అపూర్వ‌నాట‌క శిల్పం క‌న్యాశుల్కం

గుర‌జాడ ర‌చించిన 'క‌న్యాశుల్కం' ఒక అపూర్వ నాట‌క శిల్పం. ఒక గొప్ప దృశ్య కావ్యం,  జీవ‌న  వ్యాఖ్యానం, జీవిత‌మంత గొప్ప‌ది. తెలుగులో ఇప్ప‌టి వ‌ర‌కు ఇంత గొప్ప నాట‌కం రాలేదు. ఆధునిక ప్ర‌పంచ నాట‌క…

గుర‌జాడ ర‌చించిన 'క‌న్యాశుల్కం' ఒక అపూర్వ నాట‌క శిల్పం. ఒక గొప్ప దృశ్య కావ్యం,  జీవ‌న  వ్యాఖ్యానం, జీవిత‌మంత గొప్ప‌ది. తెలుగులో ఇప్ప‌టి వ‌ర‌కు ఇంత గొప్ప నాట‌కం రాలేదు. ఆధునిక ప్ర‌పంచ నాట‌క చ‌రిత్ర‌లో చోటు సంపాదించుకున్న ఈ నాట‌కం గుర‌జాడ‌ను అత్యుత్త‌మ ప్ర‌పంచ నాట‌క క‌ర్త‌ల స‌ర‌స‌న కూర్చోబెట్టింది. నూట ముప్ఫై ఏళ్ళ క్రితం ప్ర‌ద‌ర్శించిన ఈ నాట‌కం, నాటి సాంఘిక‌, రాజ‌కీయ‌, ఆర్థిక ప‌రిస్థ‌తుల‌కు అద్దంపడుతోంది.

ఎన్టీరామారావు గిరీశంగా, సావిత్రి మ‌ధుర‌వాణిగా, గుమ్మ‌డి సౌజ‌న్యారావుగా ప్ర‌ధాన‌పాత్ర‌ల‌తో ద‌శాబ్దాల  క్రితం క‌న్యాశుల్కం సినిమా కూడా తీశారు. 'క‌న్యాశుల్కం' నాట‌కం లెక్క లేన‌న్ని పున‌ర్ముద్ర‌ణ‌లు జ‌రిగి, లెక్క‌లేన‌న్ని సార్లు ప్ర‌ద‌ర్శిత‌మైంది.

పున‌ర్ముద్ర‌ణతో మ‌ళ్ళీ ఇప్పుడు మ‌న ముందుకు వ‌చ్చింది. తిరుప‌తి ఎమ్మెల్యే క‌రుణాక‌ర్ రెడ్డి అధ్య‌క్షులుగా ఉన్న మాన‌వ వికాస వేదిక క‌న్యాశుల్కాన్ని తాజాగా అచ్చు వేసింది. విజ‌య‌న‌గ‌రంలోని గుర‌జాడ నివ‌సించిన గృహాన్ని సంద‌ర్శించే వారంద‌ర‌కీ 'క‌న్యాశుల్కం' ఉచితంగా ఇవ్వ‌డం కోసం, గుర‌జాడ ఇంటిని ప‌ర్య‌వేక్షిస్తున్న ఆయ‌న మునిమ‌న‌మ‌డు గుర‌జాడ వెంక‌టేశ్వ‌ర ప్ర‌సాద్ దంప‌తుల‌కు ఈనెల 29వ తేదీ గురువారం సాయంత్రం తిరుప‌తిలోని ఆఫీస‌ర్స్‌క్ట‌బ్లో జ‌రిగే స‌మావేశంలో ఈ ప్ర‌తుల‌ను అందివ్వ‌నున్నారు.

గురజాడ పూర్వీకులు కృష్ణాజిల్లా గుర‌జాడ‌కు చెందిన వారు. వారి తాత‌ల  కాలంలో విశాఖ జిల్లాకు వ‌ల‌స వ‌చ్చారు. య‌ల‌మంచిలి తాలూకా రాయ‌వ‌రం గ్రామంలో గుర‌జాడ అప్పారావు  1862 సెప్టెంబ‌ర్ 12న జ‌న్మించారు.

గిడుగు రామ్మూర్తి పంతులుతో క‌లిసి గుర‌జాడ విజ‌య‌న‌గ‌రంలో బి.ఏ., చ‌దువుకున్నారు. ఉపాధ్యాయుడిగా, అధ్యాప‌కుడిగా, గుమాస్తాగా, విజ‌య‌న‌గ‌రం సంస్థానంలో శాస‌న ప‌రిశోధ‌కుడిగా, రీవారాణికి కార్య‌ద‌ర్శిగా  ప‌ని చేశారు.

ఆరోజుల్లో తెలుగు నాట‌కం  క్షీణ‌ద‌శ‌లో ప్ర‌బంధ క‌విత్వానికి ప‌రిమిత‌మై ఉంది. సంస్కృత నాట‌కాలు రాజ్య‌మేలుతున్నాయి. ఇంగ్లీషు నాట‌క కంపెనీలు ఇంగ్లాండు నుంచి అస్ట్రేలియా పోతూ పోతూ భార‌త రేవుల్లో ప్ర‌ద‌ర్శ‌న‌లిచ్చేవి. తెలుగులో అనువాద నాట‌కాలే త‌ప్ప, సొంత‌ సాంఘిక నాట‌కాలు లేవు. విజ‌య‌న‌గ‌రం సంస్థానాదీశుడైన ఆనంద‌గ‌జ‌ప‌తి సాహిత్యాభిమాని, సంఘ‌సంస్క‌ర‌ణాభిలాషి. ఆయ‌న ప్ర‌త్యేకంగా నాట‌క స‌మాజాన్ని స్థాపించి నాట‌క ప్ర‌ద‌ర్శ‌న‌ను ప్రోత్స‌హించేవారు. ఆ రోజుల్లో తెలుగు నాట అక్ష‌రాస్య‌త చాలా త‌క్కువ‌గా ఉండేది.

అస‌లు క‌న్యాశుల్కం  ఏమిటి!?

ఇప్పుడు పెళ్ళికొడుకుల‌ కిచ్చే వ‌ర‌కట్నం లాగానే, అప్ప‌ట్లో అమ్మాయి త‌ల్లిదండ్రుల‌కు డ‌బ్బులిచ్చికొనుక్కునేవారు. ఈ 'క‌న్యాశుల్కం' ఆచారం ఉత్త‌రాంధ్ర‌లోని బ్రాహ్మ‌ణ కుటుంబాల‌లో ఎక్కువ‌గా ఉండేది.mబ్రాహ్మ‌ణేత‌ర కుటుంబాల‌లో కూడా ఉందేడి కాని, చాలా త‌క్కువ‌. కొన్నిజిల్లాల్లో క‌న్యాశుల్కాన్ని ఓలి అనే వారు. 'ఓలి త‌క్కువ‌ని గుడ్డిదాన్ని చేసుకుంటే ఇంట్లో కుండ‌ల‌న్నీ బ‌ద్ద‌లు కొట్టింది' అన్న‌నానుడి కొన్ని జిల్లాల్లో ఇప్ప‌టికీ వాడుక‌లో ఉంది.

