నీ రాజ‌కీయం న‌చ్చింది గురూ…!

రాజ‌కీయాలు ఎలా చేయాలో తెలంగాణ మంత్రి కేటీఆర్ నుంచి నేర్చుకోవాలి. ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను కూడా ఎలా అనుకూలంగా మ‌లుచుకోవాలో కేటీఆర్ నుంచి త‌ప్ప‌క తెలుసుకోవాలి. క‌నీస సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని కోరుతూ ఆ మ‌ధ్య బాస‌ర…

రాజ‌కీయాలు ఎలా చేయాలో తెలంగాణ మంత్రి కేటీఆర్ నుంచి నేర్చుకోవాలి. ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను కూడా ఎలా అనుకూలంగా మ‌లుచుకోవాలో కేటీఆర్ నుంచి త‌ప్ప‌క తెలుసుకోవాలి. క‌నీస సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని కోరుతూ ఆ మ‌ధ్య బాస‌ర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు రాత్రింబ‌వ‌ళ్లు నిర‌స‌న‌కు దిగారు. ఇదే అదునుగా భావించిన ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు అక్కడికెళ్లి ప‌బ్బం గ‌డుపుకోవాల‌ని చూశాయి.

ప్ర‌జ‌ల్లో కేసీఆర్ స‌ర్కార్‌పై వ్యతిరేక‌త పెంచేందుకు బాస‌ర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల‌ను ఆందోళ‌న‌ను అవ‌కాశంగా తీసుకోవ‌డాన్ని చూశాం. ఈ నేప‌థ్యంలో ఇవాళ బాస‌ర ట్రిపుల్ ఐటీకి మంత్రులు కేటీఆర్‌, స‌బితా ఇంద్రారెడ్డి త‌దిత‌రులు వెళ్ల‌డం ప్రాధాన్యం ఏర్ప‌డింది. అస‌లే ప్ర‌భుత్వంపై విద్యార్థులు కోపంగా ఉన్నార‌ని, మంత్రుల్ని వారేం మాట్లాడుతారో అనే అనుమానం ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో ఉండింది.

కానీ అలాంటివేవీ జ‌ర‌గలేదు. విద్యార్థుల‌తో క‌లిసి మంత్రులు భోంచేశారు. విద్యార్థుల‌కు నచ్చేలా కేటీఆర్ ప్ర‌సంగించ‌డం విశేషం. విద్యార్థుల ఆందోళ‌న చేసిన తీరు త‌న‌కు న‌చ్చింద‌ని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. రాజ‌కీయాల‌కు ఆస్కారం లేకుండా, కేవ‌లం స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికే విద్యార్థులు ఆందోళ‌న చేసిన విధానం త‌న‌కు బాగా న‌చ్చింద‌ని కేటీఆర్ చెప్పుకొచ్చారు. గాంధీ స‌త్యాగ్ర‌హం ఎలా చేశారో, మీరు కూడా అలాగే శాంతియుతంగా స‌మ్మె చేశార‌ని విద్యార్థుల‌తో అన్నారు. స‌మ‌స్య‌ల్ని ప్ర‌భుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు స‌మ్మె చేస్తున్నామ‌ని స్ప‌ష్టంగా చెప్పార‌న్నారు.

మెస్‌ సరిగా లేదన్న విషయం ఇప్పటికే గుర్తించామ‌న్నారు. ప్రతీరోజు మంచి ఆహారం అందించేలా చర్యలు తీసుకుంటా మ‌న్నారు.  విద్యార్థులకు త్వరలో ల్యాప్‌టాప్‌లు ఇస్తామన్నారు. హాస్టల్‌లో ఉండే కష్టాలు త‌న‌కు బాగా తెలుస‌న్నారు. ఎందు కంటే 70 శాతం విద్యార్థి జీవితం హాస్ట‌ళ్ల‌లోనే గ‌డిపిన‌ట్టు కేటీఆర్ చెప్పుకొచ్చారు.  ఇక్కడున్న సమస్యలు తెలుసుకునేందుకు కొంచెం సమయం పడుతుంద‌న్నారు. సమస్యల‌న్నీ పరిష్కారం అవుతాయ‌న్నారు. మరో రెండు నెలల తర్వాత మళ్లీ ట్రిపుల్‌ ఐటీకి వస్తానన్నారు.  

విద్యార్థుల మ‌న‌సెరిగి మాట్లాడ్డం ద్వారా కేటీఆర్ వారికి ఇష్ట‌మైన నాయ‌కుడ‌య్యారు. ప్ర‌భుత్వంపై ఉన్న ఆగ్ర‌హం కాస్త కేటీఆర్ ప్ర‌సంగంతో కొట్టుకుపోయిన‌ట్టైంది. విద్యార్థుల పోరాటం కేటీఆర్‌కు న‌చ్చిన‌ట్టే, ఆయ‌న‌ తీరు బాస‌ర ఐటీ విద్యార్థుల‌తో పాటు ప్ర‌జానీకానికి న‌చ్చుతుంద‌న‌డంలో సందేహం లేదు.