అక్రిడేషన్ మాత్రమే పరమావథా?

జర్నలిస్ట్ లు గత కొంతకాలంగా జగన్ ప్రభుత్వం మీద ఆగ్రహంగా వున్నారు. ఈ ఆగ్రహానికి వున్న కొన్ని కారణాల్లో కీలకమైనది జర్నలిస్ట్ ల అక్రిడేషన్. అక్రిడేషన్ కమిటీల్లో జర్నలిస్ట్ లకు ప్లేస్ లేదనో, ఇంకోటో..రకరకాల…

జర్నలిస్ట్ లు గత కొంతకాలంగా జగన్ ప్రభుత్వం మీద ఆగ్రహంగా వున్నారు. ఈ ఆగ్రహానికి వున్న కొన్ని కారణాల్లో కీలకమైనది జర్నలిస్ట్ ల అక్రిడేషన్. అక్రిడేషన్ కమిటీల్లో జర్నలిస్ట్ లకు ప్లేస్ లేదనో, ఇంకోటో..రకరకాల సమస్యలు. సరే, అక్రిడేషన్ల విషయంలో జగన్ ప్రభుత్వం ఏం చేస్తోందో? ఏం చేయలేదో? ఏం చేయాలో అన్నది పక్కన కాస్సేపు పక్కన పెడదాం? అసలు జర్నలిస్ట్ లకు అక్రిడేషన్ అన్నదే పరమావధి అనుకోవాలా? అది వస్తే చాలు, జర్నలిస్ట్ ల బతుకులు బాగైపోయినట్లా? 

ఎప్పుడో పూర్వాశ్రమంలో సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ లు విలే'కరి' వా…విలే'ఖరి'వా అని అడిగేవారట. కరి అంటే ఏనుకు..ఖరి అంటే గాడిద. నిజంగా ఇప్పుడు లోకల్ రిపోర్టులు హోదాకు విలేకరి…చాకిరీకి విలేఖరి. అసలు జర్నలిస్ట్ వ్యవస్థ ఎక్కడ ప్రారంభమవుతోంది. మండల స్థాయిలో స్ట్రింగర్/కరస్పాండెంట్/రిపోర్టర్ అన్న దగ్గర. కానీ ఈ  మండల స్థాయిలో కావచ్చు, సబ్ డివిజన్ స్థాయిలో కావచ్చు పని చేసే రిపోర్టర్/కరస్పాండెంట్/స్ట్రింగర్ లకు మెయిన్ స్ట్రీమ్ మేనేజ్ మెంట్లు అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇస్తున్నాయా? ఏడాదికో, రెండేళ్లకు ఎక్సపయిరీ డేట్ వేసి ఇచ్చే ఐడెంటిటీ కార్డులు తప్ప. వీరిలో ఒక్కరికైనా వేజ్ బోర్డు వేతనాలు వున్నాయా? లేదా కనీసం ఆ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం అయినా, బేసిక్, డిఎ, హెచ్ ఆర్ ఎ తదితర వ్యవహారాలతో జీతం వుందా? పోనీ అదీ కాదు, ఫిక్స్ డ్ శాలరీ అయినా ఎంత మందికి వుంది? రాసిన దాన్ని సెంటీమీటర్లలో కొలిచే వ్యవహారం కొందరిది. హానరోరియమ్ అనే పద్దతి మరి కొందరిది. ఏ జీతం అయినా ఇచ్చినా, ఇవ్వకపోయినా నిలదీసే పరిస్థితి వుందా?  మేనేజ్ మెంట్ల మీద పోరాడే అవకాశం వుందా? 

సరే ఆ సంగతి అలా వుంచుదాం. ప్రతి పట్టణంలో పదుల నుంచి వందల సంఖ్యలో లోకల్ డైలీలు వున్నాయి. వీటిలో పని చేసే రిపోర్టర్ ల పరిస్థితి మరీ దారుణం. కేవలం ఐడెంటీ కార్డు తప్ప రూపాయి వేతనం వుండదు. పైగా వీళ్లే ప్రకటనలు తీసుకువచ్చి, మేనేజ్ మెంట్ ను పోషించాలి. వీరి కమిషన్ వీరు తీసుకోవాలి. ఈ వ్యవ్యస్థను బాగుచేసే ఆలోచన యూనియన్ లకు వుందా? 