అమ్మాయి త‌ల్లి దండ్రులు డ‌బ్బుకు ఆశ‌ప‌డి,  త‌మ కుమార్తెను తండ్రి వ‌య‌సో, తాత వ‌య‌సో ఉన్న వారికిచ్చి పెళ్ళి చేస్తే ,ఆ బాలిక యుక్త వ‌య‌సు వ‌చ్చేస‌రికి విధ‌వ రాల‌య్యేది. అలాంటి వారు శ‌రీర వాంఛ‌లు త‌ట్టుకోలేక వివాహేత‌ర సంబంధాలు పెట్టుకునేవారు. అప్ర‌తిష్ట‌ను భ‌రించ‌లేక గ‌ర్భ‌స్రావం చేయించుకునే వారు. అది విఫ‌ల‌మైతే ఆత్మహ‌త్య చేసుకునే వారు. ఈ ప‌రిస్థితులు శిశు హ‌త్య‌ల‌కు, శిశు మ‌ర‌ణాల‌కు దారితీసేవి. ఇవేవీ కాక‌పోతే ఆ బాలిక పుట్టింట్లోనో, అత్త‌గారింట్లోనో వెట్టి చాకిరీ చేస్తూ, అనేక అంక్ష‌ల మ‌ధ్య బ‌తుకును వెళ్ళ దీసేది.

విశాఖ జిల్లాలోని బ్రాహ్మ‌ణ కుటుంబాల‌లో క‌న్యాశుల్కం తీసుకునే పెళ్ళిళ్ళ‌పైన ఆనంద‌గ‌జ‌ప‌తి స‌ర్వే నిర్వ‌హించారు. ఆ స‌ర్వేలో గుర‌జాడ కూడా పాల్గొన్నారు. ఆ స‌ర్వే అస‌మ‌గ్ర‌మైన‌ప్ప‌టికీ, ఆ లెక్క‌లు గుర‌జాడ‌ను తీవ్రంగా క‌లిచి వేశాయి. చివ‌రికి గ‌ర్భ‌స్థ శిశువుకు కూడా బేరం పెట్ట‌డం గుర‌జాడ‌ను క‌దిలించివేసింది. దాంతో ఆయ‌న 1887లో 'క‌న్యాశుల్కం' నాట‌కం రాశారు. అప్ప‌టికాయ‌న వ‌య‌సు పాతికేళ్ళు.

ఆనంద గ‌జ‌ప‌తి మ‌ద్రాసు శాస‌న స‌భ‌లో క‌న్యాశుల్కాన్ని నిషేధించే ప్రైవేటు బిల్లు పెట్టిన‌ప్ప‌టికీ అది వీగిపోయింది. ఆ త‌రువాత  1929లో  బాల్య‌వివాహాల నిషేధ చ‌ట్టం రావ‌డానికి ఈ క‌న్యాశుల్కం నాట‌కం ఎంత‌గానో దోహ‌ద ప‌డింది.

క‌న్యాశుల్కం నాట‌కాన్ని తొలిసారిగా 1892 ఆగ‌స్టు 12వ తేదీన  విజ‌య‌న‌గ‌రంలో ప్ర‌ద‌ర్శించారు. అప్ప‌టికి సాంఘిక నాట‌కాలంటే మొహం వాచిపోయిన ప్రేక్ష‌కులు క‌న్యాశుల్కం  నాట‌కానికి బ్ర‌హ్మ ర‌థం  ప‌ట్టారు. నిర‌క్ష‌రాస్యులు ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల ఆనాటి సాహిత్యం ఎక్కువ‌గా నాట‌కాల‌తో దృశ్య రూపం సంత‌రించుకుంది.

మ‌న దేశంలో ఆలస్యంగా ఆధునిక జీవితం ప్రారంభ‌మ‌వుతున్న కాలంలోనే క‌న్యాశుల్కం నాట‌కం వ‌చ్చింది. ఈ నాట‌కం ప్ర‌ద‌ర్శించిన నాలుగు నెల‌ల‌కు, 1892 డిసెంబ‌ర్ 9న ప్ర‌పంచ  ప్ర‌సిద్ధ నాట‌క క‌ర్త జార్జ్ బెర్నార్డ్‌షా లండ‌న్‌లోని మురికి వాడ‌ల గురించి రాసిన‌ 'విడోవ‌ర్సెస్ హౌస్' అన్న నాట‌కాన్ని ప్ర‌ద‌ర్శించారు. స‌మ‌కాలీన స‌మాజ స‌మ‌స్య‌ల‌పై వ‌చ్చిన తొలి నాట‌కంగా 'క‌న్యాశుల్కం' ప్ర‌పంచ నాట‌క చ‌రిత్ర‌లో నిలిచిపోయింది. క‌న్యాశుల్కంలో మార్పులు చేర్పులు చేసి 1909లో పున‌ర్ముద్రించారు. మార్పులు చేసిన 'క‌న్యాశుల్కం' అంతులేని జ‌నాద‌ర‌ణ‌ను పొందింది.

