అనీల్ సుంకర ఈసారి నేరుగా స్పందించారు. చిరంజీవితో విబేధాలంటూ వస్తున్న వార్తల్ని పూర్తిగా ఖండించారు. ఎప్పట్లానే తామిద్దరం బాగానే ఉన్నామని, దయచేసి ఫేక్ న్యూస్ నమ్మొద్దంటూ విజ్ఞప్తి చేశారు.
“పుకార్లతో కొంతమంది పైశాచిన ఆనందం పొందవచ్చు. కానీ ఏళ్లుగా కష్టపడి నిర్మించుకున్న ఇమేజ్ ను దెబ్బతీసేలా వ్యవహరించడం క్షమించరాని నేరం. అందులో భాగంగా ఉన్న అన్ని కుటుంబాలకు అది ఎనలేని ఒత్తిడిని, ఆందోళనను కలిగిస్తుంది. నాకు, చిరంజీవి గారికి మధ్య గొడవలు ఉన్నాయనే న్యూస్ పూర్తిగా అవాస్తవమైనది. చిరంజీవి మద్దతు నాకు పూర్తిగా ఉంది. ఎప్పట్లానే నేను, చిరంజీవి బాగానే ఉన్నాం. దయచేసి వాస్తవాలను కప్పిపుచ్చేలా అవాస్తవాల్ని ప్రచారం చేయొద్దు. తప్పుడు వార్తలు సృష్టించడం కొంతమందికి రొటీన్ వ్యవహారం కావొచ్చు. కానీ ఆ ఫేక్ న్యూస్ లో ఉన్న ప్రతి ఒక్కరికి అది చిక్కులు తెచ్చిపెడుతుంది.”
ఇలా సుదీర్ఘంగా తనపై వచ్చిన ఆరోపణలు, అవాస్తవాల్ని ఖండించారు సుంకర. తన పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన పరిశ్రమలోని శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు తెలిపిన ఈ నిర్మాత… అలాంటి వాళ్లందరి ఆశీర్వాదంతో మరింత బలంగా బౌన్స్ బ్యాక్ అవుతానన్నారు.
చిరంజీవి హీరోగా భోళాశంకర్ సినిమాను నిర్మించారు అనీల్ సుంకర. ఆ సినిమా డిజాస్టర్ అయిన తర్వాత అతడిపై, సినిమాపై, చిరంజీవితో అతడికున్న అనుబంధంపై చాలా గాసిప్స్ వచ్చాయి. వాటన్నింటిపై కొద్దిసేపటి కిందట సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు.
తనపై, తన సినిమాలపై ఎప్పుడు ఏ విధమైన వార్తలు/ప్రచారాలు జరిగినా వెంటనే ఖండించడం అనీల్ సుంకరకు అలవాటు. మొన్నటికిమొన్న ఏజెంట్ సినిమా డిజాస్టర్ అయినప్పుడు కూడా ఈ నిర్మాత వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు భోళాశంకర్ విషయంలో కూడా చిరంజీవితో తనకున్న అనుబంధంపై వచ్చిన పుకార్లపై అంతే వేగంగా స్పందించారు.