రాజ్యసభలో మంగళవారం చోటు చేసుకున్న పరిణామాలు నిన్న రాత్రి తనకు నిద్ర కరవు చేశాయని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభలో బుధవారం భావోద్వేగ వాతావరణం నెలకుంది. నిన్నటి సభ పరిణామాలను గుర్తు చేసుకుంటూ వెంకయ్యనాయుడు కంటతడి పెట్టడం గమనార్హం.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా బుధవారం రాజ్యసభలో పలువురు విపక్ష ఎంపీలు సభ చైర్మన్ స్థానం వద్దకు దూసుకెళ్లారు. మంగళవారం కూడా ఎంపీలు ఇదే రీతిలో ప్రవర్తించారు. ఆప్, కాంగ్రెస్ సభ్యులు పోడియం ఎదుట టేబుట్‌పైకి ఎక్కి ఆందోళన చేశారు.
సాగుచట్టాలపై విపక్షాలు తమ నిరసనను రోజురోజుకూ పెంచుతున్నాయి. మంగళవారం కాంగ్రెస్ ఎంపీ ప్రతాప్‌సింగ్ బజ్వా బల్లపైకి ఎక్కి నినాదాలు చేశారు. సభ చైర్మన్ స్థానంపైకి ఫైల్‌ను విసిరేశారు. మరోఎంపీ రిపున్ బోరా కూడా కొద్దిసేపు ఆ బల్లపై ఎక్కారు.
టీఎంసీ, డీఎంకే సభ్యులు సభకు నల్ల దుస్తులు.. కాంగ్రెస్ సభ్యులు నల్లటి రిబ్బన్ బ్యాండ్లు ధరించి వచ్చారు. బుధవారం కూడా విపక్ష సభ్యుల నుంచి అదే రకమైన నిరసన ఎదురు కావడంతో వెంకయ్యనాయుడు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.
‘చైర్మన్ పోడియం దేవాలయ గర్భగుడి లాంటిది. భక్తులు గర్భగుడి వరకు రావచ్చుకానీ లోపలకు రాకూడదు. ఇలాంటి ఘటనలు తరచూ జరగడం ఆవేదన కలిగిస్తోంది. నిన్న రాత్రి నాకు నిద్ర పట్టలేదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి ’ అంటూ సభ్యులకు వెంకయ్య నాయుడు కోరారు. కానీ సాగు చట్టాలను వెనక్కి తీసుకునే వరకూ విపక్షాలు తమ ఆందోళనలు విరమించేలా లేవు.