లూథియానా, బెంగళూరు.. ఏపీకి ముందస్తు హెచ్చరికలు

పంజాబ్ లో స్కూల్స్ తెరిచిన కొన్ని రోజుల వ్యవధిలోనే 20మంది చిన్నారులు కొవిడ్ బారిన పడ్డారన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ దశలో బెంగళూరులో ఏకంగా 242 మంది చిన్న పిల్లలకు కొవిడ్ వైరస్…

పంజాబ్ లో స్కూల్స్ తెరిచిన కొన్ని రోజుల వ్యవధిలోనే 20మంది చిన్నారులు కొవిడ్ బారిన పడ్డారన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ దశలో బెంగళూరులో ఏకంగా 242 మంది చిన్న పిల్లలకు కొవిడ్ వైరస్ సోకిందని నగర కార్పొరేషన్ అధికారికంగా ప్రకటించడం మరింత భయాందోళనలకు కారణమైంది. 

థర్డ్ వేవ్ వస్తోందని, చిన్నపిల్లలకు ప్రమాదం అని ఇటీవల కాలంలో వార్తలు వచ్చాయి. అయితే ఇవన్నీ వట్టి పుకార్లేనని చాలామంది తేల్చేశారు. కానీ ఇప్పుడిప్పుడు వెలుగులోకి వస్తున్న కేసులు ఆ భయాలనే నిజం చేసేలా ఉన్నాయి.

బెంగళూరులో 5 రోజుల వ్యవధిలో 242మంది చిన్నపిల్లలు కరోనా బారిన పడ్డారు. వీరంతా 19 సంవత్సరాల వయసు లోపు వారు. 9 ఏళ్లలోపు వారిలో 106మందికి కొవిడ్ సోకినట్టు నిర్థారణ అయింది. కొవిడ్ పాజిటివ్ గా తేలినా వీరిలో చాలామంది స్వల్ప లక్షణాలతోనే బాధపడుతున్నారు. వీరందరినీ హోమ్ ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్య సిబ్బంది. అత్యవసరం అయితే ఆస్పత్రులకు తీసుకు రావాలని చెప్పారు.

ఇక పంజాబ్ లో స్కూల్స్ తెరవడం వల్ల 20మంది విద్యార్థులకు కరోనా సోకింది. లూథియానాలోని కొన్ని స్కూల్స్ లో పిల్లలు కొవిడ్ లక్షణాలతో బాధపడుతుండటంతో వారికి కొవిడ్ టెస్ట్ చేయించారు. పాజిటివ్ గా తేలింది. దీంతో ఆ విద్యార్థులందర్నీ హోమ్ ఐసోలేషన్ కి పంపించారు. స్కూల్స్ శానిటైజ్ చేయించి 5 రోజులు సెలవు ప్రకటించారు.

మిగతా రాష్ట్రాల సంగతేంటి..?

ఓవైపు దేశవ్యాప్తంగా కొవిడ్ కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. మరోవైపు పంజాబ్, కర్నాటకల్లో పిల్లలకు కొవిడ్ వచ్చినట్టు నిర్థారణ అవుతోంది. దీంతో స్కూల్స్ తెరిచేందుకు మిగతా రాష్ట్రాలేవీ ధైర్యం చేయడం లేదు.

తమిళనాడు సెప్టెంబర్ తర్వాతే అంటోంది, తెలంగాణలో అధికారులు ప్రభుత్వానికి నివేదికలిస్తున్నా కేసీఆర్ సర్కారు మాత్రం సైలెంట్ గా ఉంది. మధ్యలో ఏపీ మాత్రం స్కూల్స్ తెరిచేందుకు సై అంటోంది.

ఏపీలో స్కూల్స్ తెరిచేందుకు ఏర్పాట్లు..

ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజలకు అంకితం ఇవ్వాలనుకుంటున్న ప్రభుత్వం, పనిలో పనిగా స్కూల్స్ రీ-ఓపెన్ చేసి తరగతి గది బోధన మొదలు పెట్టడానికి కసరత్తు చేస్తోంది. అయితే ఉపాధ్యాయులు మాత్రం ఆందోళన చెందుతూనే ఉన్నారు. 

ఎక్కడ ఏ ఒక్క విద్యార్థికి కొవిడ్ సోకినా ఉపాధ్యాయుడు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఆ తర్వాత స్కూల్ శానిటేజైషన్, మిగతా వారికి పరీక్షలు.. ఇలా పెద్ద తతంగమే ఉంటుంది. అటు తల్లిదండ్రుల్లో కూడా ఆందోళన ఉండనే ఉంది.

కానీ ప్రభుత్వం మాత్రం స్కూల్స్ తెరిచేందుకే సిద్ధపడింది. ఈ క్షణం వరకు ప్రభుత్వ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. ఏపీలో స్కూల్స్ పునఃప్రారంభం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో!