బంగారం లాంటి అవకాశం.. వదులుకోకు పవన్!

వెండితెరపై బంగారం అనే సినిమా చేశారు పవన్ కల్యాణ్. అందరితోనూ మా పవన్ బంగారం అనిపించుకున్నారు. రాజకీయాల్లో మాత్రం అది ఆయన వల్ల కాలేదు. అయితే ఇన్నాళ్లకు పవన్ కు అలాంటి బంగారం లాంటి…

వెండితెరపై బంగారం అనే సినిమా చేశారు పవన్ కల్యాణ్. అందరితోనూ మా పవన్ బంగారం అనిపించుకున్నారు. రాజకీయాల్లో మాత్రం అది ఆయన వల్ల కాలేదు. అయితే ఇన్నాళ్లకు పవన్ కు అలాంటి బంగారం లాంటి ఛాన్స్ వచ్చింది. విశాఖ ప్రజలతో బంగారం అనిపించుకునే అవకాశం వచ్చింది. కానీ పవన్ మాత్రం ఇంకా డైలమాలోనే ఉన్నారు. 

బంగారం లాంటి అవకాశాన్ని చేజేతులా వదిలేస్తారేమో అనే భయంలో జనసైనికులున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పవన్ క్షేత్రస్థాయిలోకి దిగి ఉద్యమం చేస్తే బాగుంటుందనేది జనసైనికుల ఫీలింగ్. 

నిజానికి ప్రైవేటీకరణను పవన్ వ్యతిరేకించారు. కానీ నామ్ కే వాస్తే ఆ కార్యక్రమం జరిగింది. అలా కాకుండా పూర్తిస్థాయిలో రంగంలోకి దిగితే విశాఖ ప్రజల పాలిట పవన్ బంగారం అయిపోతారు. ఏ గాజువాక ప్రజలు పవన్ ను చిత్తు చిత్తుగా ఓడించారో.. ఆ ప్రాంత వాసులకు ఆయన దేవుడైపోతారు. పరిపాలనా రాజధాని ప్రాంతంలో పవన్ కి సరైన పరపతి పెరుగుతుంది.

పార్టీకి, పవన్ కి.. ఇద్దరికీ మేలు..

విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అనేది గత నినాదం. ఇప్పుడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ పోరాటం చేయలేదు. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ.. బీజేపీతో లాలూచీ కోసం ఆ ప్రతిపాదన విరమించుకుంది. 

ఇక వైసీపీ అసెంబ్లీలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి పంపించినా అంతకంటే ధైర్యం చేయలేకపోయింది. వామపక్షాల పోరాటాల్ని ఎవరూ లెక్కచేసే పరిస్థితుల్లో లేరు. ఈ దశలో పవన్ కల్యాణ్ కాస్త ధైర్యం చేస్తే విశాఖ ఉక్కు పోరాటంలో కీలక వ్యక్తిగా మారతారు. అయితే అదే సమయంలో ఆయన బీజేపీతో తెగతెంపులు చేసుకోవాల్సి ఉంటుంది.

బీజేపీకి వదిలించుకోవడానికి ఇదే ఉత్తమ మార్గం

బీజేపీని వదిలించుకోవడానికి మంచి సాకు కోసం చూస్తున్న పవన్ కు ఇంతకుమించిన బంగారం లాంటి అవకాశం ఉండదు. తాజాగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ తన స్టాండ్ ఏంటో క్లియర్ గా చెప్పేసింది కాబట్టి.. పవన్ కూడా తెగతెంపులు చేసుకొని రంగంలోకి దిగితే అన్ని విధాలుగా పార్టీకి, తనకు అనుకూలం. 

కానీ పవన్ ఉన్నట్టుండి ఉద్యమంలోకి దిగితే సినిమా షూటింగ్ లు ఆపేసుకోవాల్సి ఉంటుంది. బీజేపీ విమర్శలు కాచుకోవాలి. ఇటు అధికార, ప్రతిపక్షాలకి కూడా సమదూరం పాటించి తన వ్యూహాలు అమలు చేయాలి.

ఇప్పుడుకాక ఇంకెప్పుడు పవన్..?

పాతికేళ్ల రాజకీయ ప్రస్థానానికి ఎప్పుడో ఒకప్పుడు, ఎక్కడో ఒక చోట బలమైన మలుపు అవసరం. ఆ మలుపు ఇదే ఎందుకు కాకూడదు. కానీ పవన్ మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. 

అదే సాగతీత, అదే నిర్లిప్తత, అదే కాలయాపవన. సైనికులు మాత్రం ఇదే మంచి టైమ్ అంటున్నారు. ఇప్పుడుకాక ఇంకెప్పుడు పవన్ అంటూ గట్టిగా అడుగుతున్నారు.