మాజీ మంత్రి, టీడీపీ మహిళా నేత భూమా అఖిలప్రియ కోరి కోరి కొరివితో తల గోక్కుంటోంది. తెలంగాణలో భూకబ్జా వ్యవహారాల్లో, కిడ్నాప్, అలాగే కోర్టు విచారణ తప్పించుకునేందుకు తప్పుడు కోవిడ్ సర్టిఫికెట్లను సమర్పించిన కేసుల్లో అఖిలప్రియ, ఆమె కుటుంబ సభ్యులు పీకల్లోతు కష్టాల్లో ఉన్న సంగతి తెలిసిందే.
తప్పుడు కోవిడ్ సర్టిఫికెట్ సమర్పించిన కేసులో అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్, ఆమె తమ్ముడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి నెలకు పైగా పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులతో అఖిలప్రియ ఘర్షణకు దిగడం టీడీపీ శ్రేణుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఇది అఖిలప్రియ మూర్ఖత్వమా? మొండితనమా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో కేపీహెచ్పీ పరిధిలోని లోధాబెల్లెజ అపార్ట్మెంట్లోని తన ఫ్లాట్‌లో కుటుంబ సభ్యలెవరూ లేని సమయంలో బోయిన్పల్లి పోలీసులు అనధికారికంగా చొరబడి ఆస్తి పత్రాలు, విలువైన డాక్యుమెంట్లు తీసుకెళ్లారని అఖిలప్రియ కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చకు దారి తీసింది.
హఫీజ్ పేట్ భూముల వ్యవహారంలో అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్, తమ్ముడు జగత్ విఖ్యాత్లకు బోయిన్పల్లి పోలీసులు ఉచ్చు బిగించిన సంగతి తెలిసిందే. అఖిలప్రియ జైలుకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. నెల క్రితం తెలంగాణలోని కొందరు పోలీసు అధికారులకు మీడియా వేదికగా అఖిలప్రియ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో… కేపీహెచ్‌బీ పీఎస్‌లో ఆమె ఫిర్యాదు ప్రాధాన్యం సంతరించుకుంది.
ఉద్దేశ పూర్వకంగానే అఖిలప్రియ తమను టార్గెట్ చేసిందని తెలంగాణ పోలీసు అధికారులు భావిస్తున్నారని సమాచారం. తమపై అఖిలప్రియ ఫిర్యాదు చేయడాన్ని తెలంగాణ సర్కార్ సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. తమ విధులకు ఆటంకం కలిగిస్తున్న అఖిలప్రియపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు తెలంగాణ పోలీస్ యంత్రాంగం సమాయత్తం అవుతోందని సమాచారం.
మరీ ముఖ్యంగా తమను దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నాన్ని తెలంగాణ పోలీసులు జీర్ణించుకోలేకున్నారని తెలిసింది. అఖిలప్రియను ఇక ఉపేక్షించొద్దనే నిర్ణయానికి పోలీసు యంత్రాంగం వచ్చింది.