జ‌గ‌న్ త‌ప్పేంటంటే!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ త‌న పాల‌న‌ను రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. గ‌త రెండేళ్ల‌లో హామీల‌ను ప‌క్కాగా అమ‌లు చేస్తున్న పాల‌కుడిగా జ‌గ‌న్ ప్ర‌శంస‌లు అందుకున్నారు. క‌రోనా లాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో కూడా సంక్షేమ ప‌థ‌కాల‌ను…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ త‌న పాల‌న‌ను రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. గ‌త రెండేళ్ల‌లో హామీల‌ను ప‌క్కాగా అమ‌లు చేస్తున్న పాల‌కుడిగా జ‌గ‌న్ ప్ర‌శంస‌లు అందుకున్నారు. క‌రోనా లాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో కూడా సంక్షేమ ప‌థ‌కాల‌ను చిత్త‌శుద్ధితో అమ‌లు చేసిన ఏకైక పాల‌కుడిగా జ‌గ‌న్‌ను దేశం గుర్తించింది. ఇది నాణేనికి ఒక‌వైపు. ఇటీవ‌ల కాలంలో జ‌గ‌న్ పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో అసంతృప్తి నెల‌కుంద‌నే మాట‌లు వినిపిస్తున్నాయి. ఇది నాణేనికి రెండో వైపు.

ఈ అసంతృప్త స్వ‌రాల్లో సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధి దారులు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. చాప‌కింద నీరులా జ‌గ‌న్ పాల‌న‌పై అసంతృప్తి పెరగ‌డం స్టార్ట్ అయ్యింద‌నేది వైసీపీ పెద్ద‌లు కూడా అంగీక‌రించే స‌త్యం. ఒక‌వైపు ప‌రిమితికి మించి అప్పులు చేస్తూ, చివ‌రికి ఉద్యోగుల‌కు జీతాలు కూడా వాయిదా వేస్తూ ఖ‌జానాను ఖాళీ చేస్తున్నా… ఎందుకీ వ్య‌తిరేక‌త అనే ప్ర‌శ్న స‌హ‌జంగానే వ‌స్తోంది.

“ఎవ‌ర్న‌యినా శ‌త్రువుగా మార్చుకోవాలంటే వారికి చిన్న ఉప‌కారం చేస్తే స‌రి” అని ఓ మ‌హానుభావుడు ఊరికే చెప్ప‌లేదు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రభుత్వ సొమ్మును ప‌ప్పుబెల్లాల చందంగా పంచుతూ చెడ్డ‌వుతుంటే, ప్ర‌ధాని మోడీ దేశానికి ఏ ఒక్క మేలు చేయ‌కుండా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఇదే తేడా. క‌రోనా ప్యాకేజీ 20 ల‌క్ష‌ల కోట్లు అంటూ కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో ఒక్క రూపాయి అందింద‌ని చెప్పిన వ్య‌క్తి లేడు. ఇదే మోడీ మ్యాజిక్‌.

నిజంగా అవ‌స‌రాల్లో ఉన్న వారికి ఓ వెయ్యి రూపాయ‌ల సాయం అందితే జీవితాంతం గుర్తించుకుంటారు. అవ‌స‌రం లేని వారికి ఆయాచితంగా ఎంత ఇచ్చినా కృత‌జ్ఞ‌త లేక‌పోగా, త‌న పేరు కోసం పంపిణీ చేశార‌నే భావ‌న ఉంటుంది. అందుకే అపాత్ర‌దానం ఎప్ప‌టికీ మంచిది కాద‌ని పెద్ద‌లు చెప్పేది. జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేస్తున్న‌దంతా అపాత్ర‌దాన‌మే అనే అభిప్రాయాలున్నాయి. 

అధికారం లోకి రావ‌డానికి జ‌గ‌న్ ఇష్ట‌మొచ్చిన‌ట్టు హామీలిచ్చారు. ఇప్పుడు వాటిని ప‌క్కాగా అమ‌లు చేయ‌డం త‌ల‌కు మించిన భార‌మైంది. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పాల‌న అప్పు చేసి పప్పు కూడు అనే చందంగా త‌యారైంది. ఇదే ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌కు కార‌ణ‌మ‌వుతోంది.

జ‌గ‌న్ అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు నిజంగా ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ల‌కే అందితే …ఆయ‌న ఆశ‌యం ఫ‌లించిన‌ట్టే. కానీ జ‌గ‌న్ త‌న అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు త‌మ‌కు డ‌బ్బు పంచుతున్నార‌ని జ‌నం న‌మ్ముతున్నారు. అంతే త‌ప్ప త‌మ జీవితాల్లో వెలుగులు నింపేందుకు జ‌గ‌న్ త‌ప‌న ప‌డుతున్నాడ‌నే భావ‌న ఏ కొద్ది మందిలో మాత్ర‌మే ఉంది. మ‌రోవైపు జ‌నాన్ని కూర్చోపెట్టి ప్ర‌భుత్వ సొమ్మునంతా నీళ్ల‌లా ఖ‌ర్చు పెడుతున్నార‌ని మ‌రో వ‌ర్గం కారాలుమిరియాలు నూరుతోంది.

రోజుకో సంక్షేమ ప‌థ‌కానికి డ‌బ్బు ఉంటుంద‌ని, కానీ త‌మ‌కు జీతాలు ఇవ్వ‌డానికి మాత్రం ఉండ‌ద‌నే ఆగ్ర‌హం, ఆక్రోశం ఉద్యోగుల్లో రోజురోజుకూ పెరుగుతోంది. జ‌గ‌న్ సంక్షేమ ప‌థ‌కాల అమ‌ల్లో నీతి ఏంటంటే…ఆక‌లిగొన్న వాళ్ల‌కు అన్నం పెట్టాలే త‌ప్ప‌, క‌డుపు నిండిన వాళ్ల‌కు కాదు అని తెలుసుకోవాలి. కానీ జ‌గ‌న్ చేస్తున్న‌దేంటో, ప్ర‌భుత్వ స‌ల‌హాదారులే గుర్తించాల్సి ఉంది.