ఒక్కో హీరో నుంచి ఒక్కో సినిమా ఊహిస్తాడు ప్రేక్షకుడు. ఫలానా హీరో నుంచి ఓ సినిమా వస్తుందంటే, అది ఎలా ఉంటుందనే విషయంపై ఓ ఐడియాతో ఉంటాడు. అలాంటి హీరో నుంచి ఊహించని సినిమా వస్తే కచ్చితంగా షాక్ కు గురవుతాడు. ఇది అలాంటి సినిమానే.
విజయ్ ఆంటోనీ ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ చేస్తున్నాడు. మీరు చదివింది నిజమే. సీరియస్ లుక్స్ తో, సీరియస్ సబ్జెక్టులు చేసే విజయ్ ఆంటోనీ, ఈసారి రూటు మార్చాడు. కెరీర్ లో తొలిసారి ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ చేస్తున్నాడు.
ఈ సినిమాలో పూర్తిస్థాయిలో లవర్ బాయ్ గా కనిపిస్తాడట విజయ్ ఆంటోనీ. అతడి ప్రేయసిగా మృణాళిని రవి నటిస్తోంది. హీరోహీరోయిన్ల మధ్య వచ్చే ఓ రొమాంటిక్ సందర్భం నుంచి స్టిల్ కూడా రిలీజ్ చేశారు. కాకపోతే ఆ స్టిల్ లో కూడా హీరో విజయ్ ఆంటోనీ రొమాంటిక్ గా కాకుండా, ఎప్పట్లానే సీరియస్ గా కనిపించడం విశేషం.
మరో విశేషం ఏంటంటే, ఈ సినిమా కోసం ఓ కొత్త బ్యానర్ స్థాపించాడు విజయ్ ఆంటోనీ. గుడ్ డెవిల్ అనే బ్యానర్ పెట్టి, రోమియో పేరిట సినిమా తెరకెక్కిస్తున్నాడు. తెలుగులో ఈ సినిమాను లవ్ గురు పేరిట విడుదల చేయబోతున్నారు. వచ్చే ఏడాది వేసవిలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
విజయ్ ఆంటోనీ పేరు చెబితే బిచ్చగాడు, సలీమ్, విజయ రాఘవన్, భేతాళుడు, యమన్ లాంటి సీరియస్ సినిమాలు గుర్తొస్తాయి. ఇలాంటి హీరో నుంచి ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ వస్తుందంటే, ఆశ్చర్యం కలిగించే విషయమే. కొత్త జానర్, కొత్త గెటప్ తో విజయ్ ఆంటోనీ ఎలా మెప్పిస్తాడో చూడాలి.