రాజకీయ నాయకుల మధ్య ఈకాలంలొ ప్రత్యక్ష యుద్ధాల కన్నా పరోక్ష యుద్ధాలు ఎక్కువగా జరుగుతున్నాయి. టెక్నాలజీ పెరిగి సోషల్ మీడియా వెయ్యి కాళ్ళ జెర్రీ మాదిరిగా విస్తరించాక ట్విట్టర్ అనేది ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ట్విట్టర్ వివాదాలు సృష్టించగలదు. వాటిని రాజేయగలదు. కొన్ని రోజులపాటు ఆ మంటను ఆర్పకుండా చూడగలదు. అంతటి శక్తిమంతమైన సాధనం ట్విట్టర్. ఒక రాజకీయ నాయకుడు లేదా సెలబ్రిటీ (ఆడ కావొచ్చు, మొగ కావొచ్చు) ఎలాంటి వాళ్ళో తెలియచేయడానికి లేదా వారి గురించి ఒక అంచనాకు రావడానికి ట్విట్టర్ ఒక సాధనం. దీని ద్వారా మేలు చేయవచ్చు. కీడు చేయవచ్చు. దీనికి రెండువైపులా పదును ఉంటుంది.
ట్విట్టర్ తనకు తానై వివాదాలు సృష్టించలేదు. దాని ఉపయోగించి రాజకీయ నాయకులు వివాదాలు సృష్టిస్తారు. రావణ కాష్టం రగిలిస్తారు. ట్విట్టర్ లో చేసే కామెంట్ల ద్వారా కొందరు పరువు పోగొట్టుకుంటే, కొందరు పరువు ప్రతిష్టలు పెంచుకుంటారు. ఇదంతా ఎందుకు చెప్పుకోవలసి వస్తున్నదంటే, ఎన్టీఆర్ వైద్య విశ్వ విద్యాలయం పేరు మార్పు వ్యవహారంలో ట్విట్టర్ లో కామెంట్లే ప్రధాన వార్తలు అవుతున్నాయి. ప్రధానంగా టీడీపీ విషయానికొస్తే ఈ వ్యవహారంలో ఎవరెవరు ఎలా స్పందిస్తున్నారు అనే దానిపై లెక్కలు వేసుకుంటున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల ట్వీట్లపై రచ్చ జరుగుతోంది.
ఎన్టీఆర్ కుమారుడైన హీరో బాలయ్య చాలా ఘాటుగా స్పందించాడని, మనుమడైన జూనియర్ ఎన్టీఆర్ స్పందన బలహీనంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు తిరిగి ఇటు తిరిగి టీడీపీ శ్రేణులు… నందమూరి అభిమానుల మధ్య చిచ్చు రగిల్చింది. సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధమే నడుస్తోంది. యూనివర్సిటీ పేరు మార్పుపై అన్ని పార్టీల నాయకులు స్పందించారు. ప్రభుత్వ తీరుపై అందరూ మండిపడ్డారు. చివరకు వైఎస్ కుమార్తె షర్మిల కూడా అన్న జగన్ నిర్ణయం తప్పని చెప్పింది. అయితే ఇదంతా ఒక ఎత్తైతే అందరి దృష్టి నందమూరి కుటుంబ సభ్యులపైనే పడింది. ముందుగా ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ పేరిట ప్రెస్ నోట్ రిలీజ్ అయ్యింది.
అటు తరువాత పురందేశ్వరి కూడా స్పందించారు. ఎన్టీఆర్ మనువలు కల్యాణ్ రామ్ తో పాటు మరికొందరు కూడా స్పందించారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ కొద్దిగా ఆలస్యంగా స్పందించారు. ఆయన్నుంచి ఘాటైన వ్యాఖ్యలు వస్తాయని భావించారు టీడీపీ నాయకులు. ఓ రేంజ్ లో విరుచుకుపడతారని ఆశించారు. కానీ కర్ర విరగకూడదు.. పాము చావకూడదు అన్నట్టు కామెంట్స్ చేశాడు మనవడు. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇద్దరూ గొప్పవాళ్ళే అన్నాడు.పేర్లు మార్చినంతమాత్రాన వారి స్థాయి తగ్గదు అని ట్విట్టర్ లో రాశాడు.
ఇది టీడీపీ నాయకులకు రుచించలేదు. పెదవి విరిచారు. ఆయన ట్వీట్ వైసీపీకి ఫేవర్ గా ఉందన్నారు. పిల్లనిచ్చిన మామతో పాటు తన సన్నిహితులుగా చెప్పుకొంటున్న కొడాలి నాని, వల్లభనేని వంశీ వైసీపీలో ఉండడంతోనే వెనక్కి తగ్గారన్న టాక్ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో జూనియర్ కు కావాల్సిన వారు వైసీపీలో టిక్కెట్లు ఆశిస్తున్నారు. వారికి రాజకీయంగా మేలు జరగాలంటే ప్రస్తుతానికి తాను తగ్గి ఉండాల్సి వచ్చిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకూ టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్ నాయకుడంటూ నమ్మిన వారు సైతం జూనియర్ వ్యవహార శైలి మింగుడుపడడం లేదు.
వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేలా జూనియర్ వ్యవహరించారని సోషల్ మీడియాలో సపోర్టు చేస్తూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నందమూరి నందమూరి బాలయ్య ఆలస్యంగా స్పందించినా ఘాటుగా కామెంట్ పెట్టాడు. ప్రభుత్వం పై హాట్ హాట్ కామెంట్స్ చేశాడు. మార్చేయ్యడానికి, తీసేయ్యడానికి ఎన్టీఆర్ అన్నది పేరు కాదు.. ఒక సంస్కృతి..ఓ నాగరికత..తెలుగుజాతి వెన్నుముక..తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్టు మార్చాడు..కొడుకు గద్దెనెక్కి హెల్త్ యూనివర్సిటీ మార్చాడు. మిమ్మల్ని మార్చడానికి ప్రజలున్నారు.. పంచభూతాలున్నాయి…తస్మాత్ జాగ్రత్త అంటూ బాలకృష్ణ ఓ రెంజ్ లో ఫైర్ అయ్యాడు. ఇవి నందమూరి అభిమానులకు టానిక్ లా పనిచేస్తున్నాయి.
బాలయ్య వ్యాఖ్యలను అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. కొందరు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ నాయకుడు కాదని, టీడీపీలో సభ్యుడు కానీ, నాయకుడు కానీ కాదని, అందుకే మామూలుగా కామెంట్ చేశాడని అంటున్నారు. అదే సమయంలో బాలయ్య టీడీపీ నాయకుడు కావడమే కాకుండా ఎమ్మెల్యే కూడా కాబట్టి సహజంగానే ఘాటుగా స్పందించాడని, అది ఆయన సహజ లక్షణం కూడా అని అంటున్నారు. మొత్తానికైతే ఈ ఎపిసోడ్ నందమూరి అభిమానుల మధ్య చిచ్చు రగిల్చిందని అభిప్రాయపడుతున్నారు. సీఎం జగన్ కు కావాల్సింది కూడా అదేనని భావిస్తున్నారు.