జగన్ పాలన అంతా బాగానే ఉంది కానీ ఎస్ఈసీ వ్యవహారంలో జగన్ అనవసరంగా తొందరపడ్డారేమో అని కొందరు తటస్థ మేధావులు అభిప్రాయపడ్డారు. జగన్ పాలన ఏడాది పూర్తి అయిన సందర్భంగా స్పందించిన వారిలో కోర్టులతో జగన్ ప్రభుత్వం అనవసరమైన వివాదాలకు పోతోందేమో అనే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ తీసుకున్న నిర్ణయాలను తెలుగుదేశం, జనసేన వాళ్లు తప్ప ఎవరూ సమర్థించలేదు, ఈ విషయంలో సుప్రీం కోర్టు కూడా తప్పుపట్టిన వైనాన్ని సదరు మేధావులు మరిచిపోయినట్టుగా ఉన్నారు. ఈ తటస్థ మేధావుల దృష్టిలో నిమ్మగడ్డను తప్పించాలని జగన్ ప్రభుత్వం భావించడం చాలా తప్పై పోయింది.
జగన్ వైఖరి తప్పు పట్టే ఈ మేధావులు ఇదే సమయంలో నిమ్మగడ్డ వైఖరేమిటో కూడా ఇప్పుడు అర్థం చేసుకునే అవకాశం వచ్చింది. 152 మంది ఎమ్మెల్యేలతో నెగ్గిన ప్రభుత్వం తన నిర్ణయాలను అమలు చేయాలని అనుకోవడం, తమను మాట మాత్రమైన సంప్రదించని వ్యక్తికి అపారమైన గౌరవాన్ని ఇవ్వాలి! ఆయనను ఏమీ అనకూడదు. విచక్షణాదికారం పేరుతో వాళ్లు రాజ్యాంగేతర శక్తులుగా తయారవుతున్నా చూస్తూ ఊరికే ఉండాలి!
కేవలం నిమ్మగడ్డే కాదు.. ఈ మధ్య కాలంలో విచక్షణాధికారాన్ని ప్రయోగించిన టీడీపీ వర్గీయులు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఎస్సీల, బీసీల పిల్లలకు ఇంగ్లిష్ మీడియం చదువులను అందనీయకుండా కొందరు పెద్దలు విచక్షణను ప్రయోగించిన విషయాన్నీ మరవకూడదు! ఇలాంటి విచక్షణాధికారాలు 152 మంది ఎమ్మెల్యేల ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుంటుంటే.. ఇక ఎన్నికల్లో గెలవడం ఎందుకు? ఇలాంటి విచక్షణలున్న పదవులు చాలు కదా, నియంతలుగా చలామణి కావడానికి?
ఇక ఇదే సమయంలో తనకు పదవి దక్కేసిందని ఏకంగా ఎస్ఈసీలోని లాయర్ ను రాజీనామా చేయాలంటూ ఆదేశాలు ఇవ్వడం ద్వారా నిమ్మగడ్డ మొత్తం తెలుగుదేశం పార్టీనే డిఫెన్స్ లోకి పడేశారు. అంటే.. ప్రభుత్వం నిమ్మగడ్డను తప్పించాలని అనుకుంటే అది వివాదం, నియంతృత్వం! అయితే ఎస్ఈసీలో నిమ్మగడ్డకు నచ్చని లాయర్లు ఉండకూడదు! అది మాత్రం విచక్షణే, ఎన్నికల వాయిదా గురించి నిమ్మగడ్డ రాష్ట్ర ప్రభుత్వానికి తెలపాల్సిన అవసరం లేదు, తనే సొంతంగా స్థానిక ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని తీసేసుకోవడం, తనను తానే ఎస్ఈసీగా నియమించుకోవడం.. ఇవన్నీ విచక్షాణాధికారాలే! ఈ విచక్షాణాధికారాల గురించి ఇప్పుడు అసలు చర్చ మొదలవుతూ ఉంది. ఇది తెలుగుదేశం పార్టీని డిఫెన్స్ లో పడేస్తూ ఉంది. ఇంకో సంగతి మిగిలే ఉంది. అదే నిమ్మగడ్డ లేఖ వ్యవహారం. అది కూడా ఇప్పుడు బయటకు వస్తే.. రచ్చ రసవత్తరంగా మారే అవకాశం ఉంది.