ముగ్గురు అసంతృప్త శాసనసభ్యుల మీద అనర్హత వేటు విధించారు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వారు ముగ్గురూ. పార్టీ విధివిధానాలను ధిక్కరించినందుకు వారిపై సీఎల్పీ లీడర్ సిద్ధరామయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నారు. అలా కర్ణాటక అసెంబ్లీలో ముగ్గురు కాంగ్రెస్ వ్యతిరేక – కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద వేటుపడింది.
అలిగిన 15 మంది ఎమ్మెల్యేల్లో అలా ముగ్గురు లిస్ట్ నుంచి బయటకు వెళ్లిపోయారు. మిగిలింది పన్నెండు మంది. వీరిలో కొందరు అప్పుడే తమ అలక తీరిందని తాము కాంగ్రెస్ వైపే అంటున్నారట! తమ కోపం జేడీఎస్ మీదే కానీ, కాంగ్రెస్ మీద కాదనట్టుగా కొందరు మళ్లీ సర్దుకుపోతాం అంటున్నారట.
ఇలాంటి నేపథ్యంలో కర్ణాటక అసెంబ్లీలో మళ్లీ నంబర్ గేమ్ లో మార్పు కనిపిస్తూ ఉంది. 221 మంది ఎమ్మెల్యేలు మిగిలారు కర్ణాటక అసెంబ్లీలో. వారిలో స్పీకర్ పోగా మిగిలింది 220 మంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఈ లెక్క ప్రకారం కావాల్సిన కనీస సభ్యుల సంఖ్య 111 మంది. అయితే భారతీయ జనతా పార్టీకి ఉన్న బలం 105 మంది మాత్రమే. ఆరుమంది ఎమ్మెల్యేల బలం అదనంగా అవసరం.
బీజేపీ వ్యతిరేకంగా దాదాపు 99 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక యడ్యూరప్ప బలపరీక్షను ఎదుర్కొనాల్సి వచ్చినప్పుడు ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తారో, ఏ పార్టీ తరఫున ఎంతమంది ఉంటారో ఎవరికీ తెలియనట్టే.
అయితే పూర్తి మెజారిటీ లేకపోయినా యడ్యూరప్పను సీఎంగా చేస్తున్నారనే విషయం స్పష్టం అవుతోంది.
ఫిరాయింపులు, అనర్హత వేటు పిటిషన్లూ, కోర్టు తీర్పులు.. కర్ణాటక రాజకీయాన్ని ముందు ముందు కూడా ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టిచూస్తే యడ్యూరప్ప ప్రభుత్వం నిలబడటం, నడవడం కూడా అంత తేలికేమీకాదని పరిశీలకులు అంటున్నారు.