‘మా’ (మూవీ ఆర్టిస్టు అసోసియేషన్) అధ్యక్ష బరిలో ఉంటానని ప్రకటించిన నటి హేమ ఒంటరయ్యారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేశ్ నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని హేమ ఆరోపించడం టాలీవుడ్లో తీవ్ర దుమారం రేపుతోంది. హేమ ఆరోపణలపై నరేశ్‌తో పాటు ‘మా’ జనరల్ సెక్రటరీ జీవితా రాజశేఖర్ తీవ్రంగా తప్పు పట్టిన సంగతి తెలిసిందే.
హేమపై నరేశ్ క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేశారు. ‘మా’ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని మెగాస్టార్ చిరంజీవి ‘మా’ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు లేఖ రాశారు. సమస్యను కృష్ణంరాజు త్వరగా పరిష్క రిస్తారని ఆశిస్తున్నట్లు చిరంజీవి ఆ లేఖలో అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ సంఘం చిరంజీవి ఆశించినట్టుగానే సీరియస్‌గా స్పందించింది. హేమకు తాజాగా షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.
హేమకు షోకాజ్ నోటీసు జారీపై ‘మా’ సభ్యులెవరూ నోరు మెదపడం లేదు. చిరంజీవి జోక్యంతో వ్యవహారం సీరియస్‌గా మారిందనే సంకేతాలు వెళ్లడంతో…. మనకెందుకు వచ్చిన గొడవలన్నట్టు టాలీవుడ్లో హేమ ఎపిసోడ్‌ను సినిమా చూసినట్టు చూస్తూ ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
‘మా’ ఉపాధ్యక్షురాలిగా ఉన్న హేమకు ఏ ఒక్కరి నుంచి మద్దతు లభించకపోవడం గమనార్హం. హేమ ఆరోపణలతో కొందరు ఏకీభవిస్తున్నప్పటికీ, అలాగని ఆమెకు బహిరంగంగా మద్దతు ఇచ్చేందుకు ఇప్పటి వరకూ ఎవరూ ముందుకు రాలేదు. మున్ముందు ఎవరైనా హేమకు మద్దతుగా నిలుస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.