టీటీడీ బోర్డు మాజీ స‌భ్యుల మూగ‌రోద‌న‌!

టీటీడీ బోర్డు మాజీ స‌భ్యుల మూగ రోద‌న వ‌ర్ణ‌నాతీతం. టీటీడీ చైర్మ‌న్‌గా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి రెండో సారి బుధ‌వారం శ్రీ‌వారి చెంత బాధ్య‌త‌లు తీసుకున్నారు. అయితే త‌మ‌కు మాత్రం…

టీటీడీ బోర్డు మాజీ స‌భ్యుల మూగ రోద‌న వ‌ర్ణ‌నాతీతం. టీటీడీ చైర్మ‌న్‌గా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి రెండో సారి బుధ‌వారం శ్రీ‌వారి చెంత బాధ్య‌త‌లు తీసుకున్నారు. అయితే త‌మ‌కు మాత్రం రెండో సారి అవ‌కాశం ఇవ్వ‌క‌పోవ‌డంపై బోర్డు మాజీ స‌భ్యులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

2019, జూన్ మూడో వారంలో టీటీడీ చైర్మ‌న్‌గా వైవీ సుబ్బారెడ్డి నియ‌మితుల‌య్యారు. ఆ త‌ర్వాత సెప్టెంబ‌ర్ రెండో వారంలో బోర్డు స‌భ్యుల‌ను ప్ర‌భుత్వం నియ‌మించింది. ఎక్స్‌అఫిషియో సభ్యులతో కలిపి 28మందికి టీటీడీ పాల‌క మండ‌లిలో అవకాశం జ‌గ‌న్ ప్ర‌భుత్వం కల్పించింది. ఇందులో ఏపీ నుంచి 8 మందికి అవ‌కాశం ద‌క్కింది. ఆ త‌ర్వాత  తెలంగాణ నుంచి ఏడుగురికి చోటు ల‌భించింది.

అయితే గ‌త ఏడాదిన్న‌ర‌గా క‌రోనా పంజా విస‌ర‌డంతో అన్ని వ్య‌వ‌స్థ‌లు స్తంభించిన సంగ‌తి తెలిసిందే. బోర్డు స‌భ్యులుగా నియామ‌కం అయ్యారన్న‌ మాటే గానీ, శ్రీ‌వారికి సేవ చేసుకునే అవ‌కాశం చాలా త‌క్కువనే అసంతృప్తి బోర్డు మాజీ స‌భ్యుల్లో నెల‌కుంది. 

అంతే కాకుండా, వైవీ సుబ్బారెడ్డి మొద‌టి సారి చైర్మ‌న్‌గా ఎంపికైన రెండున్న‌ర నెల‌ల త‌ర్వాత నూత‌న బోర్డు స‌భ్యుల నియమాకం, అనంత‌రం ఆయ‌న‌తో పాటు ర‌ద్దు కావ‌డం వారిలో అసంతృప్తి క‌లిగించింది.

చైర్మ‌న్‌గా వైవీ సుబ్బారెడ్డితో పాటు మ‌రోసారి త‌మ‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని కొంద‌రు సీఎం జ‌గ‌న్ వ‌ద్ద ప్ర‌తిపాదించార‌ని స‌మాచారం. అయితే ఆ ప్ర‌తిపాద‌న‌ల‌ను ఆయ‌న తిర‌స్క‌రించార‌ని తెలిసింది. కొత్త స‌భ్యుల నియామ‌కానికి ఆయ‌న మొగ్గు చూపారు. ప్ర‌స్తుతం కొత్త స‌భ్యుల నియామ‌కంపై ఆయ‌న క‌స‌రత్తు చేస్తున్నారు. 

వైవీ సుబ్బారెడ్డి రెండోసారి బాధ్య‌త‌లు స్వీక‌రించిన సంద‌ర్భంగా, త‌మ‌కు కూడా రెండోసారి అవ‌కాశం క‌ల్పించి వుంటే బాగుండేద‌నే అభిప్రాయాల‌ను కొంద‌రు స‌భ్యులు వ్య‌క్త‌ప‌ర‌చ‌డం గ‌మ‌నార్హం. జ‌గ‌న్‌కు స‌మీప బంధువై ఉంటే… ఎన్ని సార్లైనా అవ‌కాశం వ‌చ్చేద‌ని న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు కొంద‌రు స‌భ్యుల నుంచి రావ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.