ఏ ప్రభుత్వమైనా అనేక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. వాటిల్లో కొన్ని మంచి నిర్ణయాలు, ప్రజలకు మేలు చేసేవి ఉంటాయి. కొన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఉంటాయి. కానీ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుంటాయి కాబట్టి ఆ లిస్టులో మంచి నిర్ణయాలు కూడా చేరతాయి. ప్రజలకు కీడు చేసే నిర్ణయాలను ఎలా విమర్శిస్తామో మేలు చేసే నిర్ణయాలను మెచ్చుకోవాలి. ఈ విషయంలో పార్టీలకు అతీతంగా వ్యవహరించాలి. ఏపీలో ఇప్పటివరకు జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ మంచివనీ చెప్పలేము. పూర్తిగా చెడ్డవి అని కూడా అనలేం.
అయితే తాజాగా ప్రభుత్వం నిజంగానే ఒక మంచి నిర్ణయం తీసుకుంది. అలాంటి నిర్ణయం తీసుకున్నందుకు శభాష్ అనాల్సిందే. ఇంతకూ ఏమిటా నిర్నయమంటే …. కార్పోరేట్ విద్యా సంస్థలు ముఖ్యంగా నారాయణ, శ్రీ చైతన్య వంటి ప్రధాన విద్యాసంస్ధలు ఏటా పదో తరగతి పరీక్షల ఫలితాల ప్రకటన సందర్భంగా ఇచ్చే యాడ్స్ సంగతి చెప్పనక్కర్లేదు. దీంతో ప్రభుత్వం వీటికి చెక్ పెడుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ రెండు విద్యా సంస్థలకు ఇలాంటి బ్రేక్ పడాల్సిందే. పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యా విధానం ఈ రెండు సంస్థల వల్లనే భ్రష్టు పట్టిపోయింది. ఈ రెండు విద్యాసంస్థల్లో తమ పిల్లలను చదివించడం తెలుగు రాష్ట్రాలలోని తల్లిదండ్రులకు వేలంవెర్రిగా మారింది. చైతన్య, నారాయణ విద్యా సంస్థల్లో పిల్లలను చదివించకపోతే జీవితమే వృథా అన్న అభిప్రాయానికి తల్లిదండ్రులు వచ్చారు.
ఈ రెండు విద్యా సంస్థల్లో తమ పిల్లలు చదువుకోవడం చాలామంది తల్లిదండ్రులు గొప్పగా, గర్వంగా ఫీలవుతారు. ఎంత కష్టమైనా వేలాది రూపాయల ఫీజులు చెల్లిస్తారు. కానీ ఈ రెండు సంస్థల్లో చదివే పిల్లల మానసిక పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించలేరు. తెలుగు రాష్ట్రాల్లో గత రెండు దశాబ్దాల్లో టీవీ పెడితే చాలు ర్యాంకుల ప్రకటనలతో జనం విసిగిపోయే పరిస్ధితి.
ఒకటి,రెండు, నాలుగు, ఆరు.. వందలోపు 200 ర్యాంకులంటూ మోసపూరిత ప్రకటనలు చేస్తూ విద్యార్ధుల తల్లితండ్రుల్ని ఏమార్చే ప్రకటనలకు లెక్కేలేకుండా పోయింది. తెలుగు రాష్ట్రాల్లో పరీక్షల సీజన్ వస్తుందంటే చాలు విద్యార్ధులు, వారి తల్లితండ్రులే కాదు సాధారణంగా టీవీ చూసే ప్రేక్షకులకూ ఓ భయం వెంటాడుతుంటుంది. ముఖ్యంగా పరీక్షా ఫలితాల్ని ప్రభుత్వం ప్రకటించగానే టీవీ పెట్టాలంటే భయం.
పదో తరగతి నుంచి మొదలుపెట్టి ఇంటర్, ఎంసెట్, ఇలా ప్రతీ పరీక్షకూ సంబంధించిన ర్యాంకుల ప్రకటన టీవీల్లో చూడాలంటే ఒళ్లు జలదరిస్తుంది. టీవీ పెడితే చాలు ఒకటి, రెండు, నాలుగు.. ఇలా అన్ని ర్యాంకులు మావే అంటూ విద్యాసంస్ధలు చేస్తున్న మోసపూరిత ప్రకటనలు దర్శనమిస్తుంటాయి. దిన పత్రికల్లోనూ పేజీలకు పేజీల యాడ్స్ ఇవే. తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా పాతుకుపోయిన శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్ధలైతే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. ర్యాంకుల ప్రకటనలో ఈ రెండు సంస్ధలు ఇచ్చే యాడ్లు చూస్తే దేశంలో అన్ని ర్యాంకులు ఈ రెండు విద్యాసంస్ధలకే ఎలా వస్తాయన్నది ఎవరికీ అర్ధం కాదు. ముఖ్యంగా పదో తరగతి పరీక్షల్లో రాష్ట్రంలో అన్ని ర్యాంకులు తమకే అన్నట్లుగా ఆయా సంస్ధలు చేస్తున్న ప్రచారం తమ ఇంటర్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసమే అన్న వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ మోసపూరిత ప్రకటనలకు బ్రేక్ వేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
ఏపీలో పదో తరగతి పరీక్షల్లో ర్యాంకుల ప్రకటనల్ని నిషేధిస్తూ వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షల్లో విద్యార్ధులకు ర్యాంకులు వచ్చినట్లు ఏ విధంగానూ ప్రచారం చేయరాదని ప్రభుత్వం ఆయా విద్యాసంస్ధలకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇకపై ర్యాంకుల్ని ప్రకటించేందుకు నారాయణ, చైతన్యతో పాటు ఇతర విద్యాసంస్ధలకు వీల్లేకుండా పోయింది. ప్రభుత్వ ఆదేశాల్ని ఉల్లంఘించి ర్యాంకులు ప్రకటిస్తే ఆయా సంస్ధలపై చట్ట ప్రకారం చర్యలు తప్పవు. పదో తరగతి పరీక్షల ర్యాంకుల్నివిద్యాసంస్ధలు ప్రకటనల రూపంలో వెల్లడించకుండా ప్రభుత్వం నిషేధం విధించడం వెనుక కీలక కారణాలున్నాయి. ఇందులో ముఖ్యంగా ఈ ర్యాంకుల పేరుతో జరుగుతున్న ప్రచారం విద్యార్ధుల తల్లితండ్రుల్ని మభ్యపెట్టేలా ఉందని ప్రభుత్వం గుర్తించింది.
ఈ మేరకు తల్లితండ్రుల నుంచి అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఉల్లంఘించి పదో తరగతి ర్యాంకులు ప్రకటించినా, టీవీల్లో ప్రకటనలు చేసినా ఇందుకు బాధ్యులైన వారికి కనీసం మూడేళ్లు, గరిష్టంగా ఏడేళ్ల వరకూ శిక్షలు విధించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే లక్ష రూపాయల వరకూ జరిమానా విధించే అవకాశం కూడా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ఇకపై ర్యాంకుల ప్రకటనలకు బ్రేక్ పడుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో టీవీ ప్రేక్షకులకు కూడా కాస్త ఊరట దక్కబోతోంది.