కేంద్రంలో మోడీ వచ్చిన తరువాత రాష్ట్రం విడిపోయిన తరువాత చిన్న పత్రికలకు దాదాపుగా ప్రకటనలు లేకుండా పోయాయి. రాజకీయ ప్రకటనలు తప్ప దిక్కు లేదు. దాంతో రిపోర్టర్లు అంతా లోకల్ లీడర్ల మీద ఆధారపడాల్సిందే. సర్పంచ్ లకు ఫోన్ లు చేయడం, ఎమ్మెల్యే పుట్టిన రోజు, జిల్లా మంత్రి పుట్టిన రోజు ఎంతో కొంత ఇవ్వమని డిమాండ్ చేసి, తమ పత్రికలకు ప్రకటనలు అందించాల్సిందే. సర్పంచ్ లకు లోకల్ గా ఇసుక, మట్టి, మద్యం ఇతరత్రా వ్యవహారాలు వుంటాయి కనుక మొహమాటానికి తలవొంచి వెయ్యి..రెండు వేలు ఇచ్చి ప్రకటనలు వేయించుకోవాల్సిందే. 

ఎన్నికలు వస్తే తప్ప, నూటికి తొంభై తొమ్మిది చిన్న పత్రికలకు ఆదాయం అన్నది కనిపించని పరిస్థితి. వాటికే ఆదాయం లేకపోతే అందులో పని చేసే వారికి జీతాలేం ఇస్తాయి. ఐడెంటి కార్డులు తప్ప. ఇలాంటి నేపథ్యంలో ఒక్కో పత్రికకు, ఒక్కో సెంటర్ కు ఇంతమందికి అక్రిడేషన్ అనే ప్రభుత్వ గుర్తింపును ఉదారంగా ఇవ్వడం ప్రారంభించారు. దీని వల్ల ఒరిగేదేమిటి అన్నది చూద్దాం.

తాను విలేకరిని అనే గుర్తింపు. ఆర్టీసీ బస్ ల్లో ఫ్రీ గా తిరగొచ్చు. రైళ్లలో సగం రేటుకు ప్రయాణించవచ్చు. లోకల్ గా ఎమ్మార్వోను పట్టుకుని కిందా మీదా పడి ఫ్రీగా ఇళ్ల స్థలం పొందొచ్చు. అంతకన్నా నెల వారీ ఆదాయం ఏమీ అదనంగా రాదు. బతుకులు ఏమీ బాగుపడవు. కానీ జర్నలిస్ట్ లు, జర్నలిస్ట్ సంఘాలు మాత్రం దీని మీదే ప్రధానంగా ఎందుకు దృష్టి పెడతాయో అన్నది వారికే తెలియాలి.

థియేటర్లు, దుకాణాలు, రెస్టారెంట్లు ఇలా చిన్న చిన్న ఎస్టాబ్లిష్ మెంట్లు అన్నింటా కనీస వేతనాలు వున్నాయి. చట్టం వుంది. అమలు చేసే అధారిటీ వుంది. పెద్ద పత్రికలకు వేజ్ బోర్డు అనేది ఒకప్పుడు వుండేది. కానీ తరువాత తరువాత ఆ వ్యవహారాలు కూడా ఆగిపోయాయి. వేజ్ బోర్డు సిఫార్స్ లు తప్పించుకోవడానికి పెద్ద పత్రికలు, ఆర్గనైజేషన్లు వేసిన ఎత్తుగడలు, తయారుచేసిన లెటర్ హెడ్ కంపెనీలు ఇన్నీ అన్నీ కావు. పెద్ద పత్రికలకు మాత్రమే ఈ వేజ్ బోర్డు వ్యవహారాలు. చిన్న పత్రికలకు అదీ లేదు.

మరి చిన్న పత్రికల్లో పని చేసే జర్నలిస్టలకు కనీస వేతనాలు డిసైడ్ చేసేవారు ఎవరు? వాటిని అమలు చేయించేవారు ఎవరు? మరి జర్నలిస్ట్ సంఘాలు ఈ దిశగా ఎందుకు ఉద్యమించవు. కేవలం ఎంత సేపూ ప్రభుత్వాలనే నిలదీస్తాయి తప్ప, 

యాజమాన్యాలను ఎందుకు నిలదీయవు? విశేషం ఏమిటంటే చాలా చిన్న పత్రికలకు యజమానులు జర్నలిస్ట్ లే. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తిరిగి తిరిగి ఆఖరికి స్వంత కుంపటి  పెట్టుకున్నవారే ఎక్కువ. వీరు కూడా తమ పత్రికల్లో వారికి తమ అనుభవాలే రుచి చూపిస్తారు తప్ప, నెత్తిన పెట్టుకుని పోషించేది వుండదు. 

గతంలో కేంద్రం, రాష్ట్రం ప్రకటనలు ఇచ్చినపుడు పదో పాతికో కాపీలు ప్రింట్ చేసి ఆ తరువాత ఊరుకుని కేవలం ఆ పేరుతో కాలం గడిపేసిన చిన్న పత్రికలు ఎన్నో. ఇవన్నీ లోకల్ జర్నలిస్ట్ లకు తెలియని కొత్త సంగతులు కావు. తామర తంపరగా పత్రికలు పెరిగిపోవడంతో, ఒక్కో పట్టణానికి వందలాది అక్రిడేషన్లు అవసరం పడిపోయింది. దీన్ని స్ట్రీమ్ చేయాలంటే కందిరీగ తుట్టను కదపడమే. అందుకే గత ప్రభుత్వాలు ఏవీ ఈ వ్యవహారాన్ని చూసీ చూడనట్లు వదిలేసాయి. 

ఇప్పుడు జగన్ ప్రభుత్వం దీన్నికదిపింది. దీంతో జర్నలిస్ట్ లు అంతా ఒంటి తాటిపై లేస్తున్నారు. కానీ ఇలా లేచే వాళ్లు ఎవ్వరూ కూడా జర్నలిస్ట్ ల వేతనాల గురించి బతుకుల స్థాయి గురించి పట్టించుకోరు. నిజం మాట్లాడుకోవాలంటే రైతు పరిస్థితే జర్నలిస్ట్ ది కూడా.  ఏ లోకల్ జర్నలిస్ట్ కూడా తన కొడుకు జర్నలిస్ట్ కావాలనుకోవడం లేదు. అప్పో సొప్పో చేసి పిల్లలను చదివించి ప్రయోజకులను చేయాలనుకుంటున్నారు తప్ప జర్నలిస్ట్ లనే చేయాలని అనుకోవడం లేదు. 

అనకూడదు కానీ, ఇప్పటికే ప్రింట్ మీడియా అంతా 80శాతం పిడిఎప్ లకు పరిమితం అయిపోయింది. మనమే వార్తలు రాసి, మనమే పిడిఎఫ్ తయారు చేసి, మనమే సర్క్యులేట్ చేసే పరిస్థితి వచ్చేసింది. పల్లెల్లో రైతులు, రైతు కూలీల పిల్లలు పట్టణాల్లో ఉద్యోగస్థులుగా మారిపోయి, అక్కడ పనికి జనాలు దొరకని పరిస్థితి వచ్చింది.  ఇప్పుడు వున్న కింద పట్టణాల్లో వున్న జర్నలిస్ట్ ల పరిస్థితి కూడా భవిష్యత్ లో  అలాగే వుంటుంది. వాళ్లకు ఓపిక వున్నంత కాలం ఈ మీడియా నుంచి ఆ మీడియాకు ఆ మీడియా నుంచి మీడియాకు మారుతూ పని చేయడం. వాళ్ల పిల్లలను ప్రయోజకుల్ని చేసి వేరే రంగంలోకి పంపడం.  

జర్నలిస్ట్ యూనియన్లు ఈ అక్రిడేషన్ల కోసం కొట్లాడడం కన్నా, చిన్న పత్రికలకు మార్గ దర్శనం చేయడం, వాటికి ప్రభుత్వ ప్రకటనలు వచ్చే మార్గం చూడడం, ప్రభుత్వ ప్రకటనల బడ్జెట్ లో చిన్న పత్రికలకు ఇంత శాతం వాటా విధిగా వుండాలని కోరి సాధించడం, ఆపై లోకల్ జర్నలిస్ట్ లకు కనీసపు వేతనం అమలు జరిగేలా చూడాల్సి వుంది. లేకపోతే కొన్ని దశాబ్దాల తరువాత లోకల్ జర్నలిజం వ్యవస్థ కనుమరుగయిపోయే ప్రమాదం వుంది.