ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కాలేజీలు తెరుచుకున్నాయి. కరోనా మూడో వేవ్ 18 యేళ్ల వయసు లోపు వారిపైనే ఎక్కువగా ప్రభావం చూపించవచ్చు అంటూ నాలుగు నెలల కిందటే కొందరు విశ్లేషించారు. అయితే ఆ విశ్లేషణకు భిన్నంగా ఇప్పుడు సమూహంలోకి ముందు వెళ్తున్నది టీనేజర్లు, పిల్లలే కావడం గమనార్హం.
కర్ణాటకలో కాలేజీలు ఓపెన్ అయ్యి ఇప్పటికే పక్షం రోజులు గడిచిపోయాయి. ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజీలను కర్ణాటక ప్రభుత్వం తెరవడానికి అనుమతులు ఇచ్చింది. ఆ మేరకు అక్కడ దాదాపు 15 రోజుల నుంచి కాలేజీల్లో సందడి వాతావరణం నెలకొంది. చాలా నెలల తర్వాత పిల్లలు విద్యాలయాలకు వెళ్తున్నారు. కేవలం కర్ణాటకే కాదు.. ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్, ఆపై చదువులకు ఫిజికల్ అటెండెన్స్ మొదలైంది.
ఇక వచ్చే వారం నుంచి పలు రాష్ట్రాల్లో హై స్కూళ్లు ఓపెన్ కానున్నాయి. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. దేశంలో అత్యధిక కరోనా కేసుల రాష్ట్రం మహారాష్ట్ర కూడా ఈ విషయంలో ముందుంది. ఆగస్టు 17 నుంచి అక్కడ స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. అర్బన్ ఏరియాలో 8 నుంచి 12 క్లాసుల వరకూ, రూరల్ లో ఐదు నుంచి పన్నెండు క్లాసుల వరకూ స్కూళ్లను, ఆ పై కాలేజీలను ఓపెన్ చేసుకోవచ్చని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఢిల్లీలో ఇప్పటికే 10, ఆపై చదువులకు కాలేజీలు తెరుచుకున్నాయి. ఇక తమిళనాడు ఇంకా కాస్త సమయం తీసుకునేలా ఉంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి స్కూళ్లు, కాలేజీల ఓపెన్ కు సానుకూలంగా ఉందట తమిళనాడు ప్రభుత్వం. ఏపీలో ఆగస్టు 16 నుంచి తరగతి గది చదువులు ప్రారంభం కానున్నాయి. ముందుగా పరిమిత క్లాసులకు, అది కూడా రోజు విడిచి రోజు స్కూళ్లు ఓపెన్ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.
ఇలా నెమ్మదినెమ్మదిగా మళ్లీ పాత జీవితంలోకి వెళ్తోంది భారతదేశం. ఇప్పటికే కాలేజీలు మొదలైన నేపథ్యంలో పట్టణాల్లో కాస్తో కూస్తో సందడి నెలకొంటోంది. ఇక స్కూళ్లు కూడా మొదలైతే, ఈ హడావుడి పెరిగే అవకాశం ఉంది. మూడో వేవ్ భయాలు ఉన్నా.. భయాలతో తలుపులు మూసుకుని ఉండలేమనే భావనతో ప్రభుత్వాలు స్కూళ్లు, కాలేజీల ఓపెన్ కు సమాయత్తం అవుతున్నాయి.
స్కూళ్లు లేకుండా పోవడం పిల్లల మానసికారోగ్యానికి చాలా ప్రమాదకరమైన అంశమని ఇప్పటికే సైకాలజిస్టులు, వైద్య నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. మరి ఇక నుంచి అయినా.. పిల్లలు విద్యాలయాలకు వెళ్లడానికి ఎలాంటి ఆటంకాలూ ఏర్పడకపోతే మంచిది.