పదేళ్లపాటు నానాహింసలు పెట్టినా, కేసులు కట్టించినా, జైల్లోకి నెట్టించినా, అందులో ఐదేళ్లపాటు సాక్షాత్తు అసెంబ్లీలో నరాలు తెగేలా మానసికంగా హింసించినా బయటపడని వ్యక్తిత్వంతో సాగారు ఏపీ సీఎం జగన్. ఏదైనా సాధించాలనుకుంటే అన్నింటిని భరించాల్సిందేనని అందుకు ప్రజల వద్దకే పోవాలి. అలాగే ప్రజలనే నమ్ముకుని వారితో మమేకం అయ్యారు. నాకు అధికారం ఇస్తే టీడీపీ లెక్కలు తేలుస్తానని, బాబు అండ్ బేటాను జైలుకు పంపుతానని ఏనాడు ప్రజల్లో టంగ్ స్లిప్ కాకుండా మనస్సు రాయిచేసుకున్నారు వైయస్ జగన్. నలుగురితో నారాయణ అన్నట్లుగానే బాబు పాలనపై విమర్శలు గుప్పించారు. బాబుపాలనలో అవకతవకలు, భారీ అవి నీతి తప్పకుండా జైలు ఊచలు లెక్కించి తీరుతాయని బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రనేతలు మీడియాలో విమర్శలు గుప్పించేవారు. వారితో బాటే జగన్ కూడా బాబు పాలనపై పాదయాత్రల్లో విమర్శలు గుప్పించేవారు. రేపు అధికారంలోకి వస్తే బాబు చేసిన అవినీతిపై విచారణ చేస్తామనేవారు. తప్పితే, తన మనస్సులో అనుకున్నదాన్ని ఏనాడు బహిర్గతం చేయలేదు.
నాయకుడుకి ఉండాల్సిన ప్రథమ లక్షణం ఇదేనని చాటుకున్నారు జగన్. ఐదేళ్లపాటు బాబు దుష్టనికృష్ట పాలనను జనాలు చవిచూసారు. అలో! లక్ష్మణ అనేవారు అన్నారు. బాబోయ్! బాబును, ఆపార్టీ హింసకదండును భరించలేం ఓటు ఆయుధంతో టీడీపీని కుప్పకూల్చాలనుకున్నోళ్లు అనుకున్నారు. 5కోట్ల జనాల్లో కరడుగట్టిన టీడీపీ సానుభూతిపరులు తప్ప అత్యధికులు బాబు అండ్‌కోకి నూకలు నిండేలా చేయాలని దృఢచిత్తులయ్యారు. ఎన్నికలు వచ్చాయి. బాబు వేయాల్సిన వెర్రిమొర్రి వేషాలు జనాల్లో ఎన్నికల ముందే వేసారు. మొత్తానికి ఓటమి కూడా ఇంత ధారుణంగా ఉంటుందా అన్నంత ఓటమిని కిర్రెక్కిన ప్రజలు బాబు నెత్తికెత్తారు. ఏపీ జనాలు సంతోషంతో పండగ వాతావరణాన్ని ఎవరికివారే సృష్టించుకుని మరీ అనుభవించారు. కేరింతలు కొట్టారు. స్వీట్లు ఒకరికిఒకరు తినిపించుకున్నారు.
రేపట్నించి బాబు అండ్‌కో లెక్కలు తేలుస్తారు. అలాంటి ఇలాంటిచుక్కలు కనబడవు. జగన్ కసితో కక్షతోఉన్నాడు. 16నెలలు జైలు, 11అక్రమకేసులు బనాయింపు 10ఏళ్ల పాటు మానసికహింస ఇవన్నీ దశలవారిగా బాబు నుంచి జగన్ పొందారు. కనుక జగన్ ఇంతకు పదింతలు బాబు లెక్కలు తేలుస్తారని అత్యధిక జనాలు అనుకున్నారు. ఏ నలుగురుని కదిపినా ఇదే చర్చ. బాబుకు తగినశాస్తి జరగాల్సిందేనని ఇతర పార్టీలవారు కూడా ఆశించారు. పులివెందుల పులి చేతులు ముడుచుకుని కూర్చోదు. బాబుకు చిన్నబాబుకు జైలుదారి పట్టించి తీరుతుంది అని వైకాపా శ్రేణుల్లో బలంగా విన్పించింది. గెలిచిన వైకాపా ఎంఎల్ఏలు కూడా బాబు పనిపట్టడం ఖాయమన్నారు. ఢిల్లీ నుంచి వైకాపా కీలకనేత విజయసాయిరెడ్డి ట్విట్లతో బాబు లెక్కలు తేల్చడం ఖాయమన్నారు. ఇలా ఒక్క జగన్ తప్ప అంతా బాబు విషయంలో ఆరునూరైన బాబుకు జైలు తప్పదని తేల్చారు.
అందరి ఆలోచనలకు, ఏదేదో జరిగిపోతుందనుకున్న వారికి గెలిచిన జగన్ తొలిరోజు నుంచి ఆశ్యర్యపోయేలా ప్రవర్తించసాగారు. మరోవైపు సోషల్ మీడియాల్లో జగన్ మంత్రివర్గంలో పక్కా సీనియర్లు కొలువు తీరిపోతారని ఒకటే ఊదరగొట్టుడు ఆరంభం అయ్యింది. ఆర్కే.రోజా గ్యారంటీగా స్పీకరే, అంబటికి హోమ్ తప్పదు, ధర్మానకు రెవెన్యూ ఇస్తే పాతకొలువే. కాకానికి మున్సిపాలిటీలు, కరుణాకర్‌రెడ్డికి పంచాయితీరాజ్, రామక్రిష్ణారెడ్డికి దేవాదాయశాఖ, తమ్మినేనికి చెప్పలేం. ఇలా సోషల్ మీడియాలో వీరదంపుడు వార్తలు వెల్లువెత్తాయి. ఈదంపుడులో వైకాపా ఎంఎల్ఏలు ఏక్షణమైనా జగన్ నుంచి తీపితీపి కబుర్లు వింటామనుకుని సెల్ రింగ్ అయితే జగన్ నుంచే అనుకున్నారు. పార్టీకోసం టీడీపీతో నానాయాతనలు పడ్డందుకు సోషల్‌మీడియా ప్రచారాన్ని నమ్మి పదవులు దక్కడం ఖాయం అని అంతా అనుకున్నారు.
కానీ, ఇటు సోషల్ మీడియా, అటు వైకాపా శ్రేణులు, ఇతరత్రా పార్టీ శ్రేణులు, వైకాపా సీనియర్లు ఒకరేమిటి అంతా అనుకున్న దానికి విరుద్ధంగా కొత్త ముఖాలకు మంత్రిపదవులు, డిప్యూటీ సీఎం పదవులు జగన్ కట్టబెట్టారు. ఒక్కసారి ఏపీ యావత్తు ఉలికిపాటుకు గురయ్యింది. తమ్మినేనికి స్పీకర్ పదవి వరించింది. ఈలోగా, సీఎం జగన్ అన్ని శాఖల అధికార్లతో మీట్లు పెట్టి వారితో మమేకమై రేపటి పాలనకు నేడే శ్రీకారం అన్నట్లుగా అధికారయంత్రాంగంపై పట్టు సాధించారు. తొలిసారి అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసారు. అందులో 23మంది సభ్యులతో టీడీపీ ప్రతిపక్షంలో బతికి చెడ్డాం అన్నట్లు కూర్చుంది. అప్పుడు సీఎం జగన్ మాట్లాడుతూ ఆనాడు మా పార్టీలో 23 మందిని సంతల్లో పశువులను కొన్నట్లు కొన్నందుకు ఇప్పుడు కనీసం ప్రతిపక్షహోదా బాబుకు లేకుండా ఓపది మందిని నాపార్టీలో చేర్చుకోగలను.
కానీ, అప్పుడు మా ఇద్దరికి తేడా ఏముంటుంది? అని ఘాటుగానే విమర్శలు చేసారు. ఎప్పుడూ అధికారపక్షానికి ప్రతిపక్షం ఉండాలి. అలాఉంటేనే సభ రక్తి కుడుతుందన్నట్లుగా మాట్లాడారు. చిత్తుగా ఓడిన టీడీపీలో ఎంఎల్ఏలు అందులో ఇమడలేక మాపార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. వారిని చేర్చుకోలేం, వారు చేరాలంటే ఎంఎల్ఏలుగా రాజీనామాలు చేసి వస్తే చేర్చుకుంటానని షరతులు తెలిపి అందరిని ఆశ్చర్య పరిచారు. ఇక్కడే బాబు అండ్ కో బతుకు జీవుడా అని గుండెలపై చేతులు వేసుకుంది. లేకుంటే ఈపాటికి బాబును వదలి వైకాపాలోకి వెళ్లిన వారి హడావుడితో బాబుకు ప్రతిపక్షహోదా కూడా అందుకోలేనంత దూరమై గగనమయ్యేది. అసలు బాబు ప్రతిపక్ష స్థానాన్ని చెక్కుచెదరకుండా అసెంబ్లీలో జగన్ రక్షిస్తున్నారనేది రాజకీయముదుర్లు అర్ధంకాక నొసలు నొక్కుకుంటున్నారు.
