నిదానమే ప్రధానం అనేది అన్నిచోట్లా పనికొస్తుందేమో కానీ, రాజకీయాల్లో మాత్రం కుదరదు. ఎవరు ముందుగా దూసుకొస్తారో, కొత్త ఎత్తుగడలతో ఎవరు హుషారుగా ఉంటారో వారికే పదవి, పరపతి. ఆలశించిన ఆశాభంగం.. అనేది రాజకీయాలకు సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడీ విషయం ఎందుకంటే… 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఇప్పుడిప్పుడే ఏపీలో అడుగులు ముందుకు పడుతున్నాయి. అయితే ఈ అడుగులు చంద్రబాబువా లేక జగన్ వా అనేది తేలాల్సి ఉంది. ఎవరు ముందుగా ఇంటి నుంచి కాలు బయటపెడతారనేది ఆసక్తికరంగా మారింది.
ప్రతిపక్ష నేతగా గతంలో వైఎస్ఆర్ చేపట్టిన పాదయాత్ర ఆయన్ను అధికారానికి దగ్గరచేసింది. అధికారంలో ఉన్నప్పుడు జనాల్ని పట్టించుకోని చంద్రబాబు కూడా ఆ తర్వాతి కాలంలో ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేపట్టి అధికారంలోకి వచ్చారు. ఇక జగన్ సంగతి చెప్పేదేముంది. పాదయాత్ర అనే పేరుకి పర్యాయపదం జగన్. వేల కిలోమీటర్లు అలుపెరగకుండా సాగించిన ఆయన సుదీర్ఘ పాదయాత్ర నేరుగా ఆయన్ను తీసుకెళ్లి సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది.
జగన్ అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయింది. ఇదిగో అదిగో అనుకుంటే మూడో ఏడాది కూడా దాటిపోతుంది. మరి జనం వద్దకు వెళ్లి తన పార్టీ పరిస్థితి అంచనా వేసుకోవడం ఎలా..? జగన్ జనంలోకి ఎప్పుడొస్తారనేది తేలాల్సి ఉంది. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. జగన్, చంద్రబాబులో ఎవరు ముందుగా జనంలోకి వస్తారనేది చర్చనీయాంశమైంది. కరోనా వల్ల చంద్రబాబు, జగన్ ఇద్దరూ ఇల్లు కదల్లేదు.
చంద్రబాబు తన పార్టీ కార్యకలాపాలన్నీ జూమ్ లోనే మొదలు పెట్టి జూమ్ లోనే పూర్తి చేస్తున్నారు. మధ్యమధ్యలో బయటకొచ్చినా అది పరామర్శల కోసం మాత్రమే. అటు జగన్, తన ఆఫీస్ విడిచి అప్పుడప్పుడు మాత్రమే బయటకు వచ్చేవారు. సంక్షేమ పథకాలన్నీ ఒక్క కంప్యూటర్ బటన్ నొక్కి అందిస్తూ వస్తున్నారు. మరి వీళ్లిద్దరూ ఎప్పుడు పూర్తి స్థాయిలో బయటకు రాబోతున్నారు? వీరిలో ఎవరు ముందు..? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
చంద్రబాబు ప్లాన్ ఇది..
వయసైపోతున్న దశలో చంద్రబాబు తన కొడుకు లోకేష్ ని జనంలోకి పంపించాలనుకున్నారు. కానీ అది అత్యంత ప్రమాదకరం అని ఆయనకు బాగా తెలిసొచ్చింది. కొడుకు నోరు తెరవకుండా ఉండటమే మంచిదన్న ఉద్దేశంతో చివరిసారిగా ఆ ప్రయత్నం తాను చేయాలనుకుంటున్నారు.
ఎన్నికల నాటికి జిల్లాల పర్యటన పూర్తి చేయాలనుకుంటున్నారు బాబు. జిల్లా కేంద్రాల్లో బస చేసి, నియోజకవర్గ నేతలతో విడివిడిగా సమావేశాలు ప్లాన్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ పార్టీ అంతర్గత సమస్యల్ని పరిష్కరించాలని అనుకుంటున్నారు. ఓ శుభమహూర్తం చూసి దీన్ని ప్రారంభిస్తారు బాబు.
జగన్ ఏం చేయబోతున్నారు..?
జనంలోకి వెళ్లి, జనం మధ్య కూర్చుని వారి సమస్యలు విని, అక్కడికక్కడే పరిష్కారం చేసే రచ్చ బండ కార్యక్రమం జగన్ కల. తండ్రి ఆపేసిన కార్యక్రమాన్ని తాను తిరిగి మొదలు పెట్టాలనుకుంటున్నారు. అయితే కరోనా కారణంగా అది వాయిదాలమీద వాయిదాలు పడుతోంది. సచివాలయాలను సందర్శిస్తూ రచ్చబండ మొదలు పెట్టి ఎన్నికల వరకు అలాగే జనంలోనే ఉండాలని ప్లాన్ చేస్తున్నారు జగన్.
స్థానికంగా బస చేస్తూ కొన్ని జిల్లాల్లో ఉన్న అసంతృప్తులపై, గ్రూపు తగాదాలపై కూడా దృష్టి పెట్టాలనుకుంటున్నారు. పనిలో పనిగా ఎమ్మెల్యేల పనితీరు కూడా ప్రత్యక్షంగా తెలిసిపోతుంది కాబట్టి.. వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలో, ఎవరిని పక్కనపెట్టాలో అనేది తేలిపోతుంది.
ఎవరు ముందు దిగితే వాళ్లకే లాభం
చంద్రబాబైనా, జగన్ అయినా ఏం చేశారనేది ముఖ్యం కాదు. జనంలోకి ఎవరు ముందుగా వచ్చారు, ఎవరు వేగంగా దూసుకెళ్తున్నారనేది ముఖ్యం. నిజం గడపదాటేలోపు, అబద్ధం ప్రపంచం చుట్టేస్తుందని సామెత. ఆ సామెతను నిజం చేస్తూ చంద్రబాబు ముందుగా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ జనాల్ని రెచ్చగొట్టే ప్రమాదం ఉంది. దీన్ని ముందుగానే పసిగట్టి, జగన్ అప్రమత్తమవ్వాల్సిన తరుణం ఇది.
ఈ సంగతి పక్కనపెడితే.. ప్రజల్లో వైసీపీ సర్కారుపై ఎలాంటి అభిప్రాయం ఉంది, తప్పొప్పులేంటి, ఎక్కడ ప్రభుత్వం వెనకబడి ఉంది లాంటి అంశాలు తెలుసుకోవాలంటే జగన్ కాలు బయటపెట్టాల్సిందే.