ముస్లిముల్లో, క్రైస్తవుల్లో వర్గభేదాలున్నాయన్న సంగతి తెలుసు కానీ పెద్దగా పట్టించుకోలేదు. ముస్లిముల్లో కొన్ని వర్గాలను బిజెపి దగ్గరకు తీయాలని చూస్తోందని చదివాక ఎలా చేయగలుగుతోందో తెలుసుకుందామన్న ఆసక్తితో ఆ విషయం గురించి చదివాను. వాటి గురించి చెప్పబోయే ముందు ముస్లిము ఓట్ల గురించి రాజకీయ పార్టీల అవగాహన ఎలా ఉందో నేననుకున్నది చెప్తాను. ముస్లిములందరూ మూకుమ్మడిగా ఓటేస్తారనే ఊహతో చాలా పార్టీలు తమ ప్రణాళికలను రచిస్తూంటాయి. తక్కిన వర్గాలలాగానే ముస్లిములూ నూటికి నూరు శాతం ఒకే వైపు ఉండరు. ఏదైనా ప్రమాదం వస్తే ఏకం కావచ్చేమో తప్ప, లేకపోతే తమ తమ అభిమాన పార్టీలకు ఓటేస్తూ ఉంటారు. పాత బస్తీ లాటి ముస్లిం మెజారిటీ నియోజకవర్గాల్లో మజ్లిస్ అభ్యర్థికి వ్యతిరేకంగా మరో ముస్లిం పార్టీ అభ్యర్థో, జనరల్ పార్టీ ముస్లిం అభ్యర్థో నిలబడినప్పుడు, పార్టీల పరంగా చీలిపోయి ఓటేస్తారు.
ఇక ముస్లిములు, మెజారిటీ హిందువుల కంటె భిన్నంగా ఓటేస్తారని అనుకోవడానికి లేదు. దేశమంతా ఇందిరా గాంధీకి ఓటేసినప్పుడు వాళ్లూ వేశారు. జనతాకు వేసినప్పుడు వాళ్లూ వేశారు. మన దగ్గర ఎన్టీయార్ విషయంలోనూ అంతే. అందరూ ఓట్లేసినప్పుడు వేశారు, మానేసినప్పుడు మానేశారు. దేశంలో కొన్ని సెన్సిటివ్ ప్రాంతాల్లో మాత్రమే కన్సాలిడేషన్ జరుగుతుంది. ఎంత కన్సాలిడేషన్ అయినా 60%కి మించి జరగదని ప్రశాంత కిశోర్ లెక్కలు వేసి మరీ చెప్పాడు. పైగా ముస్లిముల్లో కూడా గొప్పా, బీదా, మధ్యతరగతి భేదాలుంటాయి. ఛాందస, ఉదారవాద భేదాలుంటాయి. విద్యావంతులు, నిరక్షరాస్యులు అనే తేడా ఉంటాయి. ముఖ్యంగా మగా, ఆడా తేడా ఉంటుంది. ప్రాంతీయ వ్యత్యాసాలుంటాయి. పార్టీ సిద్ధాంతాల పరమైన తేడా ఎలాగూ ఉంటుంది.
ఇవన్నీ పరిగణనలోకి తీసుకోకుండా ముస్లింలను ఆకట్టుకోవా లనుకున్నప్పుడల్లా కాంగ్రెసు ఛాందస ముస్లిం మతపెద్దలను దువ్వి, వాళ్లేం చెపితే అది చేస్తూ వచ్చింది. సెక్యులరిజం, సోషలిజం అని పలవరించే పార్టీలదీ అదే బాట! నిజానికి సెక్యులరిజం అంటే మతాన్నీ, రాజకీయాన్నీ కలపకపోవడం. నాస్తికత్వం కాదు, మతాన్ని మతంగానే ఉంచి దాని పేరుతో రాజకీయం చేయకపోవడం! ఈ సోకాల్డ్ సెక్యులరిస్టు పార్టీలు మైనారిటీలను, వారిలోనూ ఛాందసులను, దువ్వి అదే సెక్యులరిజం అనుకోమంటాయి. ఏ మతాన్ని వాడుకున్నా, అది సెక్యులరిజం కానేరదు. సిద్ధాంతవైరుధ్యానికి తోడు ముస్లింలంతా ఛాందసులే అనే అవగాహనరాహిత్యం కూడా ఉందీ పార్టీలకు.
