తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి రెండోసారి నేడు బాధ్యతలు స్వీకరించారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలో నిర్వహించిన కార్యక్రమంలో టీటీడీ ఈఓ జవహర్‌రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు.
తనకు రెండోసారి శ్రీవారికి సేవ చేసుకునే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు సుబ్బారెడ్డి తెలిపారు. 2019లో జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మొట్టమొదటి నియామాకం వైవీ సుబ్బారెడ్డిదే. టీటీడీ చైర్మన్‌గా 2019లో వైవీ సుబ్బారెడ్డిని నియమించింది. రెండేళ్ల కాలపరిమితి ఈ ఏడాది జూన్ 22వ తేదీ ముగిసింది.
బోర్డు సభ్యుల కాలపరిమితి ఉన్నప్పటికీ, చైర్మన్ పదవీ కాలం ముగియడంతో బోర్డు కూడా రద్దయింది. తనకు ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగాలని ఉందని వైవీ సుబ్బారెడ్డి ప్రకటించడంతో, కొత్త చైర్మన్ వస్తారని అంతా భావించారు.
అయితే ప్రకాశం జిల్లాలో రెండు పవర్ సెంటర్లను కొనసాగించడం ఇష్టం లేని జగన్…మరోసారి వైవీ సుబ్బారెడ్డిని శ్రీవారి సేవలోనే కొనసాగాలని ఆదేశించారు. ఈ మేరకు రెండు రోజుల క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో వైవీ సుబ్బారెడ్డి బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. త్వరలో బోర్డు సభ్యులను కూడా నియమించనున్నారు.