జగన్ ప్రభుత్వానికి డబుల్ షాక్ తగిలింది. మాన్సాస్ చైర్మన్‌గా కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజును తొలగిస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టు సింగిల్ బెంచ్ కొట్టివేయగా, దానిపై డివిజన్ బెంచ్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా ఏపీ ప్రభుత్వానికి బుధవారం చుక్కెదురైంది. అశోక్‌గజపతిరాజుకు సంబంధించి న్యాయస్థానంలో జగన్ ప్రభుత్వానికి వరుస ఎదురు దెబ్బలు తప్పడం లేదు.
గతంలో అశోక్‌గజపతిరాజును సింహాచల దేవస్థానం చైర్మన్‌గా, అలాగే విజయనగరం సంస్థానాధీశులకు చెందిన మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్(మాన్సాస్) ట్రస్టు అధ్యక్ష పదవి నుంచి ప్రభుత్వం రాత్రికి రాత్రే తప్పించింది. ఈ రెండు పదవుల్లో అశోక్ గజపతిరాజు అన్న, మాజీ మంత్రి పూసపాటి ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయిత గజపతిరాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
దీనిపై అశోక్ గజపతిరాజు హైకోర్టు కేంద్రంగా న్యాయపోరాటానికి దిగారు. మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం చైర్‌పర్సన్‌గా సంచయిత గజపతి నియామక జీవోను హైకోర్టు సింగిల్ బెంచ్ కొట్టివేసింది. ఇదే సందర్భంలో అశోకగజపతిరాజును పునర్నియమించాలంటూ హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది.
సీజే ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్‌లో పిటిషన్లపై విచారణ జరిగింది. తాజాగా మరోసారి ప్రభుత్వ ఉత్తర్వులను డివిజన్ బెంచ్ కొట్టివేసింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సమర్థిస్తూ అశోక్‌కు అనుకూలంగా తీర్పు వెలువరించింది. మాన్సాస్ చైర్మన్‌గా కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు కొనసాగింపునకు హైకోర్టు గ్రీన్ సిగ్నలిచ్చింది.
ప్రభుత్వం, సంచయిత వేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. దీంతో అశోక్‌గజపతిరాజు విషయంలో ప్రభుత్వానికి దెబ్బమీద దెబ్బ తగిలినట్టైంది. రాజుల కుటుంబంలో విభేధాలను ఆసరాగా తీసుకుని, సంచయితను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం అశోక్‌గజపతిరాజును ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో అనవసరంగా ప్రభుత్వం అభాసుపాలవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.