వాస్తవం ఏమిటంటే చదువు పెరిగే కొద్దీ, నాగరికత పెరిగే కొద్దీ, ధనం సంపాదించే కొద్దీ, యితరులతో సంపర్కం పెరిగే కొద్దీ మూఢనమ్మకాలు తగ్గి, దానితో పాటు మతం పట్టూ సడలుతుంది. పల్లెటూళ్లో ఎవరి వాడల్లో వాళ్లున్నపుడు వారు వేరే, మేము వేరే అనుకోవడం జరుగుతుంది. నగరాలకు వచ్చి, పక్కపక్క ఫ్లాట్లలో ఉండేసరికి వాళ్లకూ, మనకూ తేడా ఏముంది అనే స్పృహ కలిగి, యితర కులాల పట్ల, యితర మతాల పట్ల సహనం పెరుగుతుంది. మంచీ, చెడూ అన్ని వర్గాల్లోనూ ఉందనే అవగాహన కలుగుతుంది. నగరీకరణ చేసే గొప్ప మేలు యిది. పాత బస్తీ ముస్లిములకు, అక్కణ్నుంచి వచ్చేసి, సైబరాబాద్‌లో ఉండే ముస్లిములకు ఆలోచనావిధానంలో తేడా ఉంటుంది. అగ్రహారంలో ఉండిపోయిన బ్రాహ్మణునికి, అమెరికా వెళ్లిన బ్రాహ్మణునికి ఉదారబుద్ధిలో వ్యత్యాసం కనబడుతుంది.
అదే విధంగా ఆర్థికస్థాయి బట్టి లైఫ్ స్టయిల్ ప్రభావితమౌతుంది. దాన్ని బట్టి దృక్పథమూ మారుతుంది. కులంతో సంబంధం లేకుండా డబ్బున్నవాళ్లందరి జీవనసరళి యించుమించు ఒకేలా ఉంటుంది. అందుకే నగరవాసులై ఉండి, ఒకే స్థాయిలో ఉన్న వారి మధ్య కులాంతర వివాహాలు ఎక్కువ శాతం విజయవంతమౌతున్నాయి. పల్లెటూళ్లలో కానీ స్థాయీభేదం ఎక్కువగా ఉన్నవారి మధ్య కానీ కులాంతర వివాహాలు ఆటుపోట్లకు గురవుతున్నాయి. ఇలాటి మార్పులకు ముస్లిములు కూడా అతీతులు కారు. కానీ ఆ విషయాన్ని గుర్తించకుండా సినిమా వాళ్లు ఒక్కో వృత్తి వారికి ఒక్కో మూస తయారు చేసి పెట్టుకున్నట్లు, రాజకీయ పార్టీలు ముస్లిముల గురించి ఓ మూస తయారు చేసి పెట్టుకుని, అన్ని రకాల ముస్లిములనూ దానిలో పోసేసి, ఆ ప్రకారమే మానిఫెస్టోలో హామీలు గుప్పించేస్తూంటారు.
ముస్లిములు ఎక్కువగా ఉన్న చోట ఉర్దూ మీడియం పాఠశాలలు పెడతాం, మదరసాలు పెడతాం అంటారు. పిల్లవాడికి ఉద్యోగం రావాలంటే స్థానిక భాషలో చదవాలి, ఇంగ్లీషు బాగా నేర్వాలి. ఏ రాష్ట్రంలోనూ ఉర్దూను పూర్తి ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగించనప్పుడు అది నేర్చుకుని ముస్లిము పిల్లలు ఏం చేయాలి? శేర్ శాయరీ చెప్పుకోవాలంతే! అలాగే హిందువులున్న చోట వేదపాఠశాలలు పెడితే ఎంతమంది వాటిల్లో చేరతారు? ముస్లిముల్లో ఎంత శాతం మంది మతవిద్య నేర్చుకుని జీవనోపాధిగా మార్చుకోగలరు? కాన్వెంటులో చేర్పించలేక, ప్రభుత్వపాఠశాలలు తీరు బాగోలేక పేద ముస్లిములు మదరసాల్లో చేర్పించాలి తప్ప, ఓ పాటి ఆదాయం ఉన్న ముస్లిమెవరూ తన కొడుకుని మదరసాకు పంపడు. షా బానో కేసులో రాజీవ్ చేసిన తప్పు భారతచరిత్రను వెనక్కి తిప్పింది. దానితో పోలిస్తే మోదీ తెచ్చిన ముమ్మారు తలాక్ రద్దు బిల్లు (శిక్ష మరీ తీవ్రంగా ఉండడం దానిలో లోపం, దాని అమలు గురించి మరో వ్యాసం రాస్తాను) ఎంతో ప్రగతిశీలమైనది. ముస్లిం మహిళలకు ఊరట నిచ్చి వారిలో కొంతమందిని బిజెపి సమర్థకులుగా మార్చింది.
