మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి తీవ్ర నిరాశ ఎదురైంది. సర్వోన్నత న్యాయస్థానంలో బెయిల్ దక్కకపోవడం గమనార్హం. ఇప్పటికే ఆయన 11 నెలలుగా జైల్లో వుంటున్నాడు. ఈ నేపథ్యంలో వివిధ దశల్లో బెయిల్ కోసం శివశంకర్‌రెడ్డి చేసిన న్యాయ పోరాటాలు పూర్తిగా విఫలమయ్యాయి. చివరికి ఏకైక ఆశ పెట్టుకున్న సుప్రీంకోర్టులో కూడా ప్రతికూల తీర్పే వచ్చింది.
ప్రధానంగా వివేకా హత్య కేసులో ఏ1 నిందితుడికి కేవలం మూడు నెలల్లో బెయిల్ వచ్చిందని, తమ పిటిషనర్‌కు మాత్రం నెలలు గడుస్తున్నా బెయిల్ రావడం లేదంటూ దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తరపు న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ బలమైన వాదనలు వినిపించారు. అసలు వివేకా హత్య కేసులో మొదట నమోదైన ఎఫ్ఐఆర్లో శివశంకర్‌రెడ్డి పేరు లేదని అభిషేక్ వాదించారు. అప్రూవర్‌గా మారిన వాచ్‌మన్ స్టేట్ మెంట్లో కూడా శివశంకరరెడ్డి పేరు లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
కానీ నిందితుడి తరపు వాదనలతో కోర్టు ఏకీభవించకపోగా, సీరియస్ కామెంట్స్ చేసింది. హత్య కేసులో శివశంకర్‌రెడ్డి కీలక వ్యక్తిగా సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడడం గమనార్హం. శివశంకర్‌రెడ్డి బెయిల్‌ను తిరస్కరిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు శివశంకర్‌రెడ్డి వెళ్లినా… ఎలాంటి ఫలితం దక్కలేదు.
పైగా శివశంకర్‌రెడ్డి కీలక నిందితుడిగా సర్వోన్నత న్యాయస్థానం పేర్కొనడంపై ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పట్లో శివశంకర్‌రెడ్డికి ఇప్పట్లో బెయిల్ దక్కే పరిస్థితి కనిపించడం లేదు. అలాగే విచారణను ఏపీ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ వివేకా కుమార్తె డాక్టర్ సునీత వేసిన పిటిషన్‌ను ఇప్పటికే సుప్రీంకోర్టు స్వీకరించిన సంగతి తెలిసిందే. రానున్న రోజుల్లో వివేకా హత్య కేసు మరెన్ని మలుపులు తిరగనుందో మరి!