ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే లెక్క 3వేలు దాటగా.. తాజాగా మరో 76 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకు 10,567 శాంపిల్స్ ను పరీక్షించగా.. వీటిలో 76 మందికి కరోనా సోకినట్టు అధికారులు నిర్థారించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3118కు చేరింది.
కొత్తగా నమోదైన కేసుల్లో నెల్లూరు జిల్లాకు చెందిన 8మందికి కోయంబేడుతో కనెక్షన్ ఉన్నట్టు అధికారులు ప్రకటించారు. అటు గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 34 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం డిశ్చార్జ్ ల సంఖ్య 2169కు చేరుకుంది. మరణాల సంఖ్య 64కు పెరిగింది. ప్రస్తుతం 885 మందికి వివిధ హాస్పిటల్స్ లో చికిత్స కొనసాగుతోంది.
ఇక విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి సంఖ్య చూస్తే… ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తుల్లో మొత్తం 446 మంది కరోనా బాధితులున్నారు. అటు విదేశాల నుంచి వచ్చిన వాళ్లలో 112 మందికి పాజిటివ్ సోకినట్టు నిర్థారించారు. వీటితో కలిపి చూసుకుంటే రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3676కు చేరుతుంది.
రాష్ట్రంలో కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. వైరస్ ఉధృతి ఎక్కువగా ఉన్నప్పటికీ కోలుకుంటున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉండడం కాస్త ఊరట కలిగించే అంశం. అయితే లాక్ డౌన్-5 కింద మరిన్ని మినహాయింపులు ఇవ్వడంతో రాబోయే రోజుల్లో మరిన్ని కేసులు పెరిగే ప్రమాదముందని అధికారులు చెబుతున్నారు.