'క‌న్యాశుల్కం' వ‌చ్చి 130 సంవ‌త్స‌రాలైనా తెలుగు వారికి ఈ నాట‌కం న‌చ్చినంత‌గా మ‌రొక నాట‌కం న‌చ్చ‌లేదు. కాలం చెల్లిన క‌న్యాశుల్కం నాట‌కాన్నే తెలుగు వారు ఇంకా ఎందుకు భుజాన మోస్తున్నారు? క‌న్యాశుల్కాన్ని మించిన స‌మ‌స్య‌లున్న ప్ప‌టికీ, దాన్ని మించిన నాట‌కం తెలుగు వారు ఎందుకు రాయ‌లేక‌పోయారు? నాట‌క‌రంగంలోమ‌న‌ వెనుకుబాటు త‌నాన్ని 'క‌న్యాశుల్కం' వెక్కిరిస్తోంది. అందుకే ఈ నాట‌కం ఇప్ప‌టికీ స‌జీవంగా నిలిచిపోయింది.

క‌న్యాశుల్కం నాట‌కంలో గుర‌జాడ సృష్టించిన గిరీశం పాత్ర విశేషంగా ఆక‌ర్షిస్తుంది. గిరీశం ఇంగ్లీషు విద్యావిధానంలో ఉత్ప‌న్న‌మైన వ్య‌క్తి. శ్రుత పాండిత్యం ఎక్కువ‌. క‌న్యాశుల్కం, బాల్య‌వివాహాలు వంటి దురాచారాల‌కు వ్య‌తిరేకం. కానీ, సంస్క ర‌ణ‌ల విష‌యంలో చిత్త‌శుద్ది లేదు. గిరీశం త‌న మాట‌కారి త‌నంతో అంద‌రినీ బోల్తా కొట్టిస్తాడు. త‌న శిష్యుడు వెంక‌టేశానికి పాఠం చెపుతూ చేసిన 'చుట్టోపాఖ్యానం' ఎలా ఉందో చూడండి.

'మ‌న వాళ్లు ఒట్టి వెధ‌వాయిలోయ్‌. 
చుట్ట‌నేర్పినందుకు థ్యాంక్స్ చెప్ప‌క త‌ప్పుప‌డుతున్నారు.
చుట్ట కాల్చ‌బ‌ట్టేగా దొర‌లంతా గొప్ప‌వాళ్ళ‌య్యారు.
చుట్ట పంపిణీ మీద‌నే స్టీం యంత్రం వ‌గైరా తెల్ల‌వాడు క‌నిపెట్టాడు
శాస్త్ర కారుడు ఏమ‌న్నాడో చెప్ప‌నా..
“ఖ‌గ‌ప‌తి య‌మృత‌ము తేగా!
భుగ‌భుగ‌మ‌ని చుక్క పొంగి భూమిని వ్రాలెన్‌
పొగ చెట్టై జ‌న్మించెను పొగ తాగ‌ని వాడు దున్న‌పోతై పుట్టున్‌”
'నువు బుద్ధిగా ఉంటే, చెప్పిన మాట‌ల్లా వింటుంటే నిన్ను సురేంద్ర నాథ్ బెన‌ర్జీ అనంత‌టి వాణ్ణి చేస్తాను.'
'డామిట్ క‌థ అడ్డం తిరిగింది' అన్న గిరీశం మాట‌తో నాట‌కం ముగుస్తుంది.

-రాఘ‌వ శ‌ర్మ‌