కొన్ని రోజుల కిందటి సంగతి. పవన్ హీరోగా బ్రో సినిమా వచ్చింది. ఫ్లాప్ అయింది. దీంతో జైలర్, భోళాశంకర్ సినిమాలు వచ్చేంతవరకు 'బ్రో'ను భరించారు. భోళా రాకతో బ్రో కథ ముగిసింది. కట్ చేస్తే, భోళాశంకర్ డిజాస్టర్ అయింది. ఇప్పుడీ సినిమాను కూడా ఎత్తేయడానికి చాలామంది ఎగ్జిబిటర్లు సిద్ధంగా ఉన్నారు.
ఈ వీకెండ్ కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అన్నీ చిన్న సినిమాలే అయినప్పటికీ భోళాశంకర్ రిజల్ట్ వల్ల చాలా స్క్రీన్స్ ఖాళీ అవుతున్నాయి. ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని అందుబాటులో ఉన్నాయి.
నైజాం రీజియన్ నే తీసుకుంటే, ప్రస్తుతం జైలర్ సినిమా అత్యథిక స్క్రీన్స్ తో కొనసాగుతోంది. బ్లాక్ బస్టర్ హిట్టయిన ఈ మూవీకి, భోళాశంకర్ స్క్రీన్స్ కూడా కొన్ని కేటాయించారు. ఇక మిగిలిన స్క్రీన్స్ లో రేపట్నుంచి కొత్త సినిమాల్ని ప్రదర్శించబోతున్నారు.
సోహైల్ హీరోగా నటించిన మిస్టర్ ప్రెగ్నెంట్, సంతోష్ శోభన్ హీరోగా నటించిన ప్రేమ్ కుమార్ సినిమాలు రేపు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా లిమిటెడ్ గా రిలీజ్ అవుతోంది. ప్రేమ్ కుమార్ మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో రిలీజ్ అవుతోంది. అయితే వీటి కంటే ఎక్కువగా థియేటర్లు దక్కించుకున్న సినిమా ఇంకోటి ఉంది.
ప్రభాస్ హీరోగా నటించిన యోగి సినిమాను రేపు రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీగా థియేటర్లు దక్కాయి. నిజానికి ఇది ఫ్లాప్ మూవీ. రీ-రిలీజ్ లో మాత్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మంచి వసూళ్లు సాధించేలా ఉంది ఈ సినిమా.
ఈ సినిమాలతో పాటు.. జిలేబీ, పిజ్జా3, భూతాల బంగ్లా, మదిలో మది లాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటన్నింటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో స్క్రీన్స్ దక్కాయి. రేపట్నుంచి భోళాశంకర్ సినిమా చాలా తక్కువ స్క్రీన్స్ కు పరిమితం కాబోతోంది. నిన్న ఈ సినిమాకు మరింత దారుణంగా వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది.