక్షల మంది ఇండియాలో చనిపోతూ ఉన్నారు. మనదేశంలో కనీసం 10 శాతం మంది 60 యేళ్ల పై వయసువారున్నారు. మరణాల్లో కూడా వారి రేటు అదే అనుకుంటే, నెలకు దాదాపు 90 వేల మంది. కరోనాతో గత రెండు నెలల్లో దేశం మొత్తం మీద చనిపోయిన వారి సంఖ్య 6000 మంది. అంటే నెలకు మూడు వేల మంది. వారిలో వృద్ధుల సంఖ్య 50 శాతం అంటున్నారు. అంటే 1500 మంది. కరోనా వృద్ధులపై ప్రతాపం చూపుతోంది అని మీరు అంటున్నారు. వాస్తవ గణాంకాలకూ మీరు చెబుతున్న గణాంకాలకు పోలిక మాటేంటి?' అంటూ ఆ వ్యక్తి కామెంట్ చేశాడు. ప్రతి నెలా దాదాపు 9 లక్షల మరణాలు నమోదు అయ్యే దేశంలో 3 వేల మరణాలను చూపి ప్రజలను తీవ్రంగా బెదరగొడుతున్నారు అనే శ్లేష ఒకటి ఉంది ఈ యూజర్ కామెంట్ లో.
పై నంబర్లను బట్టి కరోనా భారతీయులను ఏం చేయడం లేదని చెప్పడం లేదు. కరోనా కరోనానే. లేకపోతే ప్రపంచ దేశాలన్నీ అంత బెదిరిపోవు. ఆ యూజర్ కామెంట్ ఒక దృష్టి కోణం మాత్రమే.