అభ్యర్థికి దిక్కులేదు కానీ ఆత్మకూరులో పోటీ అంట..!

వారసత్వ రాజకీయాలకు మేం దూరం.. కచ్చితంగా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో అభ్యర్థిని దింపుతామంటూ బీజేపీ నేతలు రెచ్చిపోతున్నా.. ఇప్పటి వరకూ వారికి అభ్యర్థి దొరకలేదు. వారం రోజుల క్రితం పార్టీలో చేరిన వ్యక్తికి టికెట్…

వారసత్వ రాజకీయాలకు మేం దూరం.. కచ్చితంగా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో అభ్యర్థిని దింపుతామంటూ బీజేపీ నేతలు రెచ్చిపోతున్నా.. ఇప్పటి వరకూ వారికి అభ్యర్థి దొరకలేదు. వారం రోజుల క్రితం పార్టీలో చేరిన వ్యక్తికి టికెట్ ఇస్తే, సీనియర్లను అవమానించినట్టవుతుందని వెనకడుగేస్తున్నారు. 

అయితే సీనియర్లు అని చెప్పుకునేవారంతా ఆత్మకూరులో పోటీ చేయబోమని తేల్చి చెప్పారు. దీంతో రాష్ట్ర నాయకత్వం ఆలోచనలో పడింది. పోటీ గ్యారెంటీ అంటారు.. నామినేషన్లకు టైమ్ ముగుస్తున్నా అభ్యర్థి ఎవరో చెప్పడంలేదు. ఇదీ ఏపీలో అధికారంలోకి వస్తామని ప్రగల్భాలు పలుకుతున్న బీజేపీ పరిస్థితి.

మేకపాటికి పోటీ ఎవరు..?

వైసీపీ అభ్యర్థిగా మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి నామినేషన్ తెలిసిందే. అయితే ఆయనకు పోటీగా నిలబడేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. మేకపాటి కుటుంబంపై ఉన్న సింపతీ ప్రకారం ప్రతిపక్షాలు విడివిడిగా పోటీ చేసినా, కలివిడిగా పోటీ చేసినా ప్రయోజనం ఉండదు. అయితే బీజేపీకి మాత్రం డిపాజిట్లు పోగొట్టుకోవాలనే ఆశ అలానే మిగిలుంది. 

తిరుపతి, బద్వేల్ లో తగిన శాస్తి జరిగినా ఇంకా ఆ ఆశ చావట్లేదు. రెండేళ్ల తర్వాత అధికారం మాదే, బీజేపీ-జనసేన ప్రభుత్వం గ్యారెంటీ అని చెప్పుకుంటున్న నేతలు.. ఇప్పుడు ఆత్మకూరులో కూడా డిపాజిట్లు కోల్పోవడం అవసరమా..?

మేకపాటి మేనల్లుడిని అంటున్న బిజివేముల రవీంద్రనాథ్ రెడ్డి ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తనకు టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తానని ఆయన ఇటీవలే ప్రకటించారు. అయితే ఆయనకి టికెట్ ఇచ్చే విషయంలో కూడా మీన మేషాలు లెక్కబెడుతోంది బీజేపీ.

కమిటీయా.. కాలయాపనా..?

అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యత ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి కమిటీపై పెట్టింది బీజేపీ. ఆయన కమిటీ అధ్యయనం చేసి, అభ్యర్థిని ఖరారు చేసే సరికి పుణ్యకాలం కాస్తా పూర్తవుతుంది. ఎన్నికలకు మూడు వారాల టైమ్ కూడా లేదు. ఇప్పటికే వైసీపీ ప్రచారంలో కూడా దూసుకెళ్తోంది. ఇంకా బీజేపీ ప్రచారం కూడా చేపట్టలేదు, అసలు అభ్యర్థినే ఖరారు చేయలేదు. 

బలమైన అభ్యర్థి దొరక్కే బీజేపీ ఇలా కాలయాపన చేస్తోందనే వాదన బలంగా వినపడుతోంది. డిపాజిట్లు కోల్పోయే త్యాగధనుడ్ని తీసుకొచ్చి ఆత్మకూరులో వైసీపీపై పోటీకి నిలబెట్టాలనే ఆలోచన చేస్తోంది.

ఇంతకీ ఆ బలి చక్రవర్తి ఎవరో, ఆయన పేరుని ఎంత సీక్రెట్ గా విడుదల చేస్తారో, ఆ తర్వాత ఎంత బహిరంగంగా పరువు పోగొట్టుకుంటారో వేచి చూడాలి.