బాబుతో పదేళ్లుగా అనేక కష్టనష్టాలు అనుభవించిన జగన్ ఇప్పుడు బాబుపార్టీ చెక్కు చెదరకుండా తానే రక్షణ కవచం అయ్యారు. 23మందిలో ఏఒక్కరు జారిపోకుండా చూస్తున్నారని రాజకీయ పరిపక్వత కలిగిన జనాల్లో కూడా మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. ఇక్కడే జగన్ లో ఉన్న అసలుసిసలు విషయం నిక్షిప్తమై ఉంది. అదేమంటే జగన్ పాలనలోకి వచ్చిన తొలిరోజు నుంచి పాలకవర్గంపై అధికార యంత్రాంగంపై పట్టుబిగించడంలో ఒకనిముషం కూడా వృధాచేయలేదు. అంతా తనగుప్పిట్లోకి తెచ్చుకున్నారు. ఆపైన మంత్రివర్గం అనేది ఏర్పాటు చేసారు. అందులో జగన్ మార్కు సుస్పష్టమయ్యింది. ఒక్కసారి యావత్ రాజకీయాలలోనే ఉలికిపాటును తెచ్చింది. అసలేం జరుగుతోందనే ప్రశ్న ఒకటి వైకాపా, టీడీపీతో బాటు పలుపార్టీల్లో జవాబు దొరక్కుండా మిగిలిపోయింది.
జగన్ ఏమనుకుంటే అదేచేస్తాడు. మంత్రివర్గం ఏర్పాటులోనే తేలిపోయిందని ఆపార్టీలో యావన్మంది ఎవరికివారే అనుకున్నారు. పదవి రానందున పలువురు సీనియర్లు వైకాపాపై లోగడ గెలిచి బాబుతో పడరానిపాట్లు పడ్డాం. జగన్ ఎంతపడ్డారో ఆలెక్కన మేము నరకం అనుభవించాం. జగన్ అధికారంలోకి వచ్చాక పట్టించుకోకుండా కులాలు వర్గాలు ప్రాతిపదికపై ఎవరెవరికో పదవులు కట్టబెట్టడం ఏమిటి అని బయటపడని బాధలో పలువురు ఎంఎల్ఏలు మునిగితేలారు. అయితే, ఏఒక్కరు బయటపడలేదు. సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వెలువడ్డాయి. పలువురు వైకాపా ఎంఎల్ఏలు జనాల మద్యకుపోకుండా ముఖాలు చాటేసారనే కథనాలు వెలువడ్డాయి. జగన్‌మార్కు పాలన అసెంబ్లీ తొలి సమావేశాల నాటికే తేటతెల్లమయ్యింది. పాదయాత్రలో పలుహామీల అమలుకు శ్రీకారంచుడుతూ జగన్ సర్కారు ఉత్సాహం చూపడం టీడీపీ సభ్యులకు కొరుకుడు పడడంలేదు.
ఇదెక్కడి పాలకుడు జగన్? ఇంకా ఐదేళ్లున్నాయి. తాపీగా ఇచ్చిన హామీలు ఏవో కొన్నింటిని చేస్తే సరిపోతుంది. ఇలా తొలిరోజునుంచి ఇచ్చిన హామీల అమలుపై పడుతున్న తీరు జనరంజకం అయిపోతుంది. అప్పుడు మనపరిస్థితి ప్రజల్లో ఏవిధంగా ఉంటుంది? అని అక్రమ కట్టడమైన బాబు ఇంట్లో ఆయన గ్యాంగ్ కిందామీదా పడ్డారు. రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల చట్రంలో ఇరికించి మనం దిగిపోతూ అప్పగించాం. అందులోంచి జగన్ సర్కారు తేరుకుంటే కదా.పైగా, తొందరపాటులో అనేకమైన హామీలు అమలు, జీతాలు పెంపు వంటివి జట్స్పీడుతో జగన్ చేయడం సర్కారు అభాసే అవుతుందని బాబు ముందు మెరమెచ్చుగా చెప్పారు. బాబుకు అసలు విషయం తెలుసు. నేను తినను. నావాళ్లను తిననీయనని గద్దెక్కిన పాలకుడు ఇచ్చిన హామీలు చేయగలడు. పలుశాఖల్లో జీతాలు పెంచేసి మరీ ఇవ్వగలడు. ఆర్థికంగా ఏ ఇబ్బంది ఎదురుకాదు.
ఇలా బయటికి చెబితే ఉన్న 22మందిలో మూడొంతులు మంది తేజ్ ఛల్, ఏక్దోఏక్ అని డ్రిల్లు చేసుకుంటూ రారమ్మంటున్న బీజేపీ గుడారంలోకి వెళ్లిపోతారు. ఘోరంగా ఓటమి పొందిన తను, పార్టీలో ఎవరేమి చెప్పినా వినాల్సిందే. అందుకే తలాతోకలేని సలహాలకు కూడా సై అనాల్సివచ్చిందేనని లోలోపల అనుకుంటూ బాబు తలూపేసారు. బాబు ఒక్కరికే జగన్ ఆంతర్యం ఏమిటీ అనేది పచ్చమీడియా కలంవీరుల వలన తలకెక్కింది. ఇంతకీ జగన్‌లో టీడీపీపై ఉన్న ఆంతర్యం ఏమిటి? బాబుపై ఎలాంటి ఆలోచనలున్నాయి అంటే చంద్రబాబూ 630హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి 2014లో గెలిచావు. ఐదేళ్లుపాటు ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చకపోతివి. ఏవర్గమైన గుర్తుచేస్తే తోకలు కత్తిరిస్తానన్నావు. నేను నా మేనిఫెస్టోలో ఉన్న 67హామీలు ఏ ఒక్కటి మిస్‌కాకుండా ఇలా అమలు చేస్తున్నాను.
అసెంబ్లీలో ప్రతిపక్షంలో బిక్కుబిక్కుమంటూ చేష్టలుడిగినా పాలనను కళ్లారచూస్తూ ఉండు. సర్కారు పగ్గాలు అందుకున్న తొలిరోజు నుంచే నా పాదయాత్ర హామీలను అమలుచేసే విధంగా నాకదలికలున్నాయి అని జగన్ తన పాలనను బాబు కళ్లముందే చేసి చూపుతున్నారు. జగన్ ఆంతర్యం తెలుసుకున్న వారిలో పచ్చమీడియా ఇచ్చిన లీకులతో బాబుకు ఆపైన పలువురు టీడీపీ సీనియర్లకు తెలుసు. రాజకీయముదుర్లకు తెలుసు. జగన్ అంతర్యం నిక్షిప్తమైన రాజకీయబాండాగారం. కనుకనే ప్రజల్లో తన రాజకీయాన్ని రంగరించి మున్నెన్నడూ ఏపార్టీకి రానటువంటి ఓట్ల శాతంతో నేడు ఏపీ సర్కారు పగ్గాలు చేపట్టారు. కుర్రాడిపరుగులు తాను తీస్తూ తన గుప్పిట్లో ఇమిడిపోయిన సర్కారుతో దుందుడుకు పరుగులు తీయించే సాహసం చేయలేదు. 2014లో రాజకీయ మహాఅనుభవశాలి చంద్రబాబు కలక్టర్లకు మావాళ్లు (టీడీపీ పెద్దాచిన్నా నేతలు) పనులు చక్కబెట్టండని చెప్పడం బాబుకేచెల్లు.
అధికారం చేపట్టిన జగన్ ఈసరికే కలెక్టర్లతో దఫదఫాలు చర్చిస్తునే ఉన్నారు. అందులో మొదటిది అవినీతిరహిత పాలన జిల్లాల్లో జరగాలి. ఎక్కడా మావాళ్ల పనులు చేయండని చెప్పడంలేదు. జగన్ రాజకీయానుభవం ఏపాటిదని ఎద్దేవా చేసే చంద్రన్నకు తాను వెలగబెట్టింది ఏమిటో ప్రత్యక్షంగా చూపిస్తున్న జగన్ పాలన ఒకింత గుబులు పుట్టిస్తోంది. ఘోరంగా ఓడిన టీడీపీని కూర్చోబెట్టి అన్నిశాఖల మంత్రులు గతసర్కారు అవినీతిని దుయ్యబడుతుంటే బిక్కవోయి వినాల్సివస్తోంది. కాదని వాదిస్తే చేసిన అవినీతిని ఆధారాలతో సహా పూర్తిస్థాయిలో మంత్రులు ఎమ్ఎల్ఏలు అసెంబ్లీలో ఎండగడుతున్నారు. బాబు ఇప్పుడు ఏమిచెప్పి జనాల్లోకి వెళ్లగలను అనే భీతి ఒకటి మనస్సులో తిష్టవేసింది.
ఇచ్చిన హామీల అమలు పరంపరలో జగన్ సర్కారు ఉంది. ఇచ్చిన హామీలన్నింటిని తుంగలోకి తొక్కిన తను జగన్ సర్కారుపై జనాల్లోకి పోయి ఏమిచెప్పినా జనాలు నమ్మరు అనేభయం ఒకటి బాబుకు పట్టుకుంది. చచ్చుపడ్డ పార్టీ నేతగా బాబు సభలోనే కాదు జనాల్లో కూడా చులకనయ్యారు.
-యర్నాగుల సుధాకరరావు