రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉంటేనే కొత్త పార్టీలకు మనుగడ. అయితే నిజాయితీగా పనిచేసినప్పుడే ఇది సాధ్యమవుతుంది. నిజంగా పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో నిజాయితీగా పనిచేసి ఉంటే జనసేనకు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు వచ్చి ఉండేవేమో. కేవలం జగన్ ని మాత్రమే టార్గెట్ చేస్తూ చంద్రబాబుతో లాలూచీపడి ఎన్నికలకు వెళ్లడంతో పవన్ బొక్కబోర్లా పడ్డారు. తాను పోటీచేసిన రెండుస్థానాల్లో ఒక్కటి కూడా గెలవలేక చతికిలపడ్డారు.
కానీ పవన్ అస్త్ర సన్యాసం చేయకుండా సినిమాల జోలికి వెళ్లకుండా రాజకీయాల్లోనే ఉండాలనే నిర్ణయం తీసుకోవడం మాత్రం మెచ్చుకోదగినది. నిర్ణయం మంచిదే కానీ, ఆచరణలో మాత్రం పవన్ దారుణంగా విఫలమవుతున్నారు. ఇప్పటికైనా పవన్ మారితే భవిష్యత్ లో బలమైన రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం ఉంది. ఇటు రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి రోజురోజుకీ తీసికట్టులా తయారవుతోంది. చంద్రబాబుకి వయసైపోతోంది, లోకేష్ కి పసితనం పోవడంలేదు. కొడుకు తప్ప మరొకరి చేతిలో టీడీపీ పగ్గాలు పెట్టే ఆలోచన బాబుకు లేదు.
ఇలాంటి టైమ్ లో వైసీపీకి గట్టిపోటీ ఇవ్వాలంటే అది టీడీపీ కాకుండా మరో పార్టీ అయి ఉండాలి. అందుకే బీజేపీ మిగులు జనాలందర్నీ సేకరిస్తూ 2024 ఎన్నికలను టార్గెట్ చేస్తోంది. కానీ ఏపీలో కమలం వికసించడం కల్ల. రాష్ట్రంలో లీడర్లు ఎక్కువ, ఓటర్లు తక్కువ ఉన్న పార్టీ అది. బీజేపీ గతంలో ఒంటరిగా సీట్లు గెలవలేదు, భవిష్యత్ లో గెలిచే ఛాన్స్ లేదు. పైగా ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీగా బీజేపీని ఏపీ ప్రజలు అస్సలు నమ్మరు. బరిలో దిగితే డిపాజిట్లు లేకుండా చేస్తారనేది పచ్చి నిజం.
మరి ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయం ఎవరు? జాగ్రత్తగా పనిచేసుకుంటూ వెళ్తే జనసేన పార్టీ 2024కల్లా రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదిగే అవకాశం ఉంది. అయితే పవన్ మాత్రం ఇంకా తప్పటడుగులు వేస్తున్నారనే అనుకోవాలి. తన పార్టీ పరువు నిలిపి, అసెంబ్లీలో జనసేన పేరు వినిపించేలా చేసిన ఏకైక ఎమ్మెల్యేని కూడా పట్టించుకోని విధంగా పవన్ రాజకీయాలున్నాయి. కొత్తగా కమిటీలు ప్రకటించినా వాటిలో ఏమాత్రం కొత్తదనం లేదు. జనబలం లేని మేథావులు ఎంతమంది పార్టీలో ఉన్నా వేస్ట్. కనీసం ఈ విషయంలో కూడా పవన్ లో మార్పురాలేదు, ఓటమి నుంచి పవన్ నేర్చుకున్న పాఠం ఏదీలేదని అర్థమవుతోంది.
అవకాశం ఉండి కూడా పవన్ కల్యాణ్ చేష్టలుడిగి చూస్తున్నారు. వర్కవుట్ కాని ప్లాన్స్ తో ముందుకెళ్తున్నారు. రాజకీయ శూన్యతను తనకి అనుకూలంగా మలుచుకునే క్రమంలో మరోసారి పవన్ విఫలమవుతున్నారని చెప్పుకోవాలి. సోకాల్డ్ మేథావులందర్నీ పక్కనపెట్టి, జనబలం ఉన్న నాయకులతో రాజకీయం చేస్తూ తన ఒంటెత్తు పోకడలను సైతం తగ్గించుకుంటే జనసేనకు భవిష్యత్ ఉంటుంది. ఇప్పటి నుంచే పార్టీ పునర్నిర్మాణం జరిగితే 2024లో వైసీపీకి గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. పార్టీలో ఉన్న సోకాల్డ్ మేధావులు, ఈ విషయాన్ని పవన్ కు చెప్పారో లేదో!