ఎవరికి వారు ..తగ్గేదే లే..అంటుండడంతో మా ఎన్నికల బరిలో ముక్కోణపు పోటీ తప్పేలా కనిపించడం లేదు. అందరికన్నా ముందుగా ఎన్నికల కూత కూసిన ప్రకాష్ రాజ్, అలాగే ఆ తరువాత స్పందించిన నటి జీవిత ఇద్దరూ పక్కాగా బరిలో వుంటారని తెలుస్తోంది.
మా అసోసియేషన్ భవనం తానే నిర్మించి ఇస్తానన్న హీరో మంచు విష్ణు కూడా బరిలో వుండబోతున్నారు. దీంతో మా ఎన్నికల బరిలో ఇప్పటి వరకు ముగ్గురు అభ్యర్థులు చైర్మన్ పదవికి పోటీ పడడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇప్పటికే ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఈ విషయంలో ప్రకాష్ రాజ్ కాస్త ముందు వున్నారు. ఆయన ప్యానల్ ను పక్కాగా ప్రకటించేసారు. అందువల్ల అందులో వున్నవారు ఓట్ల వేట సాగించడం ప్రారంభమై పోయింది.
ప్రకాష్ రాజ్ ఇప్పటికే ఓ దఫా భోజనాల కార్యక్రమం పూర్తి చేసారు. మందు పార్టీలు కూడా బాగానే అయ్యాయని టాక్ అయితే వుంది. మంచు విష్ణు వర్గం కూడా భోజనాల కార్యక్రమం ఓ ధఫా పూర్తి చేసింది. జీవిత ఇంకా ఇలాంటి వ్యవహారాలకు తెరతీయలేదు.
గత కొంత కాలంగా ఆమెకు అంటూ కొంత మంది బాసటగా వున్నారు. వారి ఓట్లు మాత్రం ఆమెకే ఫిక్స్ అని నమ్మకంగా వున్నారు. సాధారణ ఎన్నికల్లో మాదిరిగా మా ఎన్నికల్లో కూడా ఓట్లు వేసేది చిన్న చితక ఆర్టిస్ట్ లే. కాస్త పేరున్నవారు చాలా మంది ఓటింగ్ కు దూరంగా వుంటారు.
టాప్ హీరోలు, బిజీ ఆర్టిస్ట్ లు మా వ్యవహారాలూ పట్టించుకోరు. ఓటింగ్ నూ పట్టించుకోరు. కానీ ఈసారి పోటీ చూస్తుంటే వాళ్లను కూడా పోలింగ్ దగ్గరకు లాక్కు వస్తారేమో చూడాలి.