నోటిఫికేష‌న్ వెంట‌నే ర‌ద్దు చేయాలి!

స్త్రీ, శిశుసంక్షేమ‌శాఖ‌లో గ్రేడ్‌-2 ఉద్యోగాల భ‌ర్తీలో అవినీతిపై ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. జ‌గ‌న్ ప్ర‌భుత్వం పార‌ద‌ర్శ‌క‌త‌కు పెద్ద పీట వేస్తామ‌ని మొద‌టి నుంచి చెబుతూ వ‌స్తోంది. ఇందులో భాగంగా గ్రామ సచివాల‌యాల ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి…

స్త్రీ, శిశుసంక్షేమ‌శాఖ‌లో గ్రేడ్‌-2 ఉద్యోగాల భ‌ర్తీలో అవినీతిపై ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. జ‌గ‌న్ ప్ర‌భుత్వం పార‌ద‌ర్శ‌క‌త‌కు పెద్ద పీట వేస్తామ‌ని మొద‌టి నుంచి చెబుతూ వ‌స్తోంది. ఇందులో భాగంగా గ్రామ సచివాల‌యాల ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి అవినీతికి అవ‌కాశం లేకుండా ఇంట‌ర్వ్యూ విధానాన్ని ర‌ద్దు చేసింది. అలాగే ఏపీపీఎస్సీ ఉద్యోగాల భ‌ర్తీలోనూ ఇదే విధానాన్ని అవ‌లంబిస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

కానీ స్త్రీ, శిశుసంక్షేమ‌శాఖ‌కు మాత్రం అలాంటివేవీ ప‌ట్ట‌డం లేదు. తాజాగా గ్రేడ్‌-2 ఉద్యోగాల భ‌ర్తీలో భారీ అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్టు అంగ‌న్‌వాడీ వ‌ర్క‌ర్లు, సూప‌ర్‌వైజ‌ర్లు ఆరోపిస్తున్నారు. మెరిట్ ప్రాతిప‌దిక‌న కాకుండా డ‌బ్బు ఎవ‌రు ఎక్కువ ఇస్తే వారితో పోస్టుల భ‌ర్తీకి ఉన్న‌తాధికారులు చ‌ర్య‌లు తీసుకున్నార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. 

ఈ నేప‌థ్యంలో స్త్రీ, శిశుసంక్షేమశాఖ అధికారుల అవినీతిని నిర‌సిస్తూ అన్న‌మ‌య్య జిల్లా కేంద్రం రాయ‌చోటి క‌లెక్ట‌రేట్ ఎదుట భారీ ఆందోళ‌న‌కు దిగారు.

అవినీతి అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, అలాగే త‌క్ష‌ణ‌మే గ్రేడ్‌-2 భ‌ర్తీకి జారీ చేసిన నోటిఫికేష‌న్ ర‌ద్దు చేయాల‌ని అంగ‌న్‌వాడీ వ‌ర్క‌ర్లు, సూప‌ర్‌వైజ‌ర్లు డిమాండ్ చేశారు. ప్ర‌భుత్వ త‌మ డిమాండ్ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోక‌పోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్య‌మాన్ని తీవ్ర‌త‌రం చేస్తామ‌ని హెచ్చ‌రించారు. ఈ పోరాటానికి ప‌లు కార్మిక సంఘాలు మ‌ద్ద‌తు ప‌లికాయి.