అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు. చదువు పూర్తి చేసుకుని, ఉద్యోగం చేస్తూ కుటుంబానికి తానున్నానంటూ భరోసా ఇస్తున్న దశలో…అనుకోని సంఘటన. సినిమాల్లో, పీడకలల్లో చోటు చేసుకున్నట్టుగా రియల్ లైఫ్‌లో ఓ విషాదం. ఇది నిజం కాకపోతే బాగుండు అనిపించే ఓ కుటుంబ గాథ. రెండేళ్లుగా ఓ కుటుంబం అనుభవిస్తున్న నరకవేదన.
తిరుపతి బర్డ్‌లో ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని, మళ్లీ మామూలు జీవితంపై ఆశలు రేకెత్తిస్తున్న వైనం. ఇవాళ డిశ్చార్జ్ అవుతున్న ఓ యువతి బాధాతప్త హృదయగాథ. ఆ బిడ్డ మళ్లీ మూమూలు మనిషి అవుతుందని భరోసా నింపిన బర్డ్ సేవ గురించి చెప్పుకోవాల్సిన సమయం ఇది.
అనకాపల్లి జిల్లా తునికి చెందిన సత్యనారాయణరాజు దంపతులకు ఇద్దరు కూతుళ్లు. ఇద్దరూ బాగా చదువుకున్నారు. పెద్ద మ్మాయి ఈఎన్‌టీ స్పెషలిస్ట్, చిన్నమ్మాయి సూర్య (27) ఇంజనీరింగ్ పట్టభద్రురాలు. సంతోషంగా జీవనం సాగిస్తున్న ఆ కుటుంబంలో రెండేళ్ల క్రితం ఊహించని విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ యాక్సిడెంట్ ఆ కుటుంబానికి షాక్ ఇచ్చింది. హైదరాబాద్‌లో ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పని చేస్తున్న చిన్నమ్మాయి సూర్య రోడ్డు ప్రమాదానికి గురైంది. తలకు, ఇతరత్రా తీవ్ర గాయాలయ్యాయి.
అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఎవరినీ గుర్తు పట్టలేని దయనీయ స్థితి. మాట పడిపోయింది. దీంతో తల్లిదండ్రులు, సోదరి ఆవేదన వర్ణనాతీతం. బతికించుకోడానికి తల్లిదండ్రులతో పాటు డాక్టరైన పెద్దమ్మాయి ఆస్పత్రులను నివాసాలుగా మార్చుకున్న పరిస్థితి.
విశాఖ, హైదరాబాద్, గుంటూరు తదితర నగరాల్లోని పలు ప్రముఖ ఆస్పత్రులో వైద్యం అందించారు. రోజుల తరబడి ఆస్పత్రుల్లో వైద్యం అందించారు. భూమి అమ్మి సూర్యను బతికించుకోడానికి కుటుంబ సభ్యులు తాపత్రయ పడ్డారు. బతికించుకోవడం ఒక ఎత్తైతే, జీవశ్చవంలా ఉన్న సూర్యను మామూలు మనిషి చేసుకోవడం ఎలా అనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది. మార్గం చూపు దేవుడా అని ఆ కలియుగం దైవం శ్రీవేంకటేశ్వరస్వామిని వేడుకున్నారు. ఆ దేవుడు మొర ఆలకించారు. ఆ కలియుగ దైవమే… బర్డ్ రూపంలో కొత్త జీవితాన్ని ప్రసాదించేందుకు ముందుకొచ్చాడనే ఫీలింగ్.
ఆ యువతిని తిరుపతిలో బాలాజీ వికలాంగుల శస్త్ర చికిత్స పరిశోధన, పునరావాస కేంద్రం (బర్డ్)కు తీసుకెళ్లారు. ఇది టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తోంది. బర్డ్ ప్రారంభం నుంచి అక్కడ పేదలకు మోకీళ్లు, తుంటి ఎముకలకు మాత్రమే ఉచిత శస్త్ర చికిత్స అందిస్తున్నారు. అయితే సమాజంలో పెరుగుతున్న వైద్య అవసరాల డిమాండ్లను పరిగణలోకి తీసుకుని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ఖరీదైన జబ్బులకు ఉచిత వైద్య సేవలు అందించాలని ఆలోచించారు.
ఇందులో భాగంగా కాక్లియర్ ఇంప్లాంటేషన్ చేసేందుకు బర్డ్‌ను సన్నద్ధం చేశారు. ప్రస్తుతం ఈ ఆస్పత్రి స్పెషల్ ఆఫీసర్‌గా డాక్టర్ రెడ్డెప్పరెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పుట్టుకతోనే చెవుడు, మూగ సమస్యలతో బాధపడే పిల్లలకు కాక్లియర్ ఇంప్లాంటేషన్ చేయడం వల్ల వినికిడి సమస్య తొలగిపోయి తల్లిదండ్రుల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ఐదేళ్లలోపు పిల్లలకైతే మంచి ఫలితాలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతారు. ప్రమాదవశాత్తు మాట పోయిన వాళ్లకు కూడా ఈ ఆపరేషన్ చేస్తారు. అది కూడా సూర్యకు మొదటి ఆపరేషన్‌తో బర్డ్ కొత్త అంకానికి తెరలేపింది.
ఈ నేపథ్యంలో తునికి చెందిన సూర్య అనే యువతికి బర్డ్‌లో కాక్లియర్ ఇంప్లాంటేషన్ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్టు డాక్టర్ రెడ్డెప్పరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహాయ నిధి కింద ఖరీదైన ఆపరేషన్‌ను ఉచితంగా చేసినట్టు ఆయన చెప్పారు. ప్రస్తుతం తమ బిడ్డ లేచి కూచుంటోందని, తెలుగు, ఇంగ్లీష్‌లో ఏం రాసినా గుర్తు పడుతోందని తండ్రి సత్యనారాయణరాజు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన పెద్ద కూతురు పేరు, అలాగే ప్రమాద సమయంలో తన వెంట ఉన్న స్నేహితురాలి పేరు చెబుతున్నట్టు తండ్రి హృదయం మురిసిపోతోంది. త్వరలో తమను కూడా బిడ్డ గుర్తు పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
గతంతో పోల్చుకుంటే, ఎన్నో వేల రెట్లు ఆరోగ్యం కుదుటపడిందని ఆయన ఆనందభాష్పాలు రాల్చడం గమనార్హం. ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని సోమవారం ఇంటికి వెళుతున్నట్టు సత్యనారాయణరాజు తెలిపారు. వచ్చే నెలలో మరిన్ని కాక్లియర్ ఇంప్లాంటేషన్ ఆపరేషన్లు చేయనున్నట్టు డాక్టర్ రెడ్డెప్పరెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఆ ఆపరేషన్ కోసం 25 మంది వరకూ రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు.