అర్థం కాని కరోనా గురించి సామాన్యుడి ఆవేదన

ఈ వ్యాసంలో కేవలం ప్రశ్నలే ఉంటాయి. సమాన్యుడి ఆలోచనల్లో మెదిలే సందేహాలే ఉంటాయి. ఇందులో శాస్త్రీయ దృక్పథాలుండవు. మీడియాలో అన్ని రకాల వార్తలూ చదువుతూ, అందరు విజ్ఞుల మాటలూ వింటూ ఏమీ అర్థం కాని…

ఈ వ్యాసంలో కేవలం ప్రశ్నలే ఉంటాయి. సమాన్యుడి ఆలోచనల్లో మెదిలే సందేహాలే ఉంటాయి. ఇందులో శాస్త్రీయ దృక్పథాలుండవు. మీడియాలో అన్ని రకాల వార్తలూ చదువుతూ, అందరు విజ్ఞుల మాటలూ వింటూ ఏమీ అర్థం కాని ఒక సామాన్యుడి ఆవేదన ఇది. 

ప్రస్తుతం ప్రపంచానికి అర్థమౌతున్నట్టుగా అనిపిస్తూ అర్థం కాని పదార్థం ఏదైనా ఉందా అంటే అది “కరోనా”. 

డాక్టర్ల నుంచి కెమికల్ ఇంజనీర్ల నుంచి సామాన్యుడి వరకు ఎవరికి తోచింది వాళ్లు చెప్పేస్తున్నారు. అన్నీ అప్పటికప్పుడు నిజంలాగే అనిపిస్తున్నాయి. కానీ ప్రతి దానికి విరుద్ధంగా జరుగుతున్నవి కూడా అనేకం కనిపిస్తున్నాయి. 

“వ్యాక్సీన్ వేసుకుంటేనే సేఫ్”..అనేది ప్రస్తుతం చలామణీలో ఉన్న అభిప్రాయం. వ్యాక్సీన్ల వల్లనే రెండో వేవ్ తీవ్రత తగ్గిందనే మాట దానికి కొనసాగింపు. మరి 2020 నవంబర్ నాటికి మొదటి వేవ్ ఎందుకు తగ్గింది? అసలప్పుడు వ్యాక్సీనే లెదు కదా? ఈ ప్రశ్నకి ఇంతవరకు “రెండు రెళ్లు నాలుగు” లాంటి యూనివెర్సల్ సమాధానం లేదు. 

ఒకళ్లు “ఆ స్ట్రైన్ పవరైపోయింది తగ్గింది, కొత్త స్ట్రైనొచ్చింది సెకండ్ వేవ్ వచ్చింది” అని చెప్తారు. 

మరొకరు “ఒక పరిమాణం వైరస్ ఇద్దర్ని కాటేసాక దాని పవర్ తగ్గిపోతుంది..కనుకనే నెమ్మదిగా తగ్గింది” అని పాముకాటుతో పోల్చి చెప్తారు. 

ఇంకొకరు “వేరియంట్ మారనంత వరకు తదుపరి వేవ్ రాదు. మారింది కనుకనే రెండో వేవ్ వచ్చింది” అని అంటారు. 

అసలివన్నీ కాదు- “కరోనా అనేది మిడతల దండులాంటిది. అది ఒకేసారి ఊరి మీద దాడి చేస్తుంది. పని పూర్తయ్యాక అక్కడి నుంచి మరొక చోటకి వలస పోతుంది. అంతే తప్ప వ్యాక్సీన్లకి, లాక్డౌన్లకి లొంగదది” అని ఇంకొక అభిప్రాయం కూడా ఉంది. 

ఇలా ఒకటి కాదు, రెండు కాదు..వందల సంఖ్యలో అభిప్రాయాలున్నాయి. 

ఈ మధ్య కెమికల్ ఇంజనీర్ మల్లిక్ చాలా ప్రాచుర్యం పొందారు. జూలై 15కల్లా దేశాన్ని మూడవ వేవ్ ముంచేస్తుందన్నారు. ఇంతవరకు ఆ దాఖలాల్లేవు. పోనీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లెక్కలు దాస్తున్నాయా అంటే మన చుట్టు పక్కల వాతావరణమే మనకి చెప్తుంది. ప్రస్తుతానికి వైరస్ వ్యాప్తి ఒక్క కేరళలో తప్ప మిగిలిన చోట్ల బాగా తగ్గుముఖం పట్టింది. నార్త్ ఇండియాలో అయితే దాదాపు లేనట్టే. 

కానీ తగ్గింది కదా అనుకుని పంజాబులో స్కూళ్ళు తెరిస్తే అక్కడ 20 మంది పిల్లలకి కరోనా సోకిందట. ఆ పిల్లలవల్ల ఇంట్లో పెద్దవాళ్ళకి సోకుతుంది కదా. అసలిప్పుడు స్కూళ్లు తెరవాల్సిన అవసరమేమొచ్చింది అనేది ఒక వాదన. 

ఇక అమెరికాలో కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. రోజుకి లక్షన్నర కేసుల దిశగా పరుగెడుతున్నాయి. టెక్సాస్, ఫ్లోరిడాల్లో మరింత ఎక్కువగా ఉన్నాయి. అయినా సరే అక్కడ కూడా స్కూళ్లు తెరిచేస్తున్నారు. అగ్రరాజ్యం కూడా ప్రజల మీద చేస్తున్న ప్రయోగాలు అన్నీ ఇన్నీ కాదు. 

అమెరికాలో తొలుత వ్యాక్సీన్ వేసుకున్నవాళ్లని మాస్కులు తీసెయ్యమన్నారు. సోషల్ డిస్టెన్సింగ్ పాటించకుండా విందులు, వినోదాల్లో పాల్గొనమన్నారు. ఆఫీసులకొచ్చెయ్యమన్నారు. కేసులు పెరుగుతుండడంతో మళ్లీ మాస్కులు పెట్టుకోమని చెప్తున్నారు. అదేంటని అడిగితే వ్యాక్సీన్ వేసుకున్నవాళ్ల ద్వారా వేసుకోని వాళ్లకి వస్తోందని కొత్త వాదన వినిపిస్తున్నారు. 

ఇండియాలో రెండు వ్యాక్సీన్స్ వేసుకున్నవారికి కూడా కరోనా సోకిన సందర్భాలు చాలా ఉన్నాయి. వారిలో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఏవన్నా అంటే వాళ్లకి కోమార్బిడిటీస్ ఉండుంటాయ్ అని సరిపెట్టుకుని మిగిలిన వాళ్లు ధైర్యం తెచ్చుకుంటున్నారు. 

అమెరికాలో ఈ పరిస్థితి లేకుండా ఇండియాలోనే ఉందా? అంటే ఇక్కడి వ్యాక్సీన్లలో లోపముందా? ఎవరు చెప్పగలరు?

ఇదంతా ఒకెత్తైతే అసలు కేరళలోనే ఎక్కువ కేసులెందుకుంటున్నాయి. దేశంలో నమోదయ్యే మొత్తం కేసుల్లో సగానికి పైగా ఒక్క కేరళలోనే ఉండడానికి కారణమేంటి? దాని పక్కనే ఉన్న కర్నాటక, తమిళనాడుల్లో అంతలాగ కేసులు లేకపోవడమేమిటి? దీనికి సహేతుకమైన సమాధానం ఐప్పటికీ లేదు. ఏ డాక్టరూ దీనికి కారణం చెప్పలేడు. 

కాబట్టి ఏదో అర్థమౌతున్నట్టు ఉన్నా, కొందరు అర్థమైపోయినట్టు ఏదో ఒకటి చెప్పేస్తున్నా ఎవ్వరికీ ఏమీ తెలియడంలేదన్నది బాటం లైన్. ప్రపంచమంతా తెలిసీతెలియని తనంలోనే ఉంది. ఒకేసారి ప్రపంచం మొత్తం కొత్త వైరస్ కి సంబంధించిన పాఠాలు వింటోంది, ప్రయోగాలు చేస్తోంది.

“ఇంకా ఎన్నాళ్లిలా?” అనే ప్రశ్నకి కూడా సమాధానం దొరకడంలేదు. ప్రస్తుతం ఉన్న కేసుల సంఖ్యకి చనిపోతున్న వారి సంఖ్యను పోల్చి చూసుకుంటే “డైలీ డెత్ లోడ్” అధికంగానే ఉంది. అది సెకండ్ వేవ్ పరిస్థితికంటే తక్కువగా అయితే లేదు. అంటే రోజూవారీ పాజిటివ్ కేసులు పెరిగితే చావులు మళ్ళీ సెకండ్ వేవ్ ని గుర్తుచేస్తాయన్నమాట. 

ఇన్ని వాస్తవాలు మాట్లాడుకున్నాక, ఇన్ని ప్రశ్నలు సంధించుకున్నాక మనం చేయాల్సింది ఏమిటి? కరోనాతో సహజీవనం ఇప్పట్లో అయితే తప్పేలా లేదు. ప్రమాదం పక్కనే పొంచి ఉందని భావించడం, డాక్తర్లు చెప్తున్నారు కనుక వ్యాక్సీన్లు తీసుకోవడం, తెలిసినంతలో జాగ్రత్తలు పాటించడం. తర్వాత అంతా దైవాధీనం. 

ఒక సామన్యుడు