ఈ మాటలు మేం అనడం లేదు. స్వయంగా దివ్యవాణి చెబుతున్న మాటలివి. ఈవిడ్ని తెలుగుదేశం పార్టీ జనాలు కుక్క పిల్లలా వాడుకున్నారట. చంద్రబాబు అయితే కరివేపాకులా తీసి పారేశారట. నాటకీయ పరిణామాల మధ్య తెలుగుదేశం పార్టీకి రాజీనామా సమర్పించిన దివ్యవాణి, వెంటనే ప్రెస్ మీట్ పెట్టారు.
తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుంది? పైకి ప్రజాస్వామ్యం అని చెప్పుకునే ఆ పార్టీలో నిరంకుశత్వం ఏ స్థాయిలో రాజ్యమేలుతోంది లాంటి అంశాల్ని పూసగుచ్చినట్టు బయటపెట్టారు.
– జనార్థన్ గారికి కాల్ చేస్తే అచ్చెన్నాయుడ్ని కలవమన్నారు. అచ్చెన్నాయుడు గార్ని అడిగితే కింద ఉన్నటువంటి మాల్యాద్రి గారిని కలవమన్నారు. ఇలా అందరికీ చెప్పాను. అందరూ కలిసి నన్ను కుక్క పిల్లలా చూశారు. నాతో ఫుట్ బాల్ ఆడుకున్నారు.
– బయట నుంచి నాకు చాలామంది చెప్పారు. అందరిలాగా నువ్వు కూడా కరివేపాకు అయిపోతావని హెచ్చరించారు. అదే జరిగింది.
– నెల రోజుల కిందట కేఏ పాల్ గారిని కలిశాను. టీడీపీలో ఏం జరుగుతోంది, ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు లాంటి విషయాలన్నీ మొత్తం నాకు చెప్పారు.
– నేనేదో అన్నానని నన్ను తప్పుపట్టారు. పార్టీ లేదు, బొక్క లేదు అన్న వాళ్లను ఏం చేశారు.
– చంద్రబాబు సతీమణిని విమర్శిస్తే, ఆయన కంటే ముందు నేను కౌంటర్ ఇచ్చాను.
ఇలా చంద్రబాబుపై, పార్టీపై తనకున్న కోపాన్ని, తనకు జరిగిన అవమానాన్ని బయటపెట్టారు దివ్యవాణి. గౌరవం లేని చోటు తను ఉండలేనని, రాజకీయాల్లో డబ్బులు తీసుకొని మేకప్ వేసుకునే రకం తను కాదని అన్నారు. ఈ సందర్భంగా మరోసారి మహానాడు వేదికగా తనకు జరిగిన అవమానాన్ని బయటపెట్టారు దివ్యవాణి. తనకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు.
పార్టీలో తనకు ఎవ్వరూ డబ్బులు కూడా ఇవ్వలేదని, తనే సొంత డబ్బులు ఖర్చు పెట్టి, పార్టీకి సేవలందించానని చెప్పుకొచ్చారు. ఇన్ని విధాలుగా సేవలందించిన తనను కరివేపాకులా తీసేయడం, కుక్క కంటే హీనంగా చూడడం చంద్రబాబు లాంటి నేతకు మంచిది కాదని శాపనార్థాలు పెట్టారు దివ్యవాణి.