చిరకాలంగా వివాదాలు ముసురుకుంటూనే వున్నాయి చిత్రపురి కాలనీ చుట్టూ. ఇందులో అర్హులతో పాటు అనర్హులకు కూడా ఇళ్లు 'దొరికేసాయని' ఆరోపణలు వినిపిస్తూనే వున్నాయి. డబ్బులు పెట్టగలిగిన వారు, కమిటీని 'మేనేజ్' చేయగలిగిన వారు సినిమాలతో సంబంధం లేకపోయినా ఫ్లాట్లు సంపాదించేసారని వార్తలు వున్నాయి.
నిజానిజాయలయితే చిత్రపురిలో వుంటున్నవారు అందరికీ తెలుసు. ఇక ఇవి కాకుండా ఇంకా అనేకానేక ఆరోపణలు ప్రతిసారీ కమిటీ ఎన్నికల సమయంలో వినిపిస్తూనే వున్నాయి.
ఆఖరికి ఇప్పుడు అవే నిజమని అనిపించేలా విచారణ కమిటీ నివేదిక వచ్చింది. దాంతో చిత్రపురి చిత్రాలు అన్నీ మరోసారి బయటకు వచ్చాయి. కానీ గమ్మత్తేమిటంటే, ఇప్పటికీ ఇంకా కమిటీ ఈ విషయం కప్పిపుచ్చాలనే ప్రయత్నించడం.
ఇప్పుడు వచ్చింది ప్రిలిమనరీ నివేదికే అని ఇంకా పూర్తి స్థాయి నివేదిక రావాల్సి వుందని అంటోంది కమిటీ. నివేదిక ను జనరల్ బాడీ ముందు పెట్టాల్సి వుంది అంటోంది.
అసలు ప్రాధమిక నివేదికకు, పూర్తి స్థాయి నివేదికకు తేడా వుంటుందా? ప్రాధమిక నివేదికలో వెల్లడయిన విషయాలను పూర్తి భిన్నంగా పూర్తి స్థాయి నివేదిక వుండే అవకాశం వుందా? మరి ఏ భరోసాతో పూర్తి స్థాయి నివేదిక వచ్చే వరకు వేచి వుండాలని కమిటీ అంటోందో తెలియదు.
చిత్రమేమిటంటే అసలు సినిమా పరిశ్రమతో సంబంధం లేకుండా ఫ్లాట్లు పొందినవారిని గుర్తించడం అంత కష్టమా? ప్రభుత్వం తలచుకుంటే రెండు నిమషాలు పట్టదా? కానీ అలా అలా కాలయాపన జరుగుతోంది అంటే ఇక ఎప్పటికీ ఈ వ్యవహారం ఇలా రావణకాష్టంలా వుంటూనే వుంటుంది.
అప్పుడప్పుడు వార్తలు రాసుకోవడానికి తప్ప, అసలు సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదనే అనుకోవాలి.