వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అంటే విపక్షాలు ఒంటి కాలు మీద లేస్తూంటాయి. ఇక టీడీపీ అయితే చెప్పాల్సిన పనే లేదు. దానికి తగినట్లుగా విజయసాయిరెడ్డి కూడా ట్వీట్లతో అదరగొడుతూంటారు.
ఇవన్నీ ఇలా ఉంటే వైసీపీతో బద్ధ వైరి పక్షంగా వ్యవహరించే సీపీఐ నుంచి విజయసాయిరెడ్డికి ప్రశంస దక్కడం అంటే మామూలు విషయం కాదు.
స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ వద్దు అంటూ పార్లమెంట్ లో విజయసాయిరెడ్డి నిజాయతీగా పోరాడుతున్నారని అంటున్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఇదే విధంగా ఆయన తన పోరుని సాగించాలని, పార్లమెంట్ లో అన్ని పార్టీలను కలుపుకుని ముందుకు సాగాలని నారాయణ సూచించారు.
ఇప్పటికే విశాఖలో సీపీఎం, వైసీపీ స్టీల్ ప్లాంట్ కి వ్యతిరేకంగా కలసి ఉద్యమిస్తున్నాయి. ఇపుడు సీపీఐ కూడా తోడు కావడంతో ఈ మూడు పార్టీల ఉమ్మడి పోరు గట్టిగానే ఉండే అవకాశం ఉంది.
ఏ పార్టీకి ఆ పార్టీ కాకుండా కలసికట్టుగా పోరాడితేనే కేంద్రం దిగి వస్తుందని ఉక్కు కార్మికులు అంటున్నారు. అందువల్ల మిగిలిన పార్టీలు బీజేపీతో సహా రావాలని వారు కోరుతున్నారు.