చెప్పవచ్చేదేమిటంటే కాంగ్రెసు, యితర ‘సోషలిస్టు’ పార్టీలు ముస్లింలపై ఛాందసప్రియులనే ముద్ర కొట్టి వాళ్లకు అపకారం చేశారు. కాలక్రమేణా చాలామంది ముస్లిముల్లో విద్యాభ్యాసం పెరిగింది, కుటుంబ నియంత్రణ పాటించడం పెరిగింది. ఛాందసం తగ్గింది. (మూడునాలుగేళ్లగా వస్తున్న మార్పు గురించి చివరి పేరాల్లో రాశాను) ఐటీ రంగం వచ్చాక వైట్ కాలర్ జాబ్సూ వచ్చాయి. లోయర్ మిడిల్‌క్లాస్ నుండి మిడిల్ క్లాసుకి, అక్కణ్నుంచి అప్పర్ మిడిల్ క్లాసుకి ఎగబాకడం జరిగింది. ‘హమ్ పాంచ్, హమారే పచ్చీస్’ అని వెక్కిరింత వినవస్తున్నా ఒకే భార్య ఉన్న ముస్లిములే మన చుట్టూ కనబడతారు. ఇద్దరు భార్యలున్న హిందువులెందరు కనబడుతున్నారో, ముస్లిములూ అంతమందే కానవస్తారు.
మన చుట్టూ ఉన్న సర్కిల్ బట్టి మనం జనరలైజ్ చేస్తాం. ఎవరైనా నిజాయితీ ఐన సర్వే చేసి, పూర్తి గణాంకాలు వెల్లడిస్తే తప్ప పూర్తి చిత్రం తెలిసి రాదు. భూలోకపు చట్టాలకు అతీతుడైన దేవుడు ముస్లిముల్లో కూడా ఆడ మగ నిష్పత్తి సమానంగా ఉండేట్లా సృష్టిస్తున్నాడు. ఒక్కో మగాడూ నలుగుర్ని కట్టుకోవచ్చు కదాని ఒన్ ఈస్టూ ఫోర్ లెక్కలో ఆడవాళ్లను పుట్టించటం లేదు. లాజికల్‌గా చూస్తే ఒకే స్త్రీ ఏకకాలంలో నలుగురేసి మగాళ్లకు భార్యగా ఉంటే తప్ప ఆ సూత్రం వర్తించే వీలు లేదు. లేదూ, ఒక మగాడికి నలుగురు భార్యలున్నారు అంటే అదే సమయంలో మరో ముగ్గురు మగాళ్లు ఏ భార్యా లేకుండా అఘోరిస్తున్నారని అర్థం. అందుచేత ‘హమ్ పాంచ్, హమారే పచ్చీస్’ అనేది తర్కరహితమైన ఆరోపణే తప్ప వాస్తవం కాదని తేలుతుంది.
కాంగ్రెసు, ‘సోషలిస్టు’ పార్టీలకు భిన్నంగా బిజెపి తన రాజకీయ వ్యూహాన్ని రచిస్తోంది. ముస్లిములలో అణగారిన వర్గాలను గుర్తించి, వారిని ఉద్ధరించి, వాళ్ల ఓట్లు ఆకర్షిద్దామని చూస్తోంది. బిజెపి దేశంలో ప్రాంతాన్ని బట్టి రకరకాల రాజకీయ ప్రయోగాలు చేస్తోంది. మండల్ పేరుతో కులరాజకీయాలు నడిచిన ఉత్తరభారతంలో బిసి కులాలను ఉపకులాలుగా విడగొట్టి యితర పార్టీల కంచుకోటలను బద్దలు చేసింది. యుపిలో నాన్-యాదవ్ బిసిలను ఏకం చేసి ఎస్పీని దెబ్బకొట్టడం ఆ స్ట్రాటజీలో భాగమే. అలాగే ఎస్సీలలో కూడా జాతవేతర ఎస్సీలను విడగొట్టి బియస్పీని దెబ్బ కొట్టింది. బిసి రాజకీయాలు బలంగా లేని దక్షిణాది రాష్ట్రాలలో బిజెపి ముస్లిములకు వ్యతిరేకంగా హిందువులలో ఐకమత్యం తేవడానికి ప్రయత్నిస్తోంది. ముస్లిములు బలంగా ఉన్న చోట ముస్లిము వర్గాలలో కొన్నిటిని దువ్వుతోంది. హైదరాబాదులో జరిగిన బిజెపి జాతీయ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో మోదీ ముస్లిముల్లో వెనకబడిన వర్గాలకు చేరువ కావాలని సందేశం యిచ్చారు. దాన్ని డా. లక్ష్మణ్ పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలో ముస్లిముల్లో ఉన్న వర్గాలేమిటో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.
