ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, రాష్ట్రంలో విద్యా వ్యవస్థ గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ క్రమంలో స్కూళ్ళు, కాలేజీల్లో ఫీజులు తగ్గాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. విద్య అనేది లాభాపేక్షతో కూడిన వ్యాపారం కాకూడదని చట్టాల్లో వుందన్న విషయాన్ని ప్రస్తావించారు. ఎల్కేజీ చదువుల కోసం అరవై వేల రూపాయలకు ఖర్చు చేయాల్సి వస్తే, సామాన్యుడు తమ పిల్లల్ని ఎలా చదివించుకోగలుగుతాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
నిజమే, చదువు అనేది ముందు ముందు సామాన్యుడికి అందని ద్రాక్షలా మారిపోతుందేమో. ఎల్కేజీ చదువు కోసం 60 వేలు ఖర్చు చేయాల్సిన దుస్థితి కొన్ని స్కూళ్ళ కారణంగా వచ్చిందని వైఎస్ జగన్ చెప్పింది అక్షర నిజం. ఆ మాటకొస్తే, 60 వేలు కాదు.. లక్షన్నర ఫీజులు వసూలు చేసే 'పెద్ద పెద్ద' స్కూళ్ళు కూడా వున్నాయి. 25 శాతం మంది విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించాలన్న నిబంధననీ వైఎస్ జగన్ గుర్తు చేశారు. అదీ నిజమే.
కానీ, పిల్లి మెడలో గంట కట్టేదెవరు.? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి, ఆవేదన వ్యక్తం చేసే దుస్థితి దాపురించిదంటే.. ఈ వ్యవస్థ బాగుపడేదెలా.? పిల్లల్ని చదివించే ప్రతి తల్లికీ ఏడాదికి 15 వేల రూపాయలు ఇచ్చేలా 'అమ్మ ఒడి' పథకాన్ని ఇప్పటికే వైఎస్ జగన్ ప్రకటించి వున్నారు. ఆ అంశానికి లోబడే ప్రైవేటు విద్యా వ్యవస్థపై వైఎస్ జగన్ సీరియస్ కామెంట్స్ చేశారని అర్థం
ఒకవేళ వైఎస్ జగన్ గనుక, తన హయాంలో విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురాగలిగితే.. రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనే అదో అద్భుతం అవుతుంది. అయితే, అదంత ఆషామాషీ వ్యవహారం కానే కాదు. చంద్రబాబు హయాంలోనే కాదు, ఇప్పుడు వైఎస్ జగన్ హయాంలో కూడా అధికార పార్టీ నేతలకు విద్యా సంస్థలున్నాయి. ఆయా విద్యా సంస్థల్లోనూ తల్లిదండ్రుల మైండ్ బ్లాంక్ అయ్యేలా ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తున్నారు.
ఇప్పటికే ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్న వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, ఈ ఫీజుల నియంత్రణ విషయంలో చర్యలు తీసుకోగలిగితే.. అది మహాద్భుతమే. ఆ మహాద్భుతం వైఎస్ జగన్ హయాంలో చూడగలమా.?