జనసేన ఎమ్మెల్యే, వైసీపీలోకి వెళ్ళట్లేదా.!

జనసేన పార్టీ నుంచి ఇటీవలి ఎన్నికల్లో గెలిచింది ఒకే ఒక్క ఎమ్మెల్యే. అధినేత పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి పాలైనా, రాపాక వరప్రసాద్‌ మాత్రం జనసేన పార్టీ పరువు నిలబెట్టారు.…

జనసేన పార్టీ నుంచి ఇటీవలి ఎన్నికల్లో గెలిచింది ఒకే ఒక్క ఎమ్మెల్యే. అధినేత పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి పాలైనా, రాపాక వరప్రసాద్‌ మాత్రం జనసేన పార్టీ పరువు నిలబెట్టారు. ప్రస్తుతం జనసేన పార్టీకి వున్న ఒకే ఒక్క ఎమ్మెల్యే. ఆయన కూడా, అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ని ప్రశంసలతో ముంచెత్తడంలో మునిగి తేలుతున్నారు. ఈ పరిస్థితుల్లో జనసేన శ్రేణులు రాపాక వరప్రసాద్‌ మీద అసహనం వ్యక్తం చేయడం సహజమే. 

కానీ, వున్న ఒకే ఒక్క ఎమ్మెల్యేని చేజార్చుకుంటే కష్టమని పార్టీకి చెందిన ముఖ్య నేతలు భావిస్తున్నారు. 'అభిమానుల మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు..' అంటూ జనసేన కార్యకర్తలుగా మారిన పవన్‌ కళ్యాణ్‌ అభిమానుల్ని లైట్‌ తీసుకుంటూ, రాపాక వరప్రసాద్‌తో జనసేన నేతలు సర్దుకుపోతున్నారు. మరోపక్క నిన్న మొన్నటిదాకా రాపాక వరప్రసాద్‌ విషయంలో అంటీ ముట్టనట్టు వ్యవహరించిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కూడా, ఆయనతో ఇప్పుడు వరుస భేటీలు నిర్వహించేస్తున్నారు. 

'పార్టీలో చిన్న చిన్న అభిప్రాయ బేధాలు సహజమే.. అలాగని, రాపాక వరప్రసాద్‌ జనసేనను వీడుతారంటే ఎలా.? ఆయన పార్టీలో హ్యాపీగా వున్నారు. పార్టీ ఆయనకు అన్ని విషయాల్లోనూ పెద్ద పీట వేస్తోంది..' అంటున్నారు జనసేన నేతలిప్పుడు. మరోపక్క, రాపాక వరప్రసాద్‌ కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గానే పాల్గొంటుండడం గమనార్హం. పార్టీ కార్యక్రమాలంటే.. పార్టీ వేదికలపై జరుగుతున్న సమీక్షలన్నమాట. 

ప్రస్తుతానికి రాపాక వరప్రసాద్‌ వైసీపీలోకి వెళ్ళాలన్న ఆలోచన పక్కన పెట్టినా, ఆయన పార్టీ మారేదాకా పవన్‌ అభిమానులు ఊరుకునేలా లేరు. సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు వ్యతిరేకంగా పెద్దయెత్తున దుష్ప్రచారం కొనసాగిస్తూనే వున్నారు. వున్న ఆ ఒక్క ఎమ్మెల్యేనీ చేజార్చుకుని.. ఏం సాధించేద్దామనో ఏమో.. సోకాల్డ్‌ అభిమానులకే తెలియాలి.