థియరీ ప్రకారం చూస్తే దేవుడి ముందు మానవులందరూ సమానమే. మసీదులో అందరూ పక్కపక్కనే నిలబడి ప్రార్థనలు చేస్తారు. గుళ్లో అందరూ పక్కపక్కనే నిలబడతారు. పూజారి తప్ప, ఆయన కులస్తులకు కూడా గర్భగుడిలోకి ప్రవేశం ఉండదు. గుడి లేదా మసీదు బయటకు వచ్చేసరికి మాత్రం తేడాలు కనబడతాయి. ముఖ్యంగా భారతదేశంలో కులవ్యవస్థ బలంగా పాతుకుంది కాబట్టి యిక్కడున్న హైందవేతర మతాల్లో కూడా కులస్పృహ చేరింది. శిఖ్కు మతంలో కులం లేదు. కానీ ఆచరణలో దళిత శిఖ్కులున్నారు. క్రైస్తవంలో కులం లేదు. కానీ ఆచరణలో దళిత క్రైస్తవులు, అగ్రవర్ణం నుంచి మతం మారిన క్రైస్తవులు వేరేవేరే ఉన్నారు. అలాగే ముస్లిముల్లో కూడా తేడాలున్నాయి. ‘ఇండియాలో మతం మారవచ్చు తప్ప కులం మారలేవు’ అనే సామెత ఉంది. క్రైస్తవుల్లో, ముస్లిముల్లో అంటరానితనం (హిందువుల్లో కూడా చాలా చోట్ల పోయింది) లేకపోవచ్చు కానీ కులపరమైన హెచ్చుతగ్గులు ఆచరణలో ఉన్నాయి. దానికి తోడు స్థాయీభేదాలూ ఉన్నాయి. ఉన్నతవర్గాలూ, మధ్యవర్గాలూ, అధమవర్గాలూ అనే తేడాలున్నాయి.
మహమ్మద్ ప్రవక్త 7వ శతాబ్దంలో మరణించిన తర్వాత ఆయన వారసత్వం కోసం తెగల మధ్య యుద్ధాలు జరిగాయి. ప్రవక్త కుటుంబానికి చెందినవారు, సన్నిహితులు (అహ్ల్ అల్-బయాత్) తాము యితరుల కంటె అధికులమన్నారు. ప్రవక్త కూతురు ఫాతిమా వంశస్తులైన సయ్యద్‌లు తాము అందరి కంటె ఉన్నతులమన్నారు. అరేబియాలో పుట్టిన ఇస్లాం క్రమేపీ ప్రపంచంలో అనేక దేశాలకు వ్యాపిస్తూ, స్థానికులను ఇస్లాంకు మారుస్తూ ముస్లింల సంఖ్య పెంచుకుంటూ పోయింది. పాలస్తీనా క్రైస్తవులు, తర్వాతి రోజుల్లో వాటికన్ పోప్‌లు క్రైస్తవం మీద తమకు ఆధిపత్యం ఉందని ఫీలయినట్లు, అరబ్ ముస్లిములు తామే ఒరిజినల్ ముస్లిములమని, తర్వాత వచ్చినవారందరూ ద్వితీయశ్రేణి ముస్లిములని ఫీలవసాగారు. దాంతో ఇస్లాంలో అరబ్-అరబేతర వ్యత్యాసం వచ్చి చేరింది. పోనుపోను అరబేతర ముస్లిముల్లో ఇస్లాంలోకి ముందుగా చేరినవారు (ఖదీమ్ అల్ ఇస్లామ్), వెనకగా చేరినవారు (జదీద్ అల్ ఇస్లామ్) అనే భేదం వచ్చింది.
