వార్ వన్ సైడే కావొచ్చు, ప్రతిపక్షం పాత్ర నామమాత్రమే అవ్వొచ్చు, కానీ అతి విశ్వాసం ఎన్నటికీ పనికిరాదు. ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే ఆత్మ విశ్వాసం ఏదో, అతి విశ్వాసం ఏదో క్లియర్ గా తేడా తెలుసుకోవాలి. ఇప్పటి వరకూ అధికార పార్టీ ఏది చేసినా రైటో రైటంటూ వంత పాడిన సాక్షి ఇప్పుడు పంథా మార్చాల్సిన టైమొచ్చింది.
సునిశిత విమర్శలు చేయాలి, వెనకేసుకు రావడం ఆపేసి, అసలు ఏం జరిగిందో కూడా ఆలోచించి చెప్పాలి. ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నాయకుల్ని అలర్ట్ చేయాల్సిన బాధ్యత అధికార పార్టీకి చెందిన మీడియాపైనే ఉంది. కేవలం పొగడ్తలే తమ బాధ్యత అని అసలు విషయం మరిస్తే.. మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది.
మీడియా పాత్ర ఎంతంటే..?
ఒకప్పుడు మీడియాది కేవలం సపోర్టింగ్ రోల్ మాత్రమే, ఇప్పుడు మెయిన్ రోల్ కూడా మాదేనంటూ మెయిన్ స్ట్రీమ్ మీడియా రంగంలోకి దిగింది, మేమేమీ తక్కువ కాదంటూ సోషల్ మీడియా కూడా హడావిడి చేస్తోంది. ఏది వాపో, ఏది బలుపో అర్థం చేసుకోవాలంటే న్యూట్రల్ మీడియాని నమ్ముకోవాలి, న్యూట్రల్ సర్వేలను ఆశ్రయించాలి.
కానీ పార్టీ పరంగా పనిచేసే మీడియా అయినవారిని అందలమెక్కించాలనుకునే క్రమంలో కాస్త ఎక్కువగానే ఊహిస్తుంటుంది. తిమ్మిని బమ్మిని చేయడానికి ప్రయత్నిస్తుంటుంది. కానీ అప్పుడప్పుడు చురకలంటించడం మాత్రం దాని ప్రధాన విధి. అది మరిచిపోతే పార్టీ మనుగడతో పాటు, తన మనుగడ కూడా ప్రశ్నార్థకం అనే విషయం మీడియా అర్థం చేసుకోవాలి.
టీడీపీ చేసిన తప్పు వైసీపీ చేయకూడదు..
2014లో 102 స్థానాల్లో సొంతంగా గెలిచిన టీడీపీ.. 2019 నాటికి 23 స్థానాలకు ఎందుకు పడిపోయింది. ఇప్పుడు కేవలం 19మంది ఎమ్మెల్యేలతో ఎందుకు కునారిల్లుతోంది. 2019 ఎన్నికలకు ముందు అనుకూల మీడియా చేసిన అతి వల్లే టీడీపీ గతి తప్పింది.
బాబుగారినే జనం మళ్లీ కోరుకుంటున్నారనే తప్పుడు ప్రచారంతో చంద్రబాబు ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఎన్నికలకు వెళ్లారు. బొక్కబోర్లా పడ్డారు. ప్రస్తుతం వైసీపీకి అలాంటి పరిస్థితి ఉందనుకోలేం. అంత మాత్రాన జనంలో వ్యతిరేకత అస్సలు లేదనుకోలేం.
అసలు వ్యతిరేకత ఎక్కడ ఉంది, ఏ వర్గంలో ఉంది, దాన్ని అధిగమించాలంటే ఏం చేయాలనేది గమనించాలి. అంతే కాని అంతా బాగానే ఉంది, ఈసారి 175 సీట్లు గ్యారెంటీ, ఆల్ ఈజ్ వెల్ అనుకుని బరిలో దిగితే మాత్రం ఎంతో కొంత ఆశాభంగం కలగక మానదు. అందుకే ఇక నుంచి సాక్షి మీడియా పద్ధతి మారాలి.
అధికార పార్టీకి చురుకు పుట్టించే కథనాలు రాయాలి, ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత దగ్గర చేయాలి. భజన తగ్గించి వాస్తవ పరిస్థితుల్ని చెప్పాలి. కనీసం ఈ రెండేళ్లయినా ఆ పని చేయాలి. అప్పుడే పార్టీకైనా, ఆ మీడియాకైనా మంచిది.