మరో మూడేళ్ళలోనే సార్వత్రిక ఎన్నికలు
రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం
కేంద్రం సహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నట్టు గోదావరి జిల్లాల్లో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. మరో మూడేళ్ళలోనే సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు ఆయావర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదేకనుక జరిగితే రాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడటం తథ్యమని ఆయా పార్టీల నేతలూ వ్యాఖ్యానిస్తున్నారు. జమిలి ఎన్నికలకు బీజేపీ ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. నరేంద్రమోదీ మార్క్ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు జరుగుతున్నట్టు భోగట్టా!
మరో మూడేళ్ళలో దేశంలోని అన్ని రాష్ట్రాలూ, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయావర్గాల ప్రజలు ప్రత్యేకించి చర్చించుకుంటున్నాయి. ఇదేకనుక జరిగితే 2022లో జమిలి ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలూ సిద్ధంకావల్సి ఉంటుంది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో వైకాపాకు జనం బ్రహ్మరథం పట్టగా కేంద్రంలో బీజేపీకి తిరుగులేని విజయం అందించారు.
రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పడింది. ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం బాలారిష్టాల దశలో ఉంది. ఐదేళ్ళపాటు జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని ఏలేందుకు తిరుగులేని మెజారిటీతో జనం వైకాపాకు గద్దెనెక్కించారు. రానున్న ఐదేళ్ళలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కార్యాచరణ ప్రణాళికలు అమలుచేసేలా సిద్ధం చేసుకున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాటి నుండి జగన్ పాలనపై తనదైన శైలి ముద్రవేస్తూ వస్తున్నారు. 25 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి రెండున్నరేళ్ళ కాలపరిమితికి పరిమితం చేశారు.
ఎలక్షన్ టీం పేరుతో చివరి రెండున్నరేళ్ళూ కాలపరిమితికి పరిమితం చేశారు. ప్రస్తుత మంత్రుల స్థానే వేరేవారికి మంత్రులుగా అవకాశం కల్పిస్తామని ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు చివరి రెండున్నర సంవత్సరాలూ మంత్రి పదవులను అందిపుచ్చుకోవాలన్న ఆశతో ఉన్నారు. ముఖ్యమంత్రి మెప్పుపొందేందుకు తహతహలాడుతున్నారు. ఎమ్మెల్యేలుగా మంచి మార్కులు తెచ్చుకుని మంత్రి పదవులు కొట్టేయాలన్న కసితో ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు.
ఒకవేళ జమిలి ఎన్నికలు వచ్చిపడితే మాత్రం ఈ మంత్రి పదవులపై ఆశలు వదులుకోవల్సిందేనా? అని పలువురు ఆశావహులు ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. మూడేళ్ళలో ఎన్నికలు తప్పనిసరైతే మరో రెండున్నర సంవత్సరాల్లోనే ఎన్నికల నగరా మోగే అవకాశాలుంటాయని అంచనా వేసుకుంటున్నారు. ఇక వైకాపా ప్రభుత్వం రానున్న ఐదేళ్ళలో వివిధ ప్రాజెక్ట్‌లను నూరుశాతం పూర్తి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. 2022 నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేస్తామని, పెండింగ్‌లో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్ట్‌లనూ ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెబుతోంది.
అలాగే రానున్న ఐదేళ్ళలో శాశ్వత రాజధాని నిర్మాణం నుండి నవరత్నాల అమలు వరకూ లక్ష్యాలను నిర్దేశించుకుంది. ఇదిలావుంటే 2019 ఎన్నికల్లో చావుతప్పి కన్నులొట్టబోయిన టీడీపీ, ఘోర పరాజయాన్ని చవిచూసిన జనసేన పార్టీలకు జమిలి ఎన్నికలు ఆశాదీపంకానున్నాయి. జమిలి ఎన్నికలంటూ జరిగితే ఈ రెండు రాజకీయ పార్టీలూ చావో రేవో తేల్చుకునేందుకు సిద్ధంకాక తప్పదు!
అలాగే ప్రభుత్వం అనుసరిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలపై మరింతగా పోరాడాల్సి ఉంటుంది. మరోవైపు జమిలి ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో బీజేపీ పొత్తుల కోసం వేసే ఎత్తులు ఏ విధంగా ఉంటాయన్న విషయమై జనంలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.