12వ శతాబ్దంలో భారతదేశంలో ముస్లిములు వచ్చేపాటికే వృత్తుల పరంగా విదేశీ ముస్లిములలో పెద్దా, చిన్నా తరగతులు ఏర్పడ్డాయి. ఇక్కడకి వచ్చాక మరి కొన్ని తేడాలు పెరిగాయి. ధనికులు, పూజారులు, విదేశాల నుంచి వచ్చి యిక్కడ స్థిరపడినవారు వీళ్లంతా ఉన్నతవర్గం. వారినీ, వారితో సంపర్కం ఉన్నవాళ్లను అష్రఫ్‌లన్నారు. క్రింది తరగతుల వారిని అజ్‌లాఫ్‌లన్నారు. వజీర్లగా అష్రఫ్‌లనే నియమించేవారు. విదేశాల నుంచి వచ్చిన ఉన్నత వర్గీయుల్లో సయ్యద్ (ప్రవక్త బంధువులు), షేఖ్ (అరేబియాలోని ఖురేశీ కబీలాకు సంబంధించినవారు), ముఘల్ (సమర్‌ఖండ్‌కు చెందిన బాబర్‌కు సంబంధించినవారు), పఠాన్ (అఫ్గనిస్తాన్ నుంచి వచ్చినవాళ్లు) లు ముఖ్యులు.
ఇస్లాంకు మారిన అగ్రవర్ణ హిందువుల్లో ముస్లిం రాజపుత్రులు, ముస్లిం జాట్లు ఉన్నారు. పశ్చిమ పంజాబ్‌లో బ్రాహ్మణులు ఇస్లాంకు మారినప్పుడు వాళ్లని భట్ లేదా బట్ అన్నారు. ప్రతాపరుద్రుడి అనంతరం కాకతీయ రాజ్యంలో ఉన్న ఎఱ్ఱాప్రగడ నాటి కాలాన్ని చిత్రీకరిస్తూ నోరి నరసింహశాస్త్రిగారు రాసిన ‘‘మల్లారెడ్డి’’ నవలలో బ్రాహ్మణ సేనాపతులు ఇస్లాం మతంలోకి మారి ప్రముఖులయ్యారని రాశారు. క్రైస్తవంలోకి మారినా ‘రెడ్డి’, ‘చౌదరి’ కులసూచకాల్ని వదలని వారిని చాలామందిని చూశాం. ఇటీవలే ‘శాస్త్రి’ అనే పేరున్న పాస్టర్ పేరు తొలిసారి పోస్టర్లలో చూశాను. అలాగే ఇస్లాంలోకి మారిన అగ్రవర్ణస్తులు తమ ఔన్నత్యాన్ని చాటుకోవడానికి తక్కినవారితో కలవడానికి యిచ్చగించి ఉండరు.
చేసే వృత్తి బట్టి, కులం బట్టి ముస్లిములలో కొందరు సామాజికంగా వెనకపడ్డారు. వారికి మన తెలుగు రాష్ట్రాలలో ఒబిసిలుగా గుర్తింపు లభిస్తుంది. 1993లోనే దూదేకుల వాళ్లను ఒబిసిలన్నారు. 2004 నుంచి కొన్ని కులాలు వచ్చి చేరాయి. వాళ్లలో కొందరు – అత్తరు సాయిబులు, తురక చాకళ్లు, గరడి సాయిబులు, ఫకీరు సాయిబులు, తురక మంగళ్లు, తురక కటికవాళ్లు, రోళ్లకు కక్కు కొట్టేవాళ్లు.. యిలా చాలామంది ఉన్నారు. వీళ్లందరినీ కలిపి అజ్‌లాఫ్‌లు అన్నారు. వీళ్లు కాక అంటరాని కులాల నుంచి వచ్చి ముస్లిముల్లో చేరినవాళ్లను అర్జాల్‌లు అన్నారు. ఈ వర్గాల వారందరూ వాళ్లలో వాళ్లే పెళ్లి చేసుకుంటారు తప్ప తక్కిన వర్గాలతో చేసుకోరు. తక్కిన ప్రాంతాల కంటె బెంగాల్, బిహార్, ఝార్‌ఖండ్, ఉత్తర యుపి ప్రాంతాల ముస్లిములలో కులస్పృహ ఎక్కువట. ఎవరైనా ముస్లిం కొత్తగా పరిచయమైన ముస్లిముతో తన మొదటి పేరు మాత్రం చెప్పి ఊరుకుంటే ‘ఇస్‌కే ఆగే క్యా లగాతే హో?’ అని అడగడం కద్దట. బిసి కులాల వారు ఎంత డబ్బు సంపాదించినా అష్రఫ్‌లు వాళ్లింటి కూతుళ్లను వీళ్లకు యివ్వడం కల్ల.
హిందూ దళితులకు రిజర్వేషన్లు, రిజర్వ్‌డ్ సీట్లు కావాలని పట్టుబట్టి, రాజ్యాంగంలో చేర్చిన ఆంబేడ్కర్, ముస్లిము దళితుల విషయంలో అలాటివి అడగలేదు. ముస్లిము నాయకులందరూ అగ్రవర్ణస్తులే కాబట్టి వాళ్లూ పట్టుబట్టలేదు. దాంతో వారి గతి అన్యాయమై పోయింది. ఎస్సీ, బిసి ముస్లిములను కలిపి పస్‌మాందా (వెనకబడిన) ముస్లిములంటున్నారు. ఇప్పుడు బిజెపి వారిపై కన్నేసింది. వీరికి సౌకర్యాలు, రాయితీలు, ఋణాలివ్వడానికి ప్రత్యేక కార్పోరేషన్లు, వీలైతే రిజర్వేషన్లు యిస్తామనవచ్చు. అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు యిచ్చి వారిని ఆకట్టుకున్న రీతిలో వీరినీ ఆకట్టుకోవచ్చు. నిజానికి 1990 దశకం నుంచి యీ వర్గాల్లో అభివృద్ధి ఫలాలు దక్కటం లేదన్న ఫిర్యాదు ఉంది. సచ్చార్ కమిటీ రిపోర్టు ప్రకారం భారత ముస్లిముల్లో 40% మంది పస్‌మాందా (బిసి, ఎస్సీ) ముస్లిములేట.
ఇలాటి అసంతృప్తులను చేరదీయడానికి కొన్ని సంస్థలు వెలిశాయి. డా. ఎజాజ్ అలీ అనే బిహార్ మాజీ ఎంపీ 32 బిసి కులాలను సమీకరించి ‘ఆల్ ఇండియా బ్యాక్‌వర్డ్ ముస్లిమ్ మోర్చా’ అని పెట్టాడు. మహారాష్ట్రకు చెందిన షబ్బీర్ అన్సారీ ‘ఆల్ ఇండియా ముస్లిం ఓబిసి ఆర్గనైజేషన్’ అని పెట్టాడు. పట్నాకు చెందిన అలీ అన్వర్ అన్సారీ ‘ఆల్ ఇండియా పసమాందా ముస్లిమ్ మహాజ్’ అనే సంస్థను 1998లో పెట్టి దళిత (అర్జల్) ముస్లిముల అభ్యున్నతికై బిహార్‌లో పోరాటం మొదలుపెట్టాడు. దాని శాఖలు ఉత్తర ప్రదేశ్, ఝార్‌ఖండ్, బెంగాల్, దిల్లీలలో కూడా ఉన్నాయి. మతపరంగా యిచ్చే రిజర్వేషన్లను వీళ్లు వ్యతిరేకిస్తారు. తెలుగు రాష్ట్రాలలో ఎస్సీ రిజర్వేషన్ల ప్రయోజనం మాలలకే ఒనగూడుతోందని మాదిగలు వాదిస్తున్నట్లు, ముస్లిం రిజర్వేషన్ అనగానే అవన్నీ ఆష్రఫ్‌లు ఎత్తుకుపోతారని వీళ్ల భయం. సామాజిక, ఆర్థిక స్థితిని మాత్రమే లెక్కలోకి తీసుకోవాలని వీరి నినాదం.
వీళ్ల ప్రయత్నాలన్నీ చిన్న స్థాయిలో జరుగుతున్నాయి. బిజెపి వంటి బలమైన జాతీయ పార్టీ వీరి గోడు పట్టించుకుందంటే పెనుమార్పు రావడం తథ్యం. మోదీ అధికారంలోకి వచ్చాక ఒక పద్ధతి ప్రకారం ముస్లిం వ్యతిరేక చర్యలు చేపట్టడం చేత తమ అస్తిత్వానికే ముప్పు వస్తోందన్న భయం పట్టుకుంది ముస్లిములకు. ఇన్నాళ్లూ తమలో తాము కులపరంగా, సిద్ధాంతపరంగా, షియా-సున్నీ పరంగా, స్త్రీ-పురుష పరంగా విడిపోయి కలహించుకుంటూ ఉండడం చేతనే పరిస్థితి యింతవరకు వచ్చిందని వగచసాగారు. క్రమేపీ కలిసికట్టుగా పోరాడాలనే నిశ్చయానికి వస్తున్నారు. దాన్ని నివారించడానికే ముస్లిం సమాజాన్ని కులపరంగా విడగొట్టడానికే బిజెపి పసమాందాలను దువ్వుతోందని విశ్లేషకులంటున్నారు.
రాజకీయ కారణాలు ఏమైనా కానీయండి, యిది మంచికే వచ్చిందని నా అభిప్రాయం. ఇటీవల కొన్నేళ్లగా ముస్లిము వ్యతిరేకత సమాజంలో పెరుగుతోంది. పని గట్టుకుని, వాట్సాప్‌లు పంపి వారి పట్ల ద్వేషాన్ని పెంచుతున్నారు. హిందువులకు దేశభక్తి అనేది బై డిఫాల్ట్ అనీ, ముస్లిములు మాత్రం మాటిమాటికీ దేశభక్తిని నిరూపించుకోవాలని తటస్థులు కూడా అనే వాతావరణం వచ్చిపడింది. (దేశద్రోహానికి పాల్పడ్డ హిందువులకు లోటు లేదని వీళ్లకు తోచదు). ఇది సాధారణ ముస్లిములకు చికాగ్గా తయారైంది. వారిలో కొంతమంది రాడికలైజ్ అవుతున్నారు. బాగా చదువుకుని, ఉద్యోగాలు చేస్తున్న వైట్ కాలర్ వాళ్లలో కూడా మతస్పృహ పెరుగుతోంది. వ్యక్తిగతంగా ఉదారంగా ఉన్నా సామూహికంగా ఛాందసవాద ముద్ర, టెర్రరిస్టు ముద్ర పడుతోందన్న వ్యథ వాళ్లది. వాళ్లని వేరుగా చూసి, పెర్సిక్యూట్ చేసిన కొద్దీ రాడికలైజేషన్ పెరుగుతుంది. ఐడెంటిటీని చాటుకోవడానికి చూస్తారు, మేమింతే, ఏం చేస్తారో చేసుకోండి అని ఛాలెంజ్ చేసే పరిస్థితికి వస్తారు.
ఇదివరలో కొందరు శిఖ్కులు గడ్డం పెంచేవారు కాదు. గడ్డం, మీసాలు పెంచే శిఖ్కులు సైతం మోడర్న్‌గా ఉండేవారు. గడ్డాన్ని ట్రిమ్ చేసేవారు. నెట్ వేసేవారు. ఆడవాళ్లు కూడా జుట్టు కట్ చేసుకునేవారు. ఖలిస్తాన్ ఉద్యమ సమయంలో అసలైన శిఖ్కు అంటే జుట్టు కత్తిరించకూడదు, కత్తిరిస్తే హిందువే అనే వాదన భింద్రన్‌వాలే అనుయాయులు తెచ్చారు. దాంతో శిఖ్కులు భయపడి ట్రిమ్మింగ్, నెట్ మానేసి గడ్డాలను అలాగే వదిలేయడం మొదలుపెట్టారు. ఇందిర హత్యానంతరం శిఖ్కులపై దాడులు జరగడంతో వాళ్లకు కసి పెరిగింది. ‘ఔను మేము శిఖ్కులమే, ఏం చేస్తారో చేసుకోండి’ అని చాటి చెప్పడానికి గడ్డాన్ని గీయకుండా వదిలేశారు. ఆడవాళ్లు జుట్టు కట్ చేయడం మానేశారు.
ఇప్పుడు కొందరు ముస్లిముల్లో ఆ పరిస్థితి చూస్తున్నాను నేను. మీసం తీసేసి గడ్డం పెంచడం లాటివి ఆఫీసుల్లో పని చేసే వాళ్లు కూడా చేస్తున్నారు. బయట చూస్తే టోపీలు పెట్టుకోవడం పెరిగినట్లు తోస్తోంది. ఎవరైనా సోషియాలజిస్టు దీనిపై రిసెర్చి చేస్తే ఏ మేరకు పెరిగాయో తెలుస్తుంది. దేశంలో దాదాపు 20 కోట్ల మంది ముస్లిములున్నారు. వారిలో 0.1% మంది అంటే 2 లక్షల మంది రాడికలైజ్ అయినా మన దేశంలో శాంతిభద్రతలకు ముప్పే. నవాబులతో, జమీందారులతో మనకి పని పడదు. ఆఫీసులో కూడా చాలా తక్కువమంది ముస్లిములుంటారు. వాళ్లతో ఇంటరాక్షనూ తక్కువే. కానీ చాలా ప్రాంతాల్లో చీప్ లేబరు ఫోర్స్‌లో ముస్లిములదే మెజారిటీ. ఎలక్ట్రీషియన్, ప్లంబర్, హౌస్ క్లీనర్, తాపీ మేస్త్రీ, ఉడ్ అండ్ మార్బుల్ పనివారు, వాహనాల మెకానిక్‌లు, పెట్రోలు బంక్ ఉద్యోగులు.. యిలా ఎల్లెడలా వారితో పని పడుతుంది. వాళ్లు రాడికలైజ్ అయ్యారంటే మన యింట్లోకే వచ్చి అగ్గి పెట్టేయగలరు.
నేను గతంలో కూడా అనేకసార్లు రాశాను. ధనిక, పేద మధ్య వ్యత్యాసం ఒక హద్దుకు మీరి పెరిగిన కొద్దీ ధనికుడికి భద్రత కరువౌతుందని. నువ్వు సుష్టుగా భోంచేస్తూ ఆకలి గొన్నవాడికి ఎంగిలి మెతుకు కూడా విదల్చకపోతే, వాడు చూసిచూసి నిన్ను తన్ని విస్తరి లాక్కుంటాడని. ఈ విషయం గ్రహించకుండా యీనాటి ప్రపంచం ధనికులను అతిధనికులను చేసే పరుగుపందెంలో పడింది. కరోనా టైములో సామాన్యుల స్థితి దిగజారితే, భాగ్యవంతులు మహాభాగ్యవంతులై పోయారు. తిరగబడే పరిస్థితి వరకు పేదలు వెళ్లకుండా సంక్షేమం పేరుతో (ఆ పేరుతో ఊరికే మెక్కబెట్టమని నా ఉద్దేశం కాదు) ఎదగడానికి చేయూత నిస్తే సమాజంలో శాంతి నెలకొంటుంది. శాంతి ఉన్నచోటే అభివృద్ధి. రెండూ కవలలు. అభివృద్ధి అంటే ప్రపంచ కుబేరుల్లో మనవాళ్లది ఎన్నో స్థానం అనేది చూసుకోవడం కాదు, అభివృద్ధి ఫలాలు అందరికీ కొద్దోగొప్పో అందాయో లేదో చూసుకోవాలి. అది జరగకపోతే పేదలు ఆగ్రహానికి లోనవుతారు. హింసకు పాల్పడతారు. వారిని మతం పేరుతో లోబరుచుకుంటే డేంజరస్ కాంబినేషన్. పేద ముస్లింలు సమాజశాంతి విధ్వంసకులుగా మారే ప్రమాదం ఉంది.
ఇన్‌క్లూజివ్ పాలిటిక్స్ ద్వారా ఏదో ఒకటి చేసి, ముస్లిములకు కూడా అభివృద్ధి ఫలాలు అందేలా చేయకపోతే అమెరికాలో నల్లవాళ్ల సమస్యలా మనకిది పెద్ద సమస్య అవుతుంది. అందేట్లా చేస్తే, వారిలో శాంతి పట్ల శ్రద్ధ పెరుగుతుంది. శ్రీలంకలో మత ఉగ్రవాదాన్ని నివారించలేక పోవడం చేత శాంతికి భగ్నం కలిగి, టూరిస్టులు రావడం మానేశారు. టూరిజం ఆదాయంపై ఆధారపడిన శ్రీలంక ఆర్థికంగా దెబ్బ తినడానికి ఆ ఘటన ఒక ముఖ్యకారణమైంది. అందువలన పేద ముస్లింల సంఖ్య తగ్గడం భారతీయ సమాజానికి శ్రేయస్కరం. ఓట్ల కోసమైతేనేం, ముస్లింలను చీల్చడానికైతేనేం బిజెపి ఆ పని చేపడితే హర్షించి తీరవలసిందే